ఎమోషనల్ జర్నీ ఆఫ్ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి..SyeRaaNarsimhaReddy.jpg
2019-09-19 07:21:04

సైరా ట్రైలర్ వ‌చ్చేసింది. అన్న‌య్య అభిమానుల‌కు పండ‌గ మ‌ళ్లీ తెచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న సైరా ట్రైలర్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత అభిమానులు ఆనందంతో గాల్లో గంతులేయ‌కుండా ఉండ‌లేరు. సురేంద‌ర్ రెడ్డి కూడా మ‌రో రాజ‌మౌళిలా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడ‌ని అర్థ‌మైపోతుంది. విజువ‌ల్ వండ‌ర్ కాదు.. దాన్ని మించి సైరా ముస్తాబ‌వుతుంది. ముఖ్యంగా వార్ సీన్స్ సినిమాలో హైలైట్ అవుతున్నాయ‌ని టీజ‌ర్ తోనే చూపించాడు ద‌ర్శ‌కుడు. ముందుగా చెప్పిన‌ట్లుగా ట్రైలర్ లో చిరంజీవి త‌ప్ప ఇంకేం లేదు. మూడు నిమిషాల ట్రైలర్ లో చిరును చూపిస్తూనే అన్ని పాత్రలపై ఫోకస్ చేసాడు సురేందర్ రెడ్డి.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాట జీవితాన్ని ఎలివేట్ చేయడానికే ఈ సినిమా తెరకెక్కించారని అర్థమవుతుంది. మరిచిపోయిన చరిత్రను మళ్లీ గుర్తు చేస్తున్నాడు చిరంజీవి. ట్రైలర్ లో ప్రతీ సీన్ ఉయ్యాలవాడ బ్రిటీష్ వాళ్లపై చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తుంది. ట్రైలర్ మొదట్నుంచీ కూడా నరసింహారెడ్డిని ఎలివేట్ చేస్తూ వెళ్లి.. ఆ తర్వాత ఆయన జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. టీజర్ మినహా ఇప్పటి వరకు చిరంజీవిని అక్కడక్కడా మాత్రమే చూపిస్తూ వచ్చిన సురేందర్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా చూపించేసాడు. అన్నయ్య ఈ ఏజ్ లో చేసిన రచ్చ చూసి అభిమానులు పండగ చేసుకోకుండా ఉండలేకపోతున్నారు.

కచ్చితంగా రేపు థియేటర్స్ లోకి సినిమా వచ్చిన తర్వాత విజిల్స్ పడుతూనే ఉంటాయని చెప్పడం అతిశయోక్తి కాదేమో..? దానికి తోడు ఇండియ‌న్ స్క్రీన్ పై చూడ‌న‌టువంటి భారీ యాక్ష‌న్ సీక్వెన్సులు.. అత్యున్న‌తంగా ఉండే విజువ‌ల్ ఎఫెక్ట్స్.. ఒక్క‌టేమిటి అన్నీ మ‌రో స్థాయిలో సినిమాలో ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తుంది. ఖైదీ నెం.150ని త‌క్కువ బ‌డ్జెట్ లో ముగించేసిన చ‌ర‌ణ్.. ఈ సారి మాత్రం తండ్రి సినిమా కోసం 250 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నాడు. ఈ సినిమాలో గొరిల్లా యుద్ధాలు కూడా హైలైట్ కానున్నాయి.

ట్రైలర్ విడుద‌లైన క్ష‌ణం నుంచే సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తుంది. అక్టోబర్ 2న సినిమా విడుదల కానుంది. మొత్తానికి సినిమా అంతా ఎమోషనల్ జర్నీ ఆఫ్ ఉయ్యాలవాడగా తెరకెక్కుతుందని అర్థమవుతుంది.

More Related Stories