English   

ఛ‌ల్ మోహ‌న్ రంగా రివ్యూ

Chal-Mohan-ranga-Review
2018-04-05 14:45:32

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్మాత‌గా మారి చేసిన తొలి సినిమా కావ‌డంతో ఛ‌ల్ మోహ‌న్ రంగా నుంచి తొలి నుంచి అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. అస‌లు ఈ చిత్రంలో ఏదో ఉంది కాబ‌ట్టే ప‌వ‌న్ నిర్మాత‌గా మారాడు.. పైగా త్రివిక్ర‌మ్ క‌థ ఇచ్చాడు క‌దా అనుకున్నారంతా. మ‌రి ఇప్పుడు సినిమా విడుద‌లైంది. ఆ త్రివిక్ర‌మ్ మార్క్ సినిమాలో క‌నిపించిందా..? 

క‌థ‌:  మోహన్ రంగ (నితిన్) యావ‌రేజ్ స్టూడెంట్. చ‌దువులో అంతంత‌మాత్ర‌మే. థ‌ర్డ్ క్లాస్ మార్కుల‌తో డిగ్రీ పూర్తి చేస్తాడు. మిడిల్ క్లాస్ అబ్బాయి కావ‌డంతో అమెరికా వెళ్లాల‌న్న అత‌డి క‌ల చిన్న‌ప్ప‌ట్నుంచీ అలాగే ఉంటుంది. పైగా వీసా కూడా రాదు. అలాంటి టైమ్ లో ఓ చిన్న ప‌నితో వీసా సంపాదిస్తాడు. అమెరికా వెళ్లిన త‌ర్వాత అక్క‌డ ఓ పార్టీ నుంచి బ‌య‌టికి వ‌స్తూ మేఘ (మేఘా ఆకాష్) ను చూస్తాడు. వీళ్ల ప‌రిచ‌యం గొడవతో మొదలైన స్నేహంగా మారి.. ప్రేమ‌గా ట‌ర్న్ అవుతుంది. కానీ చిన్న అనుమానాల‌తో క్లారిటీ లేక ఇద్ద‌రూ విడిపోతారు. మ‌ళ్లీ ఎప్పుడు క‌లిసారు.. అస‌లు ఎందుకు విడిపోయారు..? ఈ ఇద్ద‌రి జీవితాల్లో వ‌చ్చిన మార్పేంటి అనేది మిగిలిన క‌థ‌.. 

క‌థ‌నం : చిన్న‌ప్పుడే ఓ అమ్మాయిని చూసే హీరో.. ఆమె అమెరికా వెళ్లింద‌ని తెలిసి అక్క‌డికి వెళ్లాల‌నుకోవ‌డం.. స‌రిగ్గా చ‌దువుకోకుండా సిగరెట్లు మందు తాగుతూ అల్ల‌రి చిల్ల‌రిగా తిర‌గ‌డం.. అమెరికా వెళ్ల‌డం.. అక్క‌డ అమ్మాయిని పడేయడం.. త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో వదిలేయ‌డం.. చివ‌ర్లో ఎలాగోలా క‌ల‌వ‌డం.. సింపుల్ గా చెప్పాలంటే ఇదే ఛ‌ల్ మోహ‌న్ రంగా క‌థ‌. ఇలాంటి క‌థ‌లు తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు చాలానే వ‌చ్చాయి. మ‌ళ్లీ ఇదే క‌థ‌లో వ‌చ్చాడు ఛ‌ల్ మోహ‌న్ రంగా. కానీ ఎంత పాత క‌థ తీసుకొచ్చినా ఎంట‌ర్ టైనింగ్ గా చెప్తే ప్రేక్ష‌కులు చూస్తారు. ప్ర‌తీ సీన్ లో న‌వ్వులు పూయించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్లారు ద‌ర్శ‌కుడు కృష్ణ‌చైత‌న్య‌.. త్రివిక్ర‌మ్. ముఖ్యంగా పంచ్ డైలాగుల విష‌యంలో త్రివిక్ర‌మ్ మార్క్ క‌నిపించింది. ఓ సీన్ లో హీరో తండ్రి నితిన్ తో అంటాడు ఆ కుక్కు పెడిగ్రీ.. నీకు డిగ్రీ ఒకేసారి చేయించ‌లేనురా అని..! ఇంకోచోట వీడు ప‌గ‌లు అలోవేరా.. రాత్రి చెగువేరా అంటాడు.. ఇలాంటి చ‌మ‌క్కులు సినిమాలో చాలానే ఉన్నాయి.
 
పూర్తిస్థాయిలో త్రివిక్ర‌మ్ రైటింగ్ క‌నిపించింది. కానీ దాని వెన‌క కృష్ణ‌చైత‌న్య కూడా క‌ష్ట‌ప‌డ్డాడు. ఇద్ద‌రూ క‌లిసే సినిమాను ముందుకు న‌డిపించారు. ఫ‌స్టాఫ్ అంతా కామెడీతోనే న‌డిచిపోయింది. ముఖ్యంగా హీరో కారెక్ట‌రైజేష‌న్ కే చాలా టైమ్ తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు. కానీ ప్ర‌తీ సీన్ ను ఎంట‌ర్ టైనింగ్ గా చెప్పే ప్ర‌య‌త్నం చేసాడు. అమెరికా రావ‌డం.. అక్క‌డ హీరోయిన్ తో ప్రేమ‌.. ఆ వెంట‌నే క‌ష్టాలు.. విడిపోవ‌డం.. ఇలా అన్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోతాయి. సెకండాఫ్ లో కూడా క‌థ త‌క్కువ కామెడీ ఎక్కువ‌గా సాగింది. ముఖ్యంగా సీరియ‌స్ సీన్స్ కూడా కామెడీ చేసి పారేసాడు ద‌ర్శ‌కుడు. ఓ వైపు ఎమోష‌న‌ల్ సీన్ ర‌న్ అవుతుంటే.. అండ‌ర్ క‌రెంట్ గా కామెడీ వ‌స్తుంది. కానీ ఎక్క‌డా ఎబ్బెట్టుగా అనిపించ‌దు. అయితే క‌థ అనేది లేక‌పోవ‌డం ఈ చిత్రానికి మైన‌స్. తెలిసిన క‌థ‌నే రెండున్న‌ర గంట‌లు హోల్డ్ చేసాడు. ఇది బి, సి సెంట‌ర్ల వ‌ర‌కు ఎంత వ‌ర‌కు రీచ్ అవుతుంద‌నేది ఛ‌ల్ మోహ‌న్ రంగా విజ‌యాన్ని డిసైడ్ చేయ‌నుంది.

న‌టీన‌టులు:  నితిన్ బాగా చేసాడు. ఇలాంటి పాత్ర‌లు ఆయ‌న‌కు కొట్టిన‌పిండి. పైగా ఇది ఆయ‌న‌కు 25వ సినిమా. త్రివిక్ర‌మ్ ను న‌మ్మి.. కృష్ణ‌చైత‌న్య‌తో క‌లిసి అడుగేసాడు నితిన్. మైల్ స్టోన్ మూవీలో మంచి ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చాడు నితిన్. ఇక మేఘాఆకాశ్ న‌టిగా ఇంకా ఎద‌గాలేమో కానీ అందంగా ఉంది. స్క్రీన్ పై మాయ చేసింది. హీరో ఫ్రెండ్ గా మ‌ధు బాగానే న‌వ్వించాడు. ఫ‌స్టాఫ్ లో హీరో ఆఫీస్ మేనేజ‌ర్ గా ప్ర‌భాస్ శీను బాగా చేసాడు. రావు ర‌మేష్ కారెక్ట‌ర్ చాలా ఎంట‌ర్ టైనింగ్ గా ఉంది. ఇది ఓ ర‌కంగా అ..ఆ సినిమాకు కంటిన్యూగా అనిపించింది. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నిక‌ల్ టీం: థ‌మ‌న్ మ‌రోసారి ఆక‌ట్టుకున్నాడు. తొలిప్రేమ నుంచి ఈయ‌న‌లో చాలా మార్పు వ‌చ్చింది. ఇప్పుడు కూడా రీ ఫ్రెషింగ్ ఆర్ఆర్ ఇచ్చాడు. అయితే పాట‌ల్లో మాత్రం ఎక్క‌డో విన్న ఫీలింగ్ వ‌స్తుంది. ఎస్ఆర్ శేఖ‌ర్ ఎడిటింగ్ ప‌ర్లేదు. సెకండాఫ్ లో కొన్ని సీన్లు బోర్ అనిపిస్తాయి. ఇక న‌ట‌రాజ సుబ్ర‌మ‌ణ్య‌న్ సినిమాటోగ్ర‌ఫీ సూప‌ర్ గా ఉంది. అమెరికా అందాల‌తో పాటు ఊటీ అందాల‌ను కూడా బాగా చూపించాడు. త్రివిక్ర‌మ్ క‌థ పాత‌దే అయినా దాన్ని ఎంట‌ర్ టైనింగ్ గా రాసుకోవ‌డం కృష్ణ‌చైత‌న్య బాగానే స‌క్సెస్ అయ్యాడు. ఈ క‌థ‌ను ఇంత‌కంటే బాగా చెప్ప‌డం కాస్త‌క‌ష్ట‌మే. కానీ ట్రై చేసాడు ఈ ద‌ర్శ‌కుడు.

చివ‌ర‌గా: హైహై రంగా.. ఛ‌ల్ మోహ‌న్ రంగా..

రేటింగ్: 3/5

More Related Stories