English   

హీరో కోసం వచ్చి.. గుండె ఆగి

Dulquer-Salmaan
2018-08-06 11:37:23

అభిమానం హద్దుల్లో ఉండాలి. మరీ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయనంతగా ఉండకూడదు. మన తర్వాతే ఎవరైనా అనేది గుర్తించుకుంటే చాలా వరకూ ప్రమాదాలు తప్పించుకోవచ్చు. లేటెస్ట్ గా ఓ అభిమాని తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా తన అభిమాన హీరోను చూడాలని వెళ్లాడు. అసలే ఆ హీరోకు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాష్ట్రం నలు మూలల నుంచీ అభిమానులు అతని కోసం పోటెత్తారు. ఆ పోటులో ఈ అభిమాని హృదయం ఆగింది. అంతే అక్కడిక్కడే చనిపోయాడు. ఇదంతా జరిగింది కేరళలో.. 

మాలీవుడ్ లో దుల్కర్ సాల్మన్ కు ఎంత స్టార్డమ్ ఉందో వేరే చెప్పక్కర్లేదు. మమ్మూట్టి తనయుడిగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ గ్రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడతను. ఇప్పుడు దక్షిణాదిలోనూ తనదైన ముద్ర వేసే ప్రయత్నాల్లో ఉన్న దుల్కర్ లేటెస్ట్ గా బాలీవుడ్ డెబ్యూ కూడా ఇచ్చాడు. అతను అక్కడ నటించిన తొలి సినిమా కార్వా.. గత శుక్రవారం విడుదలైంది. ఇక రీసెంట్ గా దుల్కర్ సాల్మన్ కేరళలోని కొల్లం పట్టణంలో ఓ మాల్ ఓపెనింగ్ కు వచ్చాడు. ఈ విషయాన్ని మాల్ వాళ్లు విపరీతంగా ప్రచారం చేశారు. అంతే.. ఆ చుట్టుపక్కల టౌన్స్ నుంచీ గ్రామాల నుంచీ అభిమానులు తరలి వచ్చారు. అలాగే హరి(43) అనే వ్యక్తి దుల్కర్ ను చూడ్డానికి త్రివేండ్రం నుంచి వచ్చాడు. కానీ అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఆ తోపులాటలో అతనికి హార్ట్ ఎటాక్ వచ్చి ఒక్కసారిగా కింద పడిపోయాడు. వెంటనే అక్కడి వారు హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. కానీ చనిపోయాడు.

నిజానికి ఈ వ్యక్తికి గతంలోనూ హార్ట్ ఎటాక్ వచ్చింది. కానీ అప్పుడు చిన్న స్ట్రోక్. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది పోయి ఇంత జనంలోకి రావడం, అదే టైమ్ లో మళ్లీ హార్ట్ ఎటాక్ రావడంతో అతను చనిపోయాడు. అయితే ఓ సెలబ్రిటీ వస్తున్నప్పుడు పోలీస్ లు సరైన ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. కానీ పోలీస్ లు మాత్రం ఆ మాల్ నిర్వాహకులపై కేస్ లు పెట్టడం విశేషం.

More Related Stories