ఆగిపోయిన స్టార్ హీరోల సినిమాలేంటో తెలుసా...tollywood
2020-01-25 06:59:28

స్టార్ హీరో సినిమాలో ఉంటే ఏ సమస్యా ఉండదు. హాయిగా అనుకున్న సమయానికి సినిమా పూర్తవుతుందనుకుంటారు నిర్మాతలు. కానీ కొన్నిసార్లు అలా కూడా జరగదు. స్టార్ హీరోలు ఉన్నా కూడా కొన్నిసినిమాలకు మోక్షం ఉండదు. చిరంజీవి నుంచి ఉదయ్ కిరణ్ వరకు చాలా మంది సినిమాలు కొన్ని మధ్యలోనే.. ఇంకా చెప్పాలంటే ఓపెనింగ్ తోనే అటకెక్కేసాయి. అలాంటి సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..

1. వినాలని ఉంది: మెగాస్టార్ చిరంజీవి, వర్మ కాంబినేషన్ లో సి అశ్వినిదత్ ప్లాన్ చేసిన ఈ చిత్రం రెండు పాటల చిత్రీకరణ తర్వాత ఆగిపోయింది. అప్పట్లో సంజయ్ దత్ జైలు నుంచి విడుదల కావడంతో చిరుసినిమాను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు వర్మ. అప్పట్నుంచే ఈ ఇద్దరికి పడటం లేదు.

2. అబూబ్ బాద్దాగ్ గజదొంగ: 20 ఏళ్ల కిందే హాలీవుడ్ స్థాయిలో చిరంజీవితో ఈ సినిమా ప్లాన్ చేసారు నిర్మాతలు. కానీ మధ్యలోనే ఆగిపోయింది గజదొంగ. దానికి కారణం బడ్జెట్.. కాస్టింగ్. బడ్జెట్ భారీగాపెరిగిపోవడంతో అబూబ్ బాద్దాగ్ గజదొంగ ఓపెనింగ్ లోనే ఆగిపోయింది.

3. భూలోక వీరుడు: బాలయ్యకు భైరవద్వీపం లాంటి సినిమా ఇచ్చిన తర్వాత సింగీతం శ్రీనివాసరావుతో సినిమా చేయాలని ముచ్చటపడ్డాడు చిరు. దాంతో భూలోక వీరుడు అంటూ కథ కూడా సిద్ధం చేసాడు.ఓపెనింగ్ కూడా చేసిన తర్వాత ఈ చిత్రం ఆగిపోయింది.

4. వజ్రాల దొంగ: చిరంజీవితో 24 సినిమాలకు పైగా చేసిన దర్శకుడు కోదండరామిరెడ్డి భారీ స్థాయిలో శ్రీదేవి హీరోయిన్ గా వజ్రాల దొంగ కథ సిద్ధం చేసాడు. అయితే కొంతవరకు షూటింగ్ జరుపుకున్న తర్వాత కథ నచ్చక ఆపేసాడు మెగాస్టార్.

5. నర్తనశాల: 16 ఏళ్ల కింద బాలయ్య దర్శకుడిగా మారి చేయాలనుకున్న సినిమా నర్తనశాల. ఓపెనింగ్ కూడా జరిగింది. అందులో సౌందర్య ద్రౌపతి.. ఉదయ్ కిరణ్ అభిమన్యుడు పాత్ర పోషించాలనుకున్నాడు.అయితే సౌందర్య చనిపోవడంతో అర్ధాంతరంగా ఈ చిత్రాన్ని ఆపేసాడు బాలయ్య.

6. హరహర మహదేవ: బి గోపాల్ దర్శకత్వంలో అట్టహాసంగా మొదలైన బాలయ్య హరహర మహదేవ ఓపెనింగ్ తోనే ఆగిపోయింది. దాంతో పాటు సముద్ర, రవికుమార్ చౌదరి లాంటి దర్శకులతో ప్లాన్ చేసినసినిమాలు కూడా ఆదిలోనే అటకెక్కేసాయి.

7. విక్రమసింహ భూపతి: కోడి రామకృష్ణతో బాలయ్య చేయాలనుకున్న విక్రమసింహ భూపతి సినిమా కూడా 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఆగిపోయింది. మరో దర్శకుడితో పూర్తి చేయాలనిఅనుకున్నా కూడా బాలయ్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.

8. బావమరిది: వెంకటేష్ హీరోగా బి గోపాల్ బావమరిది అనే సినిమా చేయాలని ఓపెనింగ్ కూడా చేసారు. అందులో శోభన్ బాబు బావగా నటించాల్సి ఉంది. అయితే తన పాత్ర నచ్చక శోభన్ బాబు ఈ చిత్ర నుంచి తప్పుకున్నాడు. దాంతో సినిమా కూడా ఆగిపోయింది. ఇదే సినిమాను సుమన్, కృష్ణం రాజు కాంబినేషన్ లో బావ బావమరిది అని చేసారు. మారుతి దర్శకత్వంలో రాధా.. తేజతో సావిత్రి సినిమాలను కూడా కథ నచ్చక పక్కనబెట్టేసాడు వెంకటేష్. అలాగే పెద్ద వంశీతో గాలిపురం రైల్వేస్టేషన్ అనే సినిమాను కూడా వారం రోజుల షూటింగ్ తర్వాత ఆపేసాడు వెంకీ.

9. సత్యాగ్రహి: జానీ సినిమా తర్వాత పవన్ ఎంతో ఇష్టంగా రాసుకున్న కథ సత్యాగ్రహి. ఏఎం రత్నం నిర్మాణంలో ఈ చిత్రం చేయాలనుకున్నారు. ఓపెనింగ్ కూడా జరిగింది. కానీ అక్కడితోనే ఆగిపోయింది ఈ సత్యాగ్రహి. అలాగే కెరీర్ ఆరంభంలో చెప్పాలని ఉంది అంటూ బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ తో ఓ సినిమా చేసాడు పవన్. ఈ చిత్ర షూటింగ్ 70 శాతం పూర్తైంది కూడా. అయితే ఈ చిత్రం మళయాల సినిమారీమేక్ కావడం.. రామోజీరావు మధ్యలోవచ్చి రైట్స్ తీసుకోవడంతో పవన్ ఈ చిత్రం ఆపక తప్పలేదు. ఇదే సినిమాను నువ్వేకావాలి అంటూ విజయభాస్కర్ రీమేక్ చేసాడు.

10. హలో బ్రదర్, దుర్గ: నాగ చైతన్య కెరీర్ చిన్నదే అయినా కూడా ఆగిపోయిన సినిమాలు మాత్రం చాలానే ఉన్నాయి. అందులో శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఈయన చేయాలనుకున్న హలో బ్రదర్, దుర్గ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు అనౌన్స్ మెంట్స్ వచ్చిన తర్వాత ఆగిపోయాయి. ఇప్పటి వరకు దీనికి కారణాలు తనకు తెలియదు అని చెప్పాడు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి.

11. మెరుపు: రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు ధరణితో మెరుపు అనే సినిమాను మొదలుపెట్టారు. ఆరెంజ్ సినిమా తర్వాత ఈ సినిమా చేయాలనుకున్నాడు చరణ్. అయితే అప్పటికే ప్లాప్ ఉండటంతో అది మానేసి సంపత్ నందితో రచ్చ చేసాడు చరణ్. ఇక కొరటాల శివతో కూడా సినిమాకు కొబ్బరికాయ కొట్టి ఆపేసాడు చరణ్.

12. మహేష్, సుకుమార్ సినిమా: రంగస్థలం లాంటి క్లాసిక్ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయాలనుకున్నాడు సుకుమార్. అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.. అయితే అంతా ఓకే అనుకుంటున్న తరుణంలో ఈ చిత్రం నుంచి తప్పుకుని అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరు చేసాడు సూపర్ స్టార్. ప్రస్తుతం ఇదే కథతో అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు సుకుమార్.

13. మిస్టర్ పర్ఫెక్ట్: అతిథి సినిమా తర్వాత సురేందర్ రెడ్డి వర్కింగ్ స్టైల్ నచ్చి మరో సినిమా చేయాలనుకున్నాడు సూపర్ స్టార్. దానికి మిస్టర్ పర్ఫెక్ట్ అనే టైటిల్ కూడా అనుకున్నారు. అయితే కథ నచ్చక సినిమా నుంచి తప్పుకున్నాడు మహేష్.

14. కుర్రాడు: సింహాద్రి సినిమాకు ముందు పవన్ శ్రీధర్ అనే కొత్త దర్శకుడితో కుర్రాడు సినిమాకు కమిటయ్యాడు ఎన్టీఆర్. అయితే షూటింగ్ కొన్ని రోజులు జరిగిన తర్వాత నచ్చక కలిసుందాం రా దర్శకుడు ఉదయ్ శంకర్ ను లైన్ లోకి తీసుకొచ్చాడు జూనియర్. అప్పటికీ కథపై నమ్మకం లేకపోవడంతో సినిమాను ఆపేసాడు ఈయన.

15. పవర్: మెహర్ రమేష్ దర్శకత్వంలో రవితేజ చేయాల్సిన సినిమా పవర్. ఓపెనింగ్ కూడా జరిగి కొన్నిరోజులు షూటింగ్ కూడా చేసారు. అయితే కథ నచ్చక.. మెహర్ టేకింగ్ నచ్చక రవితేజ రిస్క్ చేయలేదు. ఆ తర్వాత పవర్ అనే టైటిల్ తో బాబీతో రవితేజ సినిమా చేసాడు.

16. చిరంజీవి కూతురుతో నిశ్చితార్థం రద్దైన తర్వాత ఉదయ్ కిరణ్ కమిటైన 14 సినిమాల్లో 11 సినిమాలు ఆగిపోయాయి. అందులో ఏఎం రత్నం నిర్మించిన సినిమా 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కూడా విడుదల కాలేదు.

17. ఆరడుగుల బుల్లెట్: గోపీచంద్ హీరోగా బి గోపాల్ తెరకెక్కించిన చిత్రం ఆరడుగుల బుల్లెట్. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ చిత్ర షూటింగ్ పూర్తై కూడా నాలుగేళ్లు అవుతుంది. కానీ ఇప్పటి వరకు విడుదల కాలేదు.

18. ఇంటింటా అన్నమయ్య: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఇంటింటా అన్నమయ్య సినిమా విడుదలకు నోచుకోలేదు. పూర్తైనా కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి బయ్యర్లు ముందుకు రాలేదు. ఇవే కాదు తెలుగులో ఇంకా చాలా సినిమాలు కూడా ఇలాగే మొదలై.. మధ్యలో షూటింగ్ ఆగిపోయి ఎటూ కాకుండా పోయాయి. అందులో కొన్ని మాత్రమే ఇప్పుడు మనం చూసామంతే.

More Related Stories