English   

బెల్లంకొండ‌.. హీరోయిన్ల వ‌రాల దండ‌..

Bellamkonda Sai Sreenivas 1
2018-02-19 13:30:03

అవును.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో అంతా ఇదే అంటున్నారు మ‌నోన్ని చూసి. అల్లుడుశీనుతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌పుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్ ను చూసి అంతా షాక‌య్యారు. నిర్మాత ఫ్యామిలీ నుంచి వ‌చ్చాడు కాబ‌ట్టి న‌ట‌న‌లో ఇంకా చాలా మెరుగ‌వ్వాలి అనుకున్నారు. కానీ స్టార్ హీరోల‌కు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో మనోడి బూస్ట‌ప్ చూసి చాలా మంది షాకైయ్యుంటారు. అల్లుడుశీనుకే 40 కోట్ల బ‌డ్జెట్ పెట్టారంటే.. గ‌తేడాది మ‌రో 40 కోట్ల‌తో జ‌య జాన‌కి నాయ‌కా చేసాడు బోయ‌పాటి శీను. తొలి సినిమాతో పోలిస్తే మూడో సినిమాకు చాలా మెరుగ‌య్యాడు ఈ హీరో. డాన్సులు.. ఫైట్ల‌లో దుమ్ము దులిపేసాడు. ఒక్క న‌ట‌న‌లో మాత్రం ఇంకా కాస్త మెరుగవ్వాలి. ఎమోష‌నల్ సీన్స్ బాగానే చేసాడు కానీ సెంటిమెంట్.. డైలాగుల విష‌యంలోనే ఇంకా వెన‌కే ఉన్నాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్.

త్వ‌ర‌లోనే అవి కూడా క‌నుమ‌రుగైపోయే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది. ఎందుకంటే ఈ కుర్రాడు ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో రిజిష్ట‌ర్ అయిపోయాడు కాబ‌ట్టి. మ‌రో రెండు సినిమాలు ప‌డితే క‌చ్చితంగా బెల్లంకొండ వార‌సుడు కూడా నిల‌బ‌డ‌టం గ్యారెంటీ. ప్ర‌స్తుతం శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో సాక్ష్యం సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్. త‌న ప్ర‌తీ సినిమాలోనూ స్టార్ హీరోయిన్ల‌తోనే జోడీ క‌డుతున్నాడు ఈ కుర్ర హీరో. ఇప్ప‌టికే తొలి సినిమాలో స‌మంత‌, త‌మ‌న్నా తో ఆడిన బెల్లంకొండ‌.. త‌ర్వాత కూడా త‌మ‌న్నాతో చిందేసాడు. ఇక మూడో సినిమాలో ర‌కుల్ తో రొమాన్స్ చేసాడు. ఇప్పుడు పూజా హెగ్డే.. నెక్ట్స్ కాజ‌ల్ ను లైన్ లోకి తీసుకొస్తున్నాడు ఈ హీరో. శ్రీ‌నివాస్ రెడ్డి అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌బోయే ఈ చిత్రంలో కాజ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి బెల్లంకొండ దూకుడు చూసి అంతా ఫిదా అయిపోతున్నారిప్పుడు.

More Related Stories