English   

భ‌ర‌త్ అనే నేను రివ్యూ

Mahesh-ban-review
2018-04-20 13:37:24

మ‌హేశ్ బాబుకు, రాజ‌కీయాల‌కు చాలా గ్యాప్ ఉంటుంది. కానీ భ‌ర‌త్ అనే నేనులో తొలిసారి పూర్తిస్థాయి రాజ‌కీయ సినిమా చేసాడు సూప‌ర్ స్టార్. దాంతో భ‌ర‌త్ ఎలా ఉంటాడో అనే ఆస‌క్తి అంద‌ర్లోనూ పెరిగిపోయింది. మ‌రి వాటిని మ‌హేశ్-కొర‌టాల కాంబినేష‌న్ అందుకుందా లేదా..? 

క‌థ‌: భ‌ర‌త్(మ‌హేశ్ బాబు) ముఖ్య‌మంత్రి (శ‌ర‌త్ కుమార్) కొడుకు. చిన్న‌పుడే లండ‌న్ వెళ్లి అక్క‌డే ఉంటాడు. ఇండియాకు దూరంగా ఉన్న ఆయ‌న తండ్రి మ‌ర‌ణ వార్త‌తో ఇండియాకు వ‌స్తాడు. వ‌చ్చీ రాగానే అన్నీ చూసుకుని మ‌ళ్ళీ లండ‌న్ వెళ్తోన్న స‌మ‌యంలో భ‌ర‌త్ తండ్రికి ప్రాణ స్నేహితుడు అయిన వ‌ర్ధ‌న్ రావు ముఖ్య‌మంత్రి సీట్ లో భ‌ర‌త్ ను కూర్చోబెడ‌తాడు. పార్టీలో చీలిక వ‌చ్చే స‌మ‌స్య ఉంద‌ని.. భ‌ర‌త్ ను ముఖ్య‌మంత్రిని చేస్తాడు వ‌ర్ధ‌న‌రావు. కానీ ఆ త‌ర్వాత త‌న స‌త్తా చూపిస్తాడు భ‌ర‌త్. త‌న‌దైన పాల‌న‌తో త‌క్కువ రోజుల్లోనే ప్ర‌జ‌ల్లో మంచి పేరు సంపాదిస్తాడు. ఆ త‌ర్వాత భ‌ర‌త్ ను దించ‌డానికి రాజ‌కీయాలు మొద‌లవుతాయి. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది.. ఎలా భ‌ర‌త్ అనుకున్న‌ది సాధించాడు అనేది మిగిలిన క‌థ‌.. 

క‌థ‌నం: విదేశాల్లో ఉండే కొడుకు.. అక్క‌డే చ‌దువులు.. స‌డ‌న్ గా తండ్రి చ‌నిపోవ‌డం.. ఆయ‌న రాష్ట్ర ముఖ్య‌మంత్రి కావ‌డం.. కొడుకు వ‌చ్చి ముఖ్య‌మంత్రి కావ‌డం.. ఆ త‌ర్వాత ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాల‌కు పార్టీలో గొడ‌వ‌లు.. ప్ర‌జ‌ల్లో మంచి పేరు.. ఇవ‌న్నీ లీడ‌ర్ సినిమా క‌థ‌లాగే ఉంటుంది. కానీ భ‌ర‌త్ అనే నేను క‌థ కూడా ఇదే. కాక‌పోతే పూర్తిగా శేఖ‌ర్ క‌మ్ముల సినిమా.. ఇది కొర‌టాల సినిమా. క‌మ‌ర్షియ‌ల్ తో పాటు సందేశాన్ని కూడా స‌రిగ్గా అందించాడు ఈ ద‌ర్శ‌కుడు. మ‌హేశ్ కూడా ముందు వెన‌క ఆలోచించ‌కుండా కొర‌టాల చెప్పిన క‌థ‌ను పూర్తిగా న‌మ్మేసాడు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌గానే ఎక్క‌డా టైమ్ వేస్ట్ చేయ‌కుండా ప‌నిలోకి దిగిపోయాడు భ‌ర‌త్. దాంతో సినిమాలో వేగం కూడా పెరిగింది. ట్రాఫిక్ రూల్స్ పై తీసుకునే నిర్ణ‌యంతో పాటు సినిమాలో కొన్ని విప్ల‌వాత్మ‌క మార్పుల‌ను సూచించాడు కొర‌టాల‌. అవి సినిమా కాబ‌ట్టి సాధ్యం అవుతాయి కానీ బ‌య‌ట మాత్రం అస్స‌లు వ‌ర్క‌వుట్ కావు. నిజ‌మైన రాజ‌కీయాలు అలా ఉంటే దేశం ఏడాదిలోనే అమెరికాను కూడా దాటేస్తుంది. కానీ ఊహాజ‌నిమ‌తమైన క‌థ‌నే అద్భుతంగా చూపించాడు ఈ ద‌ర్శ‌కుడు. ఫ‌స్టాఫ్ లోనే తానేం చెప్పాల‌నుకుంటున్నాడో చెప్పేసాడు కొర‌టాల‌. ఆ త‌ర్వాత కూడా అదే టెంపో కంటిన్యూ చేసాడు. అయితే శ్రీ‌మంతుడు త‌ర‌హా క‌మ‌ర్షియ‌ల్ అంశాలు ఇందులో క‌నిపించ‌వు. దాంతో తాను సిన్సియ‌ర్ గా అనుకున్న క‌థ‌కు న్యాయం చేయ‌డానికి అన్నీ త్యాగం చేసాడు కొర‌టాల‌. 

న‌టీన‌టులు:మ‌హేశ్ బాబు న‌ట‌న గురించి ఈ రోజు కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ఎన్నోసార్లు ఉత్త‌మ న‌టుడిగా నిరూపించుకున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. ముఖ్య‌మంత్రి భ‌ర‌త్ గా అంతఃక‌ర‌ణ శుద్ధితో న‌టించాడు. ముఖ్యంగా అసెంబ్లీ సీన్స్.. సెకండాఫ్ లో వ‌చ్చే మీడియాను విమ‌ర్శించే సీన్ లో అయితే మ‌హేశ్ లోని అత్యుత్త‌మ న‌టుడు క‌నిపించాడు. ఇక హీరోయిన్ కైరా అద్వాని పాట‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయింది. ఆమెకు పెద్ద‌గా కీల‌క‌మైన పాత్ర ప‌డ‌లేదు. ప్ర‌కాశ్ రాజ్ ఉన్నంత వ‌ర‌కు బాగా చేసాడు. శ‌ర‌త్ కుమార్ ది చిన్న పాత్రే. పోసాని.. పృథ్వీ.. ఇలా అంతా క‌థ‌లో ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయే పాత్ర‌లే. ముఖ్య‌మంత్రి పిఎస్ గా బ్ర‌హ్మాజీ బాగా చేసాడు. 

టెక్నిక‌ల్ టీం: దేవీ శ్రీ ప్ర‌సాద్ మ‌రోసారి భ‌ర‌త్ అనే నేనుకు బ‌లంగా నిలిచాడు. ఈయ‌న పాట‌లు సోసోగా ఉన్నాయి కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ఎడిటింగ్ కాస్త వీక్ అనిపించింది. సెకండాఫ్ లో కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపించిన ఫీల్ క‌లుగుతుంది. ఫ‌స్టాఫ్ లో కూడా కొన్ని సీన్స్ సినిమాలో ఇబ్బంది క‌లిగిస్తాయి. రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాసిన పాట‌లు బాగున్నాయి. వ‌చ్చాడ‌య్యో సామి లాంటివి అర్థ‌వంతంగా అనిపించాయి. శ్రీ‌హ‌రి నాను అందించిన క‌థ‌ను త‌న‌దైన శైలిలో పూర్తిస్థాయిలో రాసుకున్నాడు కొర‌టాల. సిన్సియ‌ర్ క‌థ‌కు త‌న‌వంతు న్యాయం చేసాడు ఈ ద‌ర్శ‌కుడు.

చివ‌ర‌గా: భ‌ర‌త్ అనే నేను.. ఓ హానెస్ట్ అటెంప్ట్..

రేటింగ్: 3.5/5

More Related Stories