ఎన్ని సినిమాలు చేస్తున్నావ్ నాని.. లైన్‌లో ఐదుగురు దర్శకులు..nani
2020-05-22 19:21:39

నాని ఎప్పుడూ వరస సినిమాలతో బిజీగా ఉంటాడు. ఒకే ఏడాది రెండు మూడు సినిమాలు కూడా చేస్తుంటాడు. ఈ సారి అంటే కరోనా వచ్చి నాశనం చేసింది కానీ లేదంటే ఈ పాటికే ఇంద్రగంటి దర్శకత్వంలో నటించిన వి సినిమా విడుదలై ఉండేది. మార్చ్ 25నే ఉగాది కానుకగా సినిమా విడుదల చేయాలనుకున్నారు దర్శక నిర్మాతలు. కానీ కుదర్లేదు.. థియేటర్స్ ఓపెన్ అయిన వెంటనే ఈ సినిమా విడుదల కానుంది. దాంతో పాటే తనకు నిన్ను కోరి లాంటి సినిమాను ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణతో టక్ జగదీష్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా సగం పూర్తయింది. ఇదే ఏడాది సినిమా విడుదల కానుంది. ఇక టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్‌తో శామ్ సింగ్ రాయ్ అనే డిఫరెంట్ సినిమాను ప్రకటించాడు నాని.

ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేస్తామని చెప్పాడు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చే ఏడాదికి వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మూడు సినిమాల తర్వాత మెంటల్ మదిలో ఫేమ్ వివేక్ ఆత్రేయకి కూడా నాని అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక దర్శకుడు సుకుమార్ అసిస్టెంట్ తో ఓ సినిమా చేయబోతున్నాడు నేచురల్ స్టార్. దీనికి కూడా కథ సిద్ధమైపోయింది. అంటే ఒకేసారి 5 సినిమాలు లైన్ లో పెట్టాడు నాని. వీటన్నింటినీ రెండేళ్లలోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు నేచురల్ స్టార్. వాళ్లే కాదు ఇంకా చాలా మంది నాని దగ్గర కథలు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. మధ్యలో ఎవరైనా అదిరిపోయే కథ తీసుకొస్తే వాళ్లదే ముందు పూర్తి చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నాడు ఈ హీరో. మొత్తానికి నాని దూకుడు చూస్తుంటే వామ్మో అనుకోవాల్సిందే.

More Related Stories