English   

మళ్లీ రావోయీ.. బహుదూరపు బాటసారీ.. 

Dasari-Narayana-Rao
2018-05-04 06:45:42

ఇవాళ దాసరి జయంతి.. అంటే పరిశ్రమకు పండగ రోజు. ఆయన దూరమై అప్పుడే యేడాది కావొస్తోంది. ఈ యేడాదిలో ఇండస్ట్రీలో ఎన్ని సమస్యలు వచ్చాయో అందరికీ తెలుసు. ప్రతి సమస్యకూ పరిష్కారం కంటే ముందు, ఇప్పుడు పెద్దాయన ఉంటే బావుండు అనుకోని పెద్దమనిషి లేడంటే అతిశయోక్తి కాదు. సమస్య ఏదైనా.. దాసరి కాంపౌండ్ లోకి ఎంటర్ అయితే.. న్యాయం జరుగుతుంది. అది దాసరి సినిమా పరిశ్రమపై వేసిన ముద్ర. కానీ ఇప్పుడా ముద్ర శాశ్వత నిద్రలో ఉంది. ఇదే అదనుగా పరిశ్రమలో అలజడులకు అంతు లేకుండా పోయింది. దాసరి.. బహుముఖ ప్రజ్ఞాశాలి.. 152 సినిమాల దర్శకుడు. 250కి పైగా సినిమాలకు స్క్రీన్ ప్లే రైటర్, పాటల రచయిత, మాటలు రాశారు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన గొప్ప నటుడు కూడా. ఎన్నో సిల్వర్ జూబ్లీ చిత్రాల దర్శకుడు. అన్నిటికి మించి ఎందరినో స్టార్స్ గా మలచిన కథకుడు.. మరెందరినో దర్శకులుగా తీర్చి దిద్దిన దిగ్ధర్శకుడు.  

ఒక సినిమా పూర్తి కావడానికి 24క్రాఫ్ట్స్ కష్టం కావాలి. కానీ ఆ శాఖల్లో ఎవరికి కష్టం వచ్చినా దాసరి కావాలి. 24 క్రాఫ్ట్స్ లో ఆయన అనఫీషియల్ మెంబర్. సాధారణ కార్మికుడు నుంచి అసాధారణ స్టార్ వరకూ.. ఏదో సందర్భంలో దాసరి సహాయం తీసుకోని వారు తెలుగు సినిమా పరిశ్రమలో లేరనేది నిజం. ఇదే తెలుగులో అంతకు ముందు, ఆ తర్వాత వచ్చిన ఎందరో దిగ్ధర్శకుల నుంచి.. దాసరి స్థానాన్ని వేరు చేస్తుంది. అదే ఇప్పుడాయన జయంతిని డైరెక్టర్స్ డేగా ప్రకటించడానికి కారణమైంది. 
 
దాసరి నారాయణరావు.. అంతులేని కీర్తిని సంపాదించుకున్న ఈ వ్యక్తి ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చాడు.. అతని నేపథ్యం ఏంటీ.? లక్షలమంది ఉన్న పరిశ్రమలో ఇంతటి ఖ్యాతి ఇతనికి మాత్రమే ఎలా దక్కింది..? ఈ అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం.. అతను ప్రతిభను మాత్రమే నమ్ముకున్న సాధారణ వ్యక్తి. ఆ ప్రతిభ అతన్ని అసాధారణ శక్తిగా మార్చింది. అటుపై తనదైన నాయకత్వ లక్షణాలతో తెలుగు చిత్రసీమకు పెద్దదిక్కుగా మారాడు.. మరలిరాని లోకాలకు తరలియినా.. మరపురాని మనిషిగా నిలిచిపోయాడు. దాసరి గురించి బ్రీఫ్ గా చెబితే..  రంగస్థలమే లోకం అనుకున్న ఓ కుర్రాడు అనుకోకుండా వెండితెర వైపు వచ్చాడు. ప్రతిభకు హద్దేలేని ఆ చోట ఆయనో శక్తిలా మారాడు. హీరోల చుట్టూ తిరిగే కమర్షియల్ మార్కెట్ ను తన వైపు తిప్పుకున్నాడు. కానీ కమర్షియల్ పేరిట కథలు విడిచి సాము చేయలేదు.. వెండితెరకు మానవ సంబంధాల్లోని లోతుల్ని పరిచయం చేసి... ప్రేక్షకుల మనసు లోతుల్లో తిరుగులేని స్థానం సంపాదించుకున్నాడు. దర్శకుడు అనే పదానికే గౌరవం తెచ్చిన తొలి వ్యక్తిగా నిలిచాడు.  
 
డైరెక్టర్స్ డే.. ఎంత పెద్ద మాట ఇది. ఆ మాటకు అన్ని విధాలా అర్హుడైన అసమాన ప్రతిభాశాలి దాసరికి దర్శకుల సంఘం వినమ్రంగా అందిస్తోన్న గౌరవం ఇది. దాసరి జయంతిని డైరెక్టర్స్ డే గా డిక్లేర్ చేయడం అంటే దర్శకత్వం అనే పదాన్నే గౌరవించినట్టు. కెప్టెన్ అనే మాటకే వన్నె తెచ్చినట్టు. ఓ వ్యవస్థ తనను తానే సత్కరించుకున్నట్టు. దాసరి ప్రభావం పరోక్షంగా అయినా లేని దర్శకులు అరుదు. అలాంటి వారు కూడా హర్షం వ్యక్తం చేస్తోన్న సందర్భం ఇది. ఇలాంటి సందర్భానికి పూనుకున్న దర్శకుల సంఘం నిర్ణయం నిజంగా అభినందనీయం.
 
పరిశ్రమంతా తన కుటుంబమే అనుకున్న వ్యక్తి కోసం ఏదైనా చేయాలని ఎవరైనా అనుకుంటారు. కానీ ఇలా డైరెక్టర్స్ డే గా డిక్లేర్ చేయడం.. భావి తరాలకు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రసరింప చేయడమే. కొత్తగా వచ్చే ఏ దర్శకుడైనా దాసరిని స్మరించుకుంటాడు. దర్శకులుగా ఎవరి అడుగులు వారివే అయినా.. తెలుగు సినిమా కథా పరంపరకు కొత్త పంథా నేర్పిన ఆయన అడుగు జాడలు మాత్రం అనుసరణీయం. దాసరి తర్వాత ఎవరు..? గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీ మొత్తం వినిపిస్తోన్న ప్రశ్న. కానీ ఇది సమాధానం లేని ప్రశ్న. ఎందుకంటే దాసరి తర్వాత ఎవరు వచ్చినా.. దాసరి కాలేరు. కావాలని ప్రయత్నించినా.. ఆయన్ని అనుకరించినట్టే అవుతుంది కానీ.. ఆయన్లా ఇండస్ట్రీని ఇల్లుగా భావించే వారు మళ్లీ రావడం అసాధ్యం. కానీ.. ఆయన స్థాయిలో కాకపోయినా.. ఎవరో ఒకరు.. కాస్త పెద్దరికం తీసుకుంటే బావుంటుందనేదీ నిజం. 

డైరెక్టర్స్ డే.. దర్శక కుల గురువుగా కీర్తించబడిన ఆ మనిషికి ఇంతకు మించిన గొప్ప సత్కారం ఏముంటుంది. ఆ గౌరవాన్ని అందుకోవడానికి ఆయన భౌతికంగా లేకపోవచ్చు. కానీ  దాసరి ఆత్మ  తెలుగు సినిమా పరిశ్రమ చుట్టే తిరుగుతుందనేది నిజం. ఏదేమైనా మనిషి వెళ్లిపోయాడు.. జ్ఞాపకాలను వదలి.. అడుగులు కనుమరుగయ్యాయి. అడుగు జాడలు నిలిపి.. ఆ వృక్షం నేలరాలింది.. ఎన్నో ఫలాలను అందించి.. ఎందరో కష్టాలను తీర్చిన మనిషి కనిపించని తీరాలకు వెళ్లిపోయాడు.. కన్నీళ్లను మిగిల్చి..  నీ జ్ఞాపకాలతో బరువెక్కుతోన్న హృదయాల భరోసా కోసమైనా.. ఓ బహుదూరపు బాటసారి.. మళ్లీ ఒక్కసారి రావోయీ.. 

More Related Stories