సరిలేరు నీకెవ్వరు రివ్యూSarileru Neekevvaru Review
2020-01-11 19:14:57

పండగ సినిమా అంటే ఉండే అంచనాలు వేరు.. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు కూడా ఆకాశమంత అంచనాలతో వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, వరస విజయాల అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన  ఈ చిత్రం అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పించిందో లేదో చూద్దాం.. 

కథ:

అజయ్ (మహేష్ బాబు) బోర్డర్‌లో దేశానికి సేవ చేసే సోల్జర్. అనాథ కావడంతో దేశమే కుటుంబం అనుకుంటాడు. అంతా సాఫీగా సాగుతున్న క్రమంలోనే తనతో పాటే పనిచేసే మరో సైనికుడు అజయ్ (సత్యదేవ్) ఓ ఆపరేషన్ లో ప్రాణాలు కోల్పోతాడు. అతడి కుటుంబం కర్నూల్ లో ఉంటుంది. అజయ్ తల్లి భారతి (విజయశాంతి) ప్రొఫెసర్. మంత్రి (ప్రకాశ్ రాజ్) కారణంగా ఆమె కుటుంబమే ప్రాణాపాయ స్థితిలో పడుతుంది. అలాంటి సమయంలో అజయ్ చనిపోయిన విషయాన్ని మేజర్ అజయ్ తల్లి భారతికి చెప్పడానికి వస్తాడు.. ఆ క్రమంలోనే వచ్చే దారిలో (రష్మిక మందన్న) కుటుంబాన్ని కలుసుకుంటాడు. కర్నూల్ వచ్చిన తర్వాత అసలు సమస్యను తెలుసుకుని భారతి కుటుంబాన్ని అజయ్ కాపాడాడా లేదా.. మంత్రి పనిపట్టాడా అనేది అసలు కథ.. 

కథనం:

కొన్ని సినిమాలకు ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది.. దర్శకుడు అనిల్ రావిపూడిపై ఉన్న నమ్మకమో ఏమో తెలియదు కానీ.. సరిలేరు నీకెవ్వరు విషయంలో చాలా మందిలో ముందు నుంచి అదే అనిపించింది. సినిమా చూసిన తర్వాత అదే నమ్మకం నిజమైంది.. పక్కా కమర్షియల్ సినిమా తీస్తున్నాం.. అని చెప్పడంతోనే రొటీన్ కథకు సిద్ధమైపోయి రండి అని.. ప్రేక్షకులకు అనిల్ రావిపూడి, మహేష్ బాబు చెప్పకనే చెప్పేశారు.. సినిమాలో కూడా రొటీన్ కథ అయినా స్క్రీన్ ప్లేతో చాలావరకు మాయ చేసాడు అనిల్ రావిపూడి..

ఇంటర్వెల్ వరకు ఎలాగోలా కామెడీతో బండి లాగించిన అనిల్ రావిపూడి.. సెకండాఫ్ లో అసలు కథపై ఫోకస్ చేశాడు.. పండక్కి వచ్చినప్పుడు అన్ని మసాలాలు కరెక్ట్ గా వేస్తే వంటకం అదే బాగుంటుంది.. ఆ నమ్మకంతోనే సరిలేరు నీకెవ్వరు సినిమాను అనిల్ తెరకెక్కించాడేమో అనిపించింది.. అభిమానులకు ఏం కావాలో అన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేశాడు దర్శకుడు.. ఫస్ట్ హాఫ్ అంత కాశ్మీర్ ఎపిసోడ్ తో పాటు.. ట్రైన్ ఎపిసోడ్ తో పర్లేదనిపించాడు.. అనిల్ రావిపూడి గత సినిమాలతో పోలిస్తే మాత్రం ఇందులో కామెడీ కాస్త తక్కువగా ఉంది.. అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చి సెకండాఫ్ పై అంచనాలు పెంచేశాడు..

తెలిసిన కథే కావడంతో ఎక్కువగా మాస్ ఆడియన్స్ పై ఫోకస్ చేశాడు అనిల్ రావిపూడి.. చాలా చోట్ల ఈ సన్నివేశాలు బాగానే వర్కౌట్ అయ్యాయి.. ముఖ్యంగా రాజకీయ నాయకులపై మహేష్ బాబు వేసిన పంచులు బాగా పేలాయి.. ఇంటర్వెల్ ఎపిసోడ్.. సెకండ్ హాఫ్ లో ప్రకాష్ రాజ్ ఇంటికి మహేష్ బాబు వచ్చే సీక్వెన్స్ ఆకట్టుకుంటాయి.. ప్రీ క్లైమాక్స్ లో మహేష్, విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి.. సైనికుడి గొప్పతనం గురించి చెప్పే మాటలు అద్భుతంగా ఉన్నాయి..

ముఖ్యంగా మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ కొత్తగా అనిపించింది.. కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్ని బాగా పండించాడు.. చాలా రోజుల తర్వాత మైండ్ బ్లాక్ పాటలో డాన్సులు కూడా అదరగొట్టాడు సూపర్ స్టార్.. అభిమానులకు ఏం కావాలో అన్ని ఇచ్చేశాడు.. ఈ పండక్కి బాగా ఎంజాయ్ చేసే పర్ఫెక్ట్ కమర్షియల్ మాస్ సినిమా సరిలేరు నీకెవ్వరు..

నటీనటులు:

మహేష్ బాబు నటన గురించి కొత్తగా ఏం చెప్పాలి.. ఆయన అద్భుతమైన నటుడు.. సరిలేరు నీకెవ్వరులో మరింతగా ఓపెన్ అయ్యాడు ఈయన. యాక్షన్ సన్నివేశాల్లో తేడా కనిపించలేదు కానీ కామెడీలో మాత్రం మరో మహేష్ కనిపించాడు. దర్శకుడు అనిల్ ఇచ్చిన ట్రైనింగ్ ఇది. మైండ్ బ్లాక్ పాటలో లుంగీ స్టెప్పులు ఫ్యాన్స్‌కు ఫీస్ట్. రష్మిక మందన్న క్యూట్ యాక్టింగ్‌తో మెప్పించింది. విజయశాంతి చాలా రోజుల తర్వాత స్క్రీన్‌పై చాలా హూందాగా కనిపించింది. ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రకాశ్ రాజ్ మరోసారి విలన్ పాత్రలో రప్ఫాడించాడు. రాజేంద్ర ప్రసాద్ కారెక్టర్ ఫుల్ లెంత్ ఉంది. సంగీతతో పాటు మిగిలిన పాత్రలు కూడా బాగున్నాయి. 

టెక్నికల్ టీం:

దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం పర్లేదు.. పాటలు అంతగా ఆకట్టుకోలేదు కానీ ఆర్ఆర్ బాగుంది. విజువల్‌గా మైండ్ బ్లాక్ పాట చాలా బాగా కుదిరింది. మధ్యలో మహేష్ బాబు వాయిస్ అద్భుతంగా కుదిరింది. సినిమాటోగ్రఫర్ రత్నవేలు పనితనం బాగుంది. సినిమా స్థాయిని తన విజువల్స్ తో పెంచేసాడు ఈయన. కశ్మీర్ అందాలతో పాటు యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా చూపించాడు. తమ్మిరాజు ఎడిటింగ్ జస్ట్ ఓకే.. సెకండాఫ్ కాస్త ల్యాగ్ అయినట్లు అనిపించింది. దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తన బలాన్ని నమ్ముకున్నాడు. కామెడీతో సినిమాను నిలబెట్టాడు. ఫస్టాఫ్ ట్రైన్ సీక్వెన్స్ ఈయన బలమెంతో చూపించింది. వినోదంతో పాటు యాక్షన్ కూడా నింపి పక్కా కమర్షియల్ సినిమా ఇచ్చాడు. రొటీన్ కథే అయినా కూడా అభిమానులను మెప్పించేలా తెరకెక్కించడంలో ఈ కుర్ర దర్శకుడు సక్సెస్ అయ్యాడు. 

చివరగా:

100 % పండగ సినిమా.. పర్ఫెక్ట్ పొంగల్ ఎంటర్‌టైనర్.. 

రేటింగ్: 3.5/5.

More Related Stories