జనసేనకి షాకిచ్చిన జేడీ...సినిమాలు తప్పనిసరన్న పవన్Pawan Kalyan JD LakshmiNarayana.jpg
2020-01-31 07:48:59

జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ షాకిచ్చారు. గత ఎన్నికల ముందు ఆ పార్టీలో చేరిన ఆయనకు పవన్ సముచిత స్థానం కల్పించారు. ఆయన మొన్న ఎన్నికల్లో విశాఖ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. ఇక తాజాగా జేడీ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు పంపారు. కాగా, పవన్ కల్యాణ్ మళ్లీ సినిమా రంగంలోకి వెళ్లడమే తన రాజీనామాకు కారణమని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

తన జీవితం పూర్తిగా ప్రజాసేవకే అంకితమనీ, సినిమాల్లో నటించబోననీ చెప్పిన పవన్ కల్యాణ్ మాట మార్చారని  లేఖలో లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.  పవన్ కు స్థిరమైన విధివిధానాలు లేవని అందుకే పార్టీ వీడాలని అనుకున్నట్టు ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంట్‌ ఎన్నికల్లో నా వెంట నడిచిన ప్రతీ కార్యకర్తకి, నాకు ఓటు వేసిన ప్రతీ ఓటరుకు కృతజ్ఞతలు.. నేను వ్యక్తిగత స్థాయిలో జన సైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు మరియు పౌరులకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ.. వారందరికీ మరియు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మంచి జరగాలని, భగవంతుడి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..'' అంటూ లేఖలో పేర్కొన్నారు లక్ష్మీ నారాయణ.

దీంతో లక్ష్మీనారాయణ రాజీనామాను ఆమోదిస్తున్నట్టు ఓ ప్రకటన విడుదల చేశారు పవన్. "లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నాం... ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నాం'' అని పేర్కొన్న పవన్.. అదే సందర్భంలో ఆయన రాజీనామాకి కారణం అని చెప్పిన విషయం మీద కౌంటర్ ఇచ్చారు.

"నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే. నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారి కోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి. ఇవన్నీ లక్ష్మీనారాయణ తెలుసుకొని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేది. లక్ష్మీనారాయణ... జనసేన పార్టీకి రాజీనామా చేసినప్పటికీ  వ్యక్తిగతంగా నాకు, జనసైనికులకు ఆయనపై ఉన్నగౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆయనకు శుభాభినందనలు.'' అంటూ ప్రకటన విడుదల చేశారు పవన్ కల్యాణ్.

More Related Stories