మరో తమిళ రీమేక్ చిత్రంలో రామ్ చరణ్..Ram charan
2020-02-11 17:13:13

ఇటీవల కాలంలో కోలీవుడ్ హిట్ చిత్రాలను తెలుగులోకి రీమేక్ చేసి హిట్ అందుకుంటున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు. అలాంటి  చిత్రాల్లో రీసెంట్ గా వచ్చిన 'జాను'తో పాటు.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న వెంకటేష్ 'నారప్ప' చిత్రాలనే చెప్పుకోవచ్చు. అలాగే మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150'.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'ధృవ' సినిమాలు కూడా తమిళ రీమేక్ చిత్రాలే.. అయితే తమిళ 'తనీ ఒరువన్' రీమేక్ 'ధృవ' తో బ్లాక్ బస్టర్ అందుకున్న చరణ్ మరోసారి రీమేక్ లో నటించబోతున్నట్టు సమాచారం.

కోలీవుడ్ లో 2017లో విజయ్ సేతుపతి, మాధవన్‌ ప్రధాన పాత్రల్లో.. పుష్కర్ – గాయత్రి దర్శకత్వంలో తెరకెక్కిన 'విక్రమ్ వేద' బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్న గీతా ఆర్ట్స్ సంస్థ.. ఎప్పటినుంచో తెలుగులో రీమేక్ చేయాలని సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో రానా, రవితేజ నటించబోతున్నట్టు వినిపించింది. తర్వాత ఏమైందో కానీ హీరోలు సెట్ కాకపోవడం వల్లే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు టాక్. అయితే తాజాగా విక్రమ్ వేద రీమేక్ కు రంగం సిధ్దమైనట్టు సమాచారం. ఈ రీమేక్ లోనే రామ్ చరణ్ నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 

అందుకు అల్లు అరవింద్, మాధవన్ పాత్రలో రామ్ చరణ్‌ను నటింపజేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ భారీ మల్టీ స్టారర్ లో మరో స్టార్ హీరో ఎవరు అనేది ఇంకా తేలాల్సి ఉంది. చెర్రీ ప్రస్తుతం రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత చిరు, కొరటాల మూవీలో ఓ కీ రోల్ చేస్తున్నాడు. దీని తర్వాత సుకుమార్‌తో కలిసి చరణ్ మరోసారి పని చేయనున్నాడని వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టుల తర్వాతే చరణ్ 'విక్రమ్ వేద' రీమేక్ లో నటించనున్నాడని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరభంలో ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. అయితే ఈ వార్తలో నిజనిజాలేంటనేది తెలియాల్సి ఉంది.

More Related Stories