మాస్టర్ తెలుగు రైట్స్ అంత పలికాయా..master
2020-03-13 14:19:01

ఇదివరకు తమిళ హీరో విజయ్ కు తెలుగులో అస్సలు మార్కెట్ ఉండేది కాదు. కనీసం ఆయన సినిమాలు విడుదల చేస్తే పోస్టర్ ఖర్చులు కూడా వచ్చేవి కావు. అంత దారుణంగా ఉండేది ఆయన మార్కెట్. కానీ కొన్నేళ్లుగా తనను తాను మార్చుకుంటూ వస్తున్నాడు. ఎంచుకుంటున్న కథల్లో వైవిధ్యం చూపిస్తున్నాడు. అందుకే మెల్లగా మన దగ్గర కూడా విజయ్ సినిమాలు ఆడుతున్నాయి. పోలీసోడుతో ఫస్ట్ టైమ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసిన విజయ్.. ఆ తర్వాత అదిరిందితో మరో హిట్ కొట్టాడు. ఇక సర్కార్ సినిమా కూడా బాగానే ఆడటంతో విజయ్ వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. గతేడాది అట్లీ దర్శకత్వంలో చేసిన విజిల్ సినిమా కూడా తెలుగులో విజయం అందుకుంది. ఈ సినిమా దాదాపు 9 కోట్ల షేర్ తీసుకొచ్చింది.

ఇక ఇప్పుడు మాస్టర్ సినిమాతో మరోసారి తెలుగులో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు దళపతి విజయ్. కార్తీతో ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన లోకేష్ కనకరాజ్ దీనికి దర్శకుడు. ఇప్పటికే విడుదలైన మాస్టర్ ఫస్ట్ లుక్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాను తెలుగులో మహేష్ కోనేరు విడుదల చేస్తున్నాడు. మాస్టర్ తెలుగు రైట్స్ దాదాపు 10 కోట్ల 50 లక్షలు అమ్ముడయినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు విజయ్ సినిమా మార్కెట్తో పోలిస్తే ఇది వంద రెట్లు ఎక్కువ. సినిమా సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ వెళుతున్నాడు విజయ్. ఏప్రిల్ లో ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మరి మాస్టర్ సినిమాతో తెలుగులో విజయ్ ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలిక.

More Related Stories