English   

బాబుగారి బ‌యోపిక్.. కామెడీగా ఉందిగా..

Chandrababu-biopic
2018-09-25 14:58:11

బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్.. వుడ్ల‌తో ప‌నిలేకుండా అన్ని చోట్లా ఇప్పుడు బ‌యోపిక్ ల ర‌చ్చ న‌డుస్తుంది. ఎవ‌రికి వాళ్లు త‌మ జీవితాల‌పై ఓ సినిమా తీయించుకుంటున్నారు. ఇప్ప‌టికే తెలుగులో మూడు బ‌యోపిక్ లు తెర‌పై ఉన్నాయి. ఇప్పుడు మ‌రో బ‌యోపిక్ కూడా వ‌చ్చేస్తుంది. ఐతే ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ఉంది. ఈ నాలుగు కూడా న‌లుగురు ముఖ్య‌మంత్రుల బ‌యోపిక్ లు కావ‌డం విశేసం. ఇది నిజంగా ఓ షాక్. ఒకేసారి న‌లుగురు ముఖ్య‌మంత్రుల బ‌యోపిక్ లు రావ‌డం అనేది చిన్న విష‌యం కాదు. ఇప్పుడు ఇది జ‌రుగుతుంది. ఇప్ప‌టికే వైఎస్ఆర్ బ‌యోపిక్ యాత్ర మొద‌లైపోయింది. ఇందులో ఆయ‌న జీవితాన్ని మొత్తం చూపించ‌క పోయినా.. వైఎస్ జీవితంలో జ‌రిగిన చాలా సంఘ‌ట‌న‌ల‌ను చూపించ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ‌. మ‌మ్ముట్టి ఇందులో వైఎస్ఆర్ గా న‌టిస్తుండ‌టం మ‌రో విశేషం. ఇక బాల‌య్య హీరోగా వ‌స్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ పై ఆకాశ‌మంత అంచ‌నాలు ఉన్నాయి. క్రిష్ ద‌ర్శ‌కుడు కావ‌డం మ‌రో హైలైట్. 

అస‌లే ఈ మ‌ధ్య ఈయ‌న బ‌యోపిక్ లు తీయ‌డంలో ఎక్స్ ప‌ర్ట్ అయిపోయాడు. ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల త‌ర్వాత ఇప్పుడు కేసీఆర్ బ‌యోపిక్ ఉద్య‌మ‌సింహం కూడా వ‌స్తుంది. ఇది కూడా వైఎస్ఆర్ త‌ర‌హా సినిమానే. అక్క‌డ పాద‌యాత్ర‌ను హైలైట్ చేస్తే.. ఇక్క‌డ కేసీఆర్ దీక్ష‌ను హైలైట్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు అల్లూరి కృష్ణంరాజు. ఇందులో కేసీఆర్ పాత్ర‌లో సీనియ‌ర్ న‌టుడు నాజ‌ర్ న‌టిస్తున్నారు. ఇక ఇప్పుడు చంద్ర‌బాబునాయుడు బ‌యోపిక్ చంద్రోద‌యం కూడా వ‌స్తుంది. వెంక‌ట ర‌మ‌ణ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో వినోద్ నువ్వుల టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే కామెడీగా ఉంది. స్పూఫ్ చేస్తున్న‌ట్లుంది కానీ బ‌యోపిక్ చేస్తున్న‌ట్లు లేదు అది. ఏదేమైనా ఈ న‌లుగురు ముఖ్య‌మంత్రుల్లో ఏ బ‌యోపిక్ కు ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా ఓటేస్తారో చూడాలిక‌..!

More Related Stories