అల్లు అర్జున్ పై కేరళ ముఖ్యమంత్రి ప్రశంసల వర్షం..allu
2020-04-10 06:43:29

అల్లు అర్జున్ కు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ కూడా ఆయన సినిమాలు విడుదలవుతాయి. అల్లు అర్జున్ సినిమాలు వస్తుంటే అక్కడ స్టార్ హీరోలు కూడా భయపడతారు. ప్రత్యేకంగా బన్నీకి అక్కడ అభిమాన సంఘాలు కూడా ఉన్నాయంటే కేరళలో అల్లుఅర్జున్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఈయనను కేరళ ముఖ్యమంత్రి విజయన్ ప్రశంసించాడు. తమ రాష్ట్రంలో కరోనా నిర్మూలనకు పాతిక లక్షలు విరాళం అందించిన అల్లు అర్జున్ ని ప్రత్యేకంగా అభినందించింది కేరళ సర్కార్. తెలుగు రాష్ట్రాలతో సమానంగా తమను కూడా ఆదుకోవాలన్న బన్నీ ఆలోచన గొప్పదంటూ ప్రశంసించారు కేరళ సీఎం పినరయి విజయన్. లాక్ డౌన్ ప్రకటన వెలువడగానే.. బన్నీ 1.25 కోట్ల విరాళం అనౌన్స్ చేశాడు.

ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు.. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి 25 లక్షలు అందజేశారు. తమకు అందిన సాయాన్ని ధృవీకరించింది కేరళ సర్కార్. బన్నీకి కేరళ ప్రజలు రుణపడివుంటారన్నారు కేరళ సీఎం విజయన్. అలాగే సినిమా కార్మికులకు కూడా 30 లక్షలు ఇచ్చాడు అల్లు అర్జున్. కేరళ సినీ పరిశ్రమతో అల్లు అర్జున్ కు విడదీయరాని అనుబంధం ఉంది. గతేడాది అక్కడ జరిగిన ప్రతిష్టాత్మక పడవ పోటీలకు బన్నీని ముఖ్య అతిథిగా పిలిచి సత్కరించింది కేరళ సర్కార్. ఇప్పుడు కేరళలో కరోనా నివారణకు సాయం ప్రకటించి.. అక్కడి ప్రజలతో పాటు ప్రభుత్వం మెప్పును పొందారు అల్లు అర్జున్. అక్కడి ప్రజలు ఈయనను మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు.

 

More Related Stories