మెగాస్టార్ ది లెజెండ్ పుస్తకావిష్కరణ.. హాజరైన సినీ ప్రముఖులు..megastar
2020-03-02 14:38:14

టాలీవుడ్‌లోనే కాదు ఇండియన్ సినిమా చరిత్రలోనే తనకంటూ ప్రత్యేకంగా ఓ పేజీని రాసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. ఒక్కోమెట్టు ఎదుగుతూ ఇలా ఈ రోజు మహావృక్షంగా మారిపోయాడు చిరంజీవి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి ఎందరో సూపర్ స్టార్స్ ఉన్న సమయం నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ స్వశక్తితో సూపర్ స్టార్ అయ్యాడు చిరంజీవి. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన జీవితం గురించి ఇప్పటికే చాలా మంది పుస్తకాలు రాసారు. ఆయన కష్టాన్ని అక్షర రూపం ఇచ్చారు. ఇప్పుడు చిరంజీవి జీవితంపై 'మెగాస్టార్‌ ది లెజెండ్‌' పేరుతో సీనియర్‌ జర్నలిస్టు వినాయకరావు ఓ పుస్తకం రాశారు. దీని ఆవిష్కరణ కార్యక్రమం పార్క్ హయత్‌ హోటల్‌లో జరిగింది. దీనికి సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు చాలా మంది వచ్చారు. చిరంజీవి తనయుడు రామ్‌ చరణ్‌ ఈ పుస్తకాన్ని అవిష్కరించాడు. ఈ సందర్బంగా చరణ్ మాట్లాడుతూ.. 'నాన్న గురించి నాకు తెలిసింది తక్కువేనని అనిపించింది. ఈ బుక్‌ ద్వారా మా నాన్నకు ఇంకా ఎక్కువగా దగ్గర అవుతానని భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వినాయకరావుకు మా కుటుంబం, అభిమానులం రుణపడి ఉంటాం.. చిన్నతనంలో నాన్నతో గడిపే అవకాశం తక్కువగా ఉండేది.

నేను సినిమాల్లో వచ్చే సమయానికి నాన్న రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఆయన పడిన కష్టాలను ఎప్పుడూ దగ్గరగా చూడలేదు. కానీ 'ఖైదీ నెంబర్‌ 150'తో ఆయనలో కొత్త కోణం అర్థమైంది. ఈ సినిమా కోసం ఆయన పడ్డ కష్టాన్ని ప్రతి నిమిషం చూశాను. సైరా సినిమా కోసం రెమ్యూనరేషన్‌ తీసుకోకుండా 250 రోజులు కష్టపడి.. ఆయన మాకు ఇచ్చిన ఎనర్జీకి ధన్యవాదాలు. ప్రస్తుతం ఆయన మాతో ఎక్కువ సమయం గడపాలని చూస్తారు. అంతకు మించి ఆయన ఎక్కువగా ఏం ఆశించరు. ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపండి. ఈ బుక్‌ గురించి చదివేటప్పుడు నాన్న గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను' అని తెలిపాడు. చరణ్ మాట్లాడిన తర్వాత అక్కడంతా ఎమోషనల్ అయ్యారు. ఆయనతో పాటు అల్లు అరవింద్‌, రాఘవేంద్రరావు, సుబ్బిరామిరెడ్డి, వినాయక్‌, మురళీ మోహన్‌ లాంటి లెజెండ్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరు గొప్పతనం గురించి చెబుతూనే ఆయన కష్టపడిన విధానం గురించి ఈ వేడుకలో మాట్లాడారు.

 

More Related Stories