సైరాపై బన్నీ ట్వీట్.. వివాదాలకు తెరదించిన అల్లు అర్జున్..Allu Arjun
2019-09-30 15:34:51

సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగా హీరోలంతా వచ్చి.. ఒక్క బన్నీ మాత్రమే రాలేదు. దాంతో మళ్లీ మెగా హీరోలతో బన్నీ సపరేట్ అయిపోయాడని.. వాళ్లను బన్నీ దూరం పెట్టేసాడని వార్తలు వచ్చాయి. పైగా సైరాపై ఒక్క ట్వీట్ కానీ.. మెసేజ్ కానీ చేయకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. కానీ ఇప్పుడు అన్నీ ఒకే ఒక్క ట్వీట్ తో ఎగిరిపోయేలా చేసాడు అల్లు వారబ్బాయి. ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్ సైరా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. మరోవైపు త్రివిక్రమ్ సినిమాతో బన్నీ బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో విడుదలకు మరో రెండు రోజులు ఉందనగా.. సైరాపై ట్వీట్ చేసాడు బన్నీ. ఈ ఒక్క ట్వీట్ ఇప్పుడు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేసింది. తాను చిన్నప్పట్నుంచీ చిరంజీవిని ఎలా అయితే చూడానుకుంటున్నానో అలా సైరాలో ఉన్నాడంటూ పొగిడేసాడు బన్నీ. సైరా నరసింహా రెడ్డి.. ఓ అద్భుతమైన సినిమా.. స్వాతంత్య్ర సమరయోధుడి కథ.. ఇది తెలుగు సినిమాకు గర్వకారణం.. కొన్నేళ్ల కింద మగధీర సినిమా చూసినపుడు చిరంజీవి గారిని ఇలాంటి పాత్రలో చూడాలనుకున్నాను.. ఇప్పుడు నా సోదరుడు రామ్ చరణ్ దీన్ని నిజం చేసాడంటూ ట్వీట్ చేసాడు అల్లు అర్జున్. ఇలాంటి సినిమాలు ఇంకా వచ్చినపుడే తెలుగు సినిమా స్థాయి మరింత పెరుగుతుందని.. ఇప్పుడు సైరా కూడా టాలీవుడ్ రేంజ్ పెంచే సినిమా అంటూ పోస్ట్ చేసాడు బన్నీ. ఓ తండ్రికి కొడుకు ఇంతకంటే బెస్ట్ గిఫ్ట్ ఇంకేం ఇవ్వలేడని ట్వీట్ చేసాడు బన్నీ. దర్శకుడు సురేందర్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు బన్నీ. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకున్నాడు అల్లు అర్జున్. మొత్తానికి బన్నీ విషెస్ చూసి కొన్ని ప్రశ్నలకు సమాధానం వచ్చేసింది.

More Related Stories