కాజల్ అగర్వాల్ కి పెళ్లి మీద మనసు మళ్ళిందా Kajal agarwal
2020-06-23 20:36:22

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లిపీటలెక్కేందుకు సిద్దమైందా ? తన మనస్సు గెలిచిన వ్యక్తి తో మూడు ముళ్లు వేయించు కునేందుకు రెడీ అంటోందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇండస్ట్రీకి ఏంట్రీ ఇచ్చి 15 ఏళ్లు దాటిన కాజల్ అగర్వాల్ కెరీర్ స్పీడ్ గ్రాఫ్ ఇంకా పడిపోలేదు. హీరో ఇమేజ్ తో సంబంధం లేకుండా చిన్నా చితకా సినిమాలకు కూడా సంతకాలు చేస్తోంది. అటు బడా స్టార్స్ చిత్రాలతో పాటు ఇటు మిడియం రేంజ్ హీరోల పక్కన నటిస్తూ కెరీర్ ని బ్యాలెన్స్ చేస్తోంది. 34 ఏళ్లు దాటిన కాజల్ పెళ్లి ఆలోచనే లేకుండా కెరీర్ ని కంటిన్యూ చేస్తోంది. అయితే తన చెల్లి నిషా అగర్వాల్ పెళ్లి చేసుకుని తల్లిగా మారినప్పటికీ కాజల్ మాత్రం కెరీర్ పైనే పూర్తి దృష్టి సారించింది. 

తాజాగా 35వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన కాజల్ పెళ్లి గురించి సీరియస్‌ గా ఆలోచిస్తోందని త్వరలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని వార్తలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలని భావిస్తోన్న కాజల్ అందుకు ఔరంగాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తని కూడా సెలెక్ట్ చేసుకున్నట్టు చెబుతున్నారు. పెళ్లి తర్వాత కూడా రెండు మూడేళ్లు సినిమాలు చేయాలని ఆమె ప్లాన్ చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. పెళ్లి గురించి త్వరలోనే కాజల్ ప్రకటన చేయబోతున్నట్టు బాలీవుడ్ మీడియాలో కధనాలు కూడా వస్తున్నాయి. అయితే ఈమె పెళ్లి గురించి వార్తలు రావడం ఇదేమీ మొదటి సారి కాదు. మరి, ఈ వార్తలపై కాజల్ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

More Related Stories