హమ్మయ్య మహా సముద్రానికి తొలగిన అడ్డంకులుSharwanand
2020-04-04 10:40:57

ఆర్‌ఎక్స్‌ 100 వంటి హిట్‌తో తెలుగు చిత్రసీమ దృష్టిని ఆకర్షించిన  యువ దర్శకుడు అజయ్‌ భూపతి. తన తర్వాతి చిత్రాన్ని పట్టాలెక్కించడానికి మాత్రం ఆపసోపాలు పడాల్సి వస్తోంది. ఇప్పటికీ ఆయన తన సినిమా విషయంలో ఒక క్లారిటీకి రాలేని పరిస్థితి. ఆయన ‘మహా సముద్రం’ పేరుతో ఓ క్రేజీ మల్టీస్టారర్‌ను పట్టాలెక్కించాలని చూస్తున్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరిగింది. ఈ కథ అనేక మంది హీరోల చుట్టూ తిరగ్గా చివరికి రవితేజ దగ్గరికి వెళ్ళిందని, ఆయన ముందు ఒప్పుకున్నా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని ఒక ప్రచారం. దీంతో ఇదే కథను విశ్వక్‌ సేన్‌ - కార్తికేయలతో కలిసి చేస్తున్నాడని కూడా న్యూస్ వచ్చింది. కానీ, ఇది కూడా ఎందుకో సెట్‌ కాలేదట. 

నిజానికి మహా సముద్రం కథ తొలుత నాగచైతన్యతో సినిమా చేయాలనుకున్నారట. అయితే అప్పట్లో మజిలీ చిత్రంతోనూ, అలాగే తదుపరి ప్రాజెక్టులతో నాగచైతన్య బిజీగా ఉండటంతో అజయ్‌ భూపతి వెంటనే రవితేజను కలిశారట. ఇక నాగచైతన్య వరకు అనేక మంది హీరోల చేతులు మారి ఇప్పుడు మళ్ళీ శర్వానంద్‌ వద్దకు చేరినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్ట్టు చెబుతున్నారు. మరో పాత్రలో ఆర్‌ఎక్స్‌ 100 కార్తికేయ నటించవచ్చని అంటున్నారు. ఇక ఈ సినిమాకి ఇప్పటిదాకా నిర్మాతలు దొరకక పోగా ఇప్పుడు ఎకె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెలకొని ఉన్న కరోనా పరిస్థితులు సద్దుమణిగాక జూన్ లో ఈ సినిమా ప్రారంభించవచ్చని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. 

More Related Stories