షూటింగ్ లకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్Balakrishna
2020-06-10 20:26:22

కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ తెలంగాణాలో సినిమా, టివి షూటింగులు చేసుకోడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఆ అనుమతులకి సంబంధించిన ఫైలు మీద కేసీఆర్ ఈరోజు సంతకం చేశారు. తెలంగాణా వ్యాప్తంగా పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా/టివి షూటింగులు చేసుకోవచ్చని క్లారిటీ వచ్చినట్టయింది. ఇక ఇప్పటికే షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ కు అనుమతులు ఇచ్చేశారు. ఇప్పుడు షూటింగ్ లు కూడా వెంటనే చేసుకోవచ్చని ముఖ్యమంత్రి పేరిట విడుదలయిన ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున థియేటర్లను ప్రారభించడానికి మాత్రం తెలంగాణా ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. 

ఇక మొన్న సినిమా పరిశ్రమకు చెందిన చిరంజీవి తదితరులు కేసీఆర్ ను కలిసి సినిమా, టివి షూటింగులకు, పోస్టు ప్రొడక్షన్ పనులకు, సినిమా థియేటర్ల తెరవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, విధి విధానాలు రూపొందించాచాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ప్రిన్సిపాల్ సెక్రటరీ సోమేశ్ కుమార్, సినీరంగ ప్రముఖులతో సమావేశమై విధివిధానాలను రూపొందించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి, పరిమిత సంఖ్యలో జనంతో షూటింగులు చేసుకుంటామని సినీ పెద్దలు హామీ ఇచ్చారు. దీనిని అనుసరించి ముఖ్యమంత్రి కేసీఆర్ షూటింగులు, పోస్టు ప్రొడక్షన్ పనులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వం అనుమతి ఇచ్చినా వెంటనే ఎంతమంది తమ సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

More Related Stories