English   

ఏక్‌ మినీ కథ మూవీ రివ్యూ 

EK Mini Katha
2021-05-27 20:09:32

‘ఏక్‌ మినీ కథ’.. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ ద‌గ్గ‌ర నుంచి అంద‌రిలో ఆస‌క్తి పెంచుతూ వ‌చ్చింది. ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ లు అంద‌ర్ని విశేషంగా ఆక‌ట్టుకోవడ‌మే కాకుండా సోష‌ల్ మీడియా ట్రెండింగ్ లో నిలిచాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ  ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలైంది. మరి అంచనాలను ‘ఏక్ మినీ క‌థ‌’ ఏ మేరకు అందుకుందో చూద్దాం..!! 

కథ: సంతోష్ (సంతోష్ శోభన్) తన అంగం చిన్నదిగా వుంది అని చిన్నప్పటి నుంచి ఫీలవుతూ వుంటాడు.  అనుకోకుండా ఓ అమ్మాయి (కావ్య థాపర్) ని చూసి మనసు పారేసుకుంటాడు. కానీ శోభనాన్ని మాత్రం వాయిదా వేస్తుంటాడు. ‘సైజ్‌’పెంచుకున్నా తర్వాతే శోభనాన్ని జరుపుకోవాలని భావించిన శోభన్‌.. మళ్లీ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు.సంతోష్‌ సమస్యకు పరిష్కారం లభించిందా లేదా? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరకు ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేష‌ణ‌: మొదటి పది నిమిషాల్లోనే కథానాయకుడిగా ద్వారా నేరుగా కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఆ విషయం ఎవరికీ చెప్పలేక సంతోష్‌ పడే వేదన.. అభద్రతా భావం దాన్ని అధిగమించేందుకు పాటించే చిట్కాలు, సర్జరీ కోసం వైద్యుడి దగ్గరకు వెళ్లడం ఇలా వరుస సన్నివేశాలతో కథ సాగిపోతుంటుంది.సంతోష్‌ పడే ఇబ్బంది నుంచి హాస్యం పుట్టేలా ప్రతి సన్నివేశాన్ని రాసుకున్నారు. దీంతో ప్రథమార్ధమంతా నవ్వులతో సాగిపోతుంది. ముఖ్యంగా సంతోష్‌, అతడి స్నేహితుడు సుదర్శన్‌ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పంచుతాయి. అమృతతో అనుకోకుండా పెళ్లి జరగడంతో కథ మలుపు తిరుగుతుంది.

ఇక సెకండాఫ్‌ మొత్తం శోభ‌నాన్ని వాయిదా వేయ‌డం అనే పాయింట్ పైనే సాగుతుంది. చెప్పడానికి కథ పెద్దగా లేకపోవడంతో కొన్ని సీన్లను అతికించి సినిమాను నడిపించారు. స‌ప్త‌గిరి కామెడీ కాస్త నవ్వించినా... రిపీట్ అయిన ఫీలింగ్ క‌లుగుతుంది.  సెకండాఫ్‌లో శ్రద్ధదాస్‌ ఎంట్రీ తర్వాతో ఏదైన అద్భుతం జరుగుతందని భావించిన ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. ఎమోషన్‌ కూడా అంతగా పండలేదు. 

న‌టీన‌టుల ప‌ర్ఫామెన్స్: సంతోష్‌ శోభన్‌ నటన మెప్పిస్తుంది. తన సమస్యే గురించి చెబుతున్నారన్న భావనతో మథనపడే యువకుడి పాత్రలో చక్కగా సరిపోయారు. హీరోయిన్‌ కావ్య థాపర్‌ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో బాగా చేసింది. అపార్థం చేసుకునే తండ్రిగా బ్రహ్మాజీ మెప్పించాడు. కమెడియన్లు సుదర్శన్‌, సప్తగిరి నవ్వించే ప్రయత్నం చేశారు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

టెక్నిక‌ల్ టీం: చర్చించడానికి కూడా కాస్త ఇబ్బంది పడే ఈ పాయింట్‌ను తీసుకుని దాన్ని అంతే సున్నితంగా దర్శకుడు కార్తీక్‌ తీర్చిదిద్దాడు. కథ అంతా కథానాయకుడి సమస్య చుట్టూనే సాగుతున్నా, అసభ్యతకు తావులేకుండా హాస్యం పాళ్లు ఎక్కువ ఉండేలా చూసుకున్నారు. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం బాగుంది. గుర్తిండిపోయే పాటలు అయితే లేవు కానీ.. నేపథ్య సంగీతం మాత్రం చాలా బాగుంది.  గోకుల్‌ భారతి సినిమాటోగ్రాఫి ఆకట్టుకుంటుంది. యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

చివరగా: ‘ఏక్‌ మినీ కథ‌’...మినీ రిలీఫ్ కోసం..!!

రేటింగ్ : 2.75/5.

More Related Stories