హీరోగా నటించే ఓపిక లేదు అంటున్న కమెడియన్..Vadivelu
2020-03-18 00:14:38

కొందరు కమెడియన్ లకు హీరోలతో సమానమైన ఇమేజ్ ఉంటుంది. తెలుగులో బ్రహ్మానందం, సునీల్ లాంటి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు కేవలం వాళ్ల పోస్టర్ కనిపిస్తే సినిమాలు విజయం సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అచ్చంగా అంతే ఇమేజ్ తమిళనాట ఉన్న కమెడియన్ వడివేలు. ఒకప్పుడు ఈయన డేట్స్ కోసం రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్లు కూడా వేచి చూశారంటే ఆయన డిమాండ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఒకానొక సందర్భంలో రజనీకాంత్ ను విమర్శించి తమిళ సినిమాలకు దూరం అయిపోయాడు వడివేలు. 

ఈయనను సినిమాల్లో తీసుకోవద్దు అంటూ తమిళ నిర్మాతలు కూడా తీర్మానించారు. అందుకే ఒకప్పుడు ఏడాదికి 35 సినిమాలు చేసిన వడివేలు గత మూడేళ్లలో కేవలం మూడు సినిమాలు కూడా చేయలేకపోయాడు. దానికి తోడు కమిట్ అయిన సినిమాల విషయంలో కూడా దర్శక నిర్మాతలను వడివేలు ఇబ్బంది పెడుతున్నాడనే ప్రచారం కూడా జరుగుతుండటంతో ఈయనతో సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఈయన హీరోగా దర్శకుడు చింబు దేవన్ తీసిన 'ఇంసై అరసన్‌ 24 ఏఎం పులికేసి' సినిమా ఆగిపోయింది. 

చింబుతో క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఈ చిత్ర షూటింగ్‌ను ఆపేశారు. దీనికి శంకర్ నిర్మాత. 2006 హిట్‌ 'ఇంసై 23 అరసన్'కు సీక్వెల్ ఇది. ఈ సినిమా విషయంలో జరిగిన కొన్ని గొడవలకు వడివేలు విమర్శలు ఎదుర్కొన్నాడు. అందుకే తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఈయన. ఇకపై కేవలం కమెడియన్ గా మాత్రమే నటిస్తానని హీరోగా అస్సలు చేయను అంటూ మాటిచ్చాడు వడివేలు. ప్రేక్షకులను నవ్వించడమే తన లక్ష్యం అంటున్నాడు. హీరోల పక్కన ఉన్న కామెడీ పాత్రలు పోషిస్తా అని క్లారిటీ ఇచ్చాడు వడివేలు. 

ఈయన చివరిసారి 2017లో వచ్చిన విజయ్'మెర్సల్‌' సినిమాలో నటించాడు. దీని తర్వాత దాదాపు మూడేళ్లు ఏ సినిమాకు సంతకం చేయలేదు. కమల్‌ హాసన్‌ నటించబోతున్న 'తలైవాన్‌ ఇరుక్కిరాన్‌'కు సంతకం చేసినట్లు  ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. మొత్తానికి వడివేలు కెరీర్ చివరి దశకు వచ్చేసింది. అది ఆయన స్వయంకృతమే అంటారు తమిళ సినిమా విశ్లేషకులు.

More Related Stories