సీడెడ్‌లో బాలయ్యకు షాక్.. తక్కువకే రూలర్ రైట్స్..Balakrishna
2019-11-13 17:06:28

బాలకృష్ణ సినిమాలకు నైజం ఆంధ్ర సీడెడ్ అనే తేడా ఉండదు. అన్నిచోట్ల మంచి మార్కెట్ ఉంది. మాస్ ఫాలోయింగ్ పుష్కలంగా ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఈయన కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూలర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోనాల్ చౌహాన్, వేదిక ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా బిజినెస్ కూడా ఊహించిన దానికంటే వేగంగానే జరుగుతుంది. 

జై సింహ లాంటి హిట్ సినిమా తర్వాత కె.ఎస్.రవికుమార్, బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో కచ్చితంగా బిజినెస్ పరుగులు పెడుతుందని దర్శక నిర్మాతలు కూడా ఊహించారు. కానీ బయట మాత్రం ఆ స్థాయి లేదు అని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే డిసెంబర్ 20న సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతి రోజు పండగే విడుదల కానుంది. దానికి తోడు మరో 5 రోజుల తర్వాత రవితేజ డిస్కో రాజా కూడా వస్తుంది. దాంతో రెండు క్రేజీ సినిమాల మధ్య బాలయ్య పోటీ పడుతున్నారు కాబట్టి బిజినెస్ పై కూడా అది ప్రభావం చూపిస్తోంది. 

ముఖ్యంగా సీడెడ్ ఏరియాలో బాలయ్య సినిమాకు కోరుకున్న బిజినెస్ జరగడం లేదు. అక్కడ ఆరున్నర కోట్ల వరకు అమ్మడానికి నిర్మాత సి.కళ్యాణ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ చివరికి ఆరు కోట్ల స్థాయిలోనే ఈ సినిమా అక్కడ బిజినెస్ చేసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య సీడెడ్ అత్యధిక కలెక్షన్లు 8 కోట్లు.. అది కూడా ఐదేళ్ల కింద బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన లెజెండ్ సినిమా సాధించింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కనీసం ఆరు కోట్ల మార్కు కూడా అందుకోలేదు. అందుకే ఇప్పుడు రూలర్ సినిమాకు ఊహించిన బిజినెస్ జరగడం లేదనే ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 20న విడుదల కానుంది ఈ చిత్రం. 

More Related Stories