English   

దొంగ ట్రైలర్ టాక్.. కార్తి మరోసారి కొట్టేలా ఉన్నాడే..

donga
2019-12-11 05:05:59

ఖైదీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తీ.. ఇప్పుడు మరోసారి చిరంజీవి టైటిల్ తోనే వస్తున్నాడు. ఈయన నటించిన తంబి సినిమా తెలుగులో దొంగగా వస్తుంది. దృశ్యం లాంటి సెన్సేషనల్ సినిమాను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ దీనికి దర్శకుడు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై జీతు జోసెఫ్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో కార్తీ వదిన జ్యోతిక హీరో అక్క పాత్రలో నటించింది. సత్యరాజ్ మరో కీలక పాత్రలో నటించాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత కార్తి మరో హిట్ కచ్చితంగా కొట్టేలా కనిపిస్తున్నాడు. పక్కా పకడ్బందీ స్క్రిప్ట్ తో ఈ సినిమా సిద్ధం చేసాడు దర్శకుడు జీతూ. డిసెంబర్ 20న ఈ సినిమా తమిళనాట విడుదల కానుంది. మరి తెలుగులో కూడా అప్పుడే వస్తుందా లేదా అనేది చూడాలి. 'చిన్నా ఇంకా నా కళ్లల్లోనే ఉన్నాడు..నాకిక్కడ ఉన్న ఒక్క సంతోషం, ఓదార్పు వాడు మాత్రమే' అంటూ జ్యోతిక చెప్పే డైలాగ్స్ తో ట్రైలర్ మొదలై సస్పెన్స్ గా ఉంది. అయితే ఈ చిత్రంలో కార్తి దొంగ తమ్ముడి పాత్రలో వచ్చి.. అక్కడ్నుంచి కథను ఎలా ముందుకు తీసుకెళ్లాడనేది ఆసక్తికరంగా మారుతుంది. సినిమాకు అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్ బాగా కలిసొచ్చేలా కనిపిస్తుంది. ఎటు చూసుకున్నా కూడా కార్తి మరో విజయం వైపు అడుగేసేలా కనిపిస్తున్నాడు.

 

More Related Stories