బాహుబలిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్.. Pawan Kalyan
2019-08-14 18:48:13

తెలుగు సినిమా మాత్రమే కాదు.. ఇండియన్ సినిమా స్థాయిని పెంచేసిన సినిమా బాహుబలి. రాజమౌళి చేసిన ఈ యజ్ఞం తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ సంచలనాలు సృష్టించింది. తెలుగు సినిమా మార్కెట్ ను ఒకేసారి 20 రెట్లు పెంచింది బాహుబలి. అప్పటి వరకు 100 కోట్ల కోసం చూస్తున్న వాళ్లకు 2000 కోట్లు చూపించింది బాహుబలి. ఇలాంటి సినిమా మళ్లీ చేయాలంటే రాజమౌళికి కూడా సాధ్యం అవుతుందో లేదో తెలియదు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పుడు ఈ చిత్రంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. బాహుబలిని మించిన సినిమాలు మనకు తీయగలిగే సత్తా ఉందంటున్నాడు పవర్ స్టార్. ఈయన ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ తెలకపల్లి రవి రచించిన 'మన సినిమాలు, అనుభవాలు-చరిత్ర-పరిణామం' పుస్తకాన్ని ఆవిష్కరించాడు. అక్కడే తన అభిప్రాయాలను వెల్లడించాడు పవర్ స్టార్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్ప స్టోరీ టెల్లర్స్ ఉన్నారని చెప్పాడు పవన్. ప్రపంచాన్ని శాసించగలిగే సినిమాలు మన తెలుగు నుంచి తీయగలం.. అలా తీయాలంటే ఇలాంటి పుస్తకాలు చాలా ఉపయోగపడతాయంటూ చెప్పుకొచ్చాడు పవర్ స్టార్. ఇలాంటి అద్భుతమైన పుస్తకాన్ని రచించిన సీనియర్ పాత్రికేయులు శ్రీ తెలకపల్లి రవి గారికి అభినందనలు అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టాడు పవన్. ఈ పుస్తకం కోసం రెండేళ్ల పాటు శ్రమించాడు రవి. ఇక ఇలాంటి గొప్ప పుస్తకాన్ని తాను ఆవిష్కరించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పాడు పవన్ కళ్యాణ్. మనం తలుచుకుంటే బాహుబలి కాదు.. దానికి మించిన సినిమాలు కూడా తీయగలమని.. అలాంటి సత్తా తమకు ఉందని చెబుతున్నాడు పవర్ స్టార్. ఒక సామాజిక సమస్యను కమర్షియల్ కోణంలో రాయగలగడంలో పరుచూరి బ్రదర్స్ దిట్ట అని.. అది మనల్ని ప్రభావితం చేసేలా రాస్తారని చెప్పాడు పవన్. అలాంటి రచన శక్తి అందరికి ఉండదని.. అది అరుదైన కళ అంటున్నాడు పవన్. సావిత్రి గారు, ఎస్వీ రంగారావు గారు ఎవరో ఈ జనరేషన్ లో చాలా మందికి తెలియదని.. సావిత్రిగారి బయోపిక్ తీస్తే గానీ ఆమె సామర్ధ్యం, కష్టాన్ని మనం గుర్తించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఈయన చెప్పిన దాంట్లో కొంత నిజం కూడా లేకపోలేదు. సావిత్రి అంటే కేవలం ఓ నటిగానే అందరికీ తెలుసు.. కానీ ఆమె జీవితం ఏంటనేది మాత్రం ఇప్పుడిప్పుడే అందరికీ తెలిసింది. మరి పవన్ చెప్పినట్లుగానే నిజంగా మన తెలుగు సినిమాకు అంత సత్తా ఉందా.. మరో బాహుబలిని మనం తీయగలమా అనేది దర్శకులే నిర్ణయించాలి. 

More Related Stories