English   

చి.ల‌.సౌ రివ్యూ

Chi La Sow Telugu Review
2018-08-03 07:11:22

ఈ మ‌ధ్య చిన్న సినిమాల‌కు.. సింపుల్ క‌థ‌ల‌కు క్రేజ్ బాగా పెరిగిపోయింది. చెప్పేది చిన్న క‌థ అయినా కూడా క్లారిటీగా ఎంట‌ర్ టైనింగ్ గా చెప్తే ప్రేక్ష‌కులు చూస్తున్నారు. ఇప్పుడు చిల‌సౌ కూడా ఇలాగే వ‌చ్చింది. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది..? 

క‌థ‌:
అర్జున్(సుశాంత్) పెళ్లంటే దూరంగా పారిపోతుంటాడు. లైఫ్ లో బాగా సెటిల్ అయి తీరిగ్గా పెళ్లి చేసుకోవాల‌నుకునే టైప్. కానీ ఇంట్లో వాళ్లు అంతా పెళ్లి అంటూ బాదేస్తుంటారు. ఇంట్లో వాళ్ల పోరు ప‌డ‌లేక అంజ‌లి(రుహాని) ను పెళ్లి చూపులు చూస్తాడు. కానీ తొలి చూపులోనే త‌న‌కు న‌చ్చ‌లేద‌ని.. త‌న‌కు ఇప్పుడు పెళ్లి చేసుకోవాల‌ని లేద‌ని చెప్తాడు. కానీ అంజ‌లి ఉన్న ప‌రిస్థితులు మాత్రం మ‌రోలా ఉంటాయి. ఆమెకు త‌న త‌ల్లి(రోహిణి)తో వింత ఆరోగ్య స‌మ‌స్య ఉంటుంది. అక్క‌డ్నుంచి అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. అంజ‌లిని ముందు కాద‌ని.. ఆ త‌ర్వాత ప్రేమిస్తాడు అర్జున్. కానీ అప్పుడు అంజ‌లి ఒప్పుకోదు.. అస‌లు చివ‌రికి ఏమైంది అనేది అస‌లు క‌థ‌.. 

క‌థ‌నం: 
పెళ్లిచూపులు సినిమా అంద‌రికీ గుర్తుండే ఉంటుంది క‌దా.. అందులో ఓ వింత పెళ్లిచూపులుతో ఇద్ద‌రి మ‌న‌సులు క‌లుస్తాయి. ఇక్క‌డ చిల‌సౌలో కూడా ఇలాంటి ఓ పెళ్లిచూపులుతోనే సినిమాను మొద‌లుపెట్టాడు ద‌ర్శ‌కుడు రాహుల్. తాను చెప్పాల‌నుకున్న క‌థ‌ను తొలి 15 నిమిషాల్లోనే హిలేరియ‌స్ గా చెప్పాడు ద‌ర్శ‌కుడు. ఆ త‌ర్వాత అస‌లు క‌థ మొద‌లుపెట్టాడు. ఒక్క‌సారి హీరోయిన్ క‌థ‌లోకి వ‌చ్చిన త‌ర్వాత కాస్త నెమ్మ‌దిగా  సాగుతుంది. హీరోయిన్ ప్లాష్ బ్యాక్ ఎమోష‌న‌ల్ గా ఉన్నా కూడా సీరియ‌ల్ లా అనిపిస్తుంది. మ‌ళ్లీ ప్ర‌స్తుతానికి వ‌చ్చిన త‌ర్వాత క‌థ బాగా వెళ్తుంది. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు కూడా హీరో హీరోయిన్ ను ఒక గ‌దిలో పెట్టేసి.. చాలా తెలివిగా క‌థ న‌డిపించాడు ద‌ర్శ‌కుడు రాహుల్. సెకండాఫ్ లో  కూడా క‌థ‌లో కొన్ని ట్విస్టులు ఇచ్చాడు. నిజానికి అది క‌థ‌తో సంబంధం లేక‌పోయినా కూడా హీరో హీరోయిన్ మ‌ధ్య ప్రేమ పుట్ట‌డం కోసం ఆ సీన్స్ డిజైన్ చేసాడు ద‌ర్శ‌కుడు. ఓవైపు ప్రేమ ఉన్నా చెప్ప‌లేని ప‌రిస్థితుల్లో హీరోయిన్.. ప్రేమిస్తున్నా ఎందుకు దాచుకుంటున్నాడో తెలియ‌ని హీరో మ‌ధ్య ప్రేమ‌క‌థ ఆక‌ట్టుకుంటుంది. చివ‌రికి అంతా ఊహించే సింపుల్ క్లైమాక్స్ తో ముగించేసాడు రాహుల్.

న‌టీన‌టులు:
సుశాంత్ కెరీర్ లో తొలిసారి బాగా న‌టించాడు. సెటిల్డ్ గా అనిపించాడు. సింపుల్ క‌థే కావ‌డంతో పెద్ద‌గా ఎక్స్ ప్రెష‌న్స్ తో కూడా ప‌నిలేకుండా పోయింది. ఇక రుహానీ శ‌ర్మ షో మొత్తం త‌నే తీసుకుంది. త‌న ఎక్స్ ప్రెష‌న్స్ కు తోడు న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా చిన్మ‌యి వాయిస్ ఆ అమ్మాయికి బాగా ప్ల‌స్ అయింది. హీరో ఫ్రెండ్ గా వెన్నెల కిషోర్ బాగున్నాడు.. న‌వ్వించాడు కూడా. హీరోయిన్ త‌ల్లి పాత్ర‌లో రోహిణి బాగుంది. జ‌య‌ప్ర‌కాశ్.. సంజ‌య్ స్వ‌రూప్.. అంతా చిన్న చిన్న పాత్ర‌ల్లో క‌నిపించారు. 

టెక్నిక‌ల్ టీం:
ఇలాంటి సినిమాల‌కు సంగీతం కీల‌కం. ప్ర‌శాంత్ విహారి సింపుల్ అండ్ సూదింగ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాట‌లు కూడా బాగానే ఉన్నాయి. ఆర్ఆర్ ఆక‌ట్టుకుంటుంది. ఎడిటింగ్ బాగానే ఉంది. ఇప్ప‌టికే చాలా సీన్స్ ఎడిటింగ్ లో తీసేసిన‌ట్లు అర్థ‌మైపోతుంది. ట్రైల‌ర్ లో ఉన్న కొన్ని డైలాగులు సినిమాలో క‌నిపించ‌వు. సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు.. నీట్ గా అనిపిస్తుంది. ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ బాగానే ఉన్నాయి. పెద్ద‌గా ఖ‌ర్చుతో కూడా ప‌నిలేదు ఈ క‌థ‌కు. న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్.. ద‌ర్శ‌కుడిగానూ ఆక‌ట్టుకున్నాడు. ముఖ్యంగా ర‌చ‌యిత‌గా మంచి మార్కులు ప‌డ‌తాయి. 

చివ‌ర‌గా:
చిల‌సౌ.. రీ ఫ్రెషింగ్ సింపుల్ ల‌వ్ స్టోరీ..!

రేటింగ్: 3/5

More Related Stories