మన హీరోయిన్‌లలో లేనిది బాలీవుడ్ హీరోయిన్‌లలో అంతగా ఏముందో మరి..Bollywood
2020-07-22 07:32:23

ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాలో నటించడానికి దీపిక పదుకొనే దాదాపు 30 కోట్ల పారితోషికం అందుకుంటుందనే ప్రచారం జరుగుతున్న వేళ అందరికీ ఇదే అనుమానం వస్తుంది. అసలు బాలీవుడ్ హీరోయిన్స్ ను తీసుకోవడం వల్ల ఏం లాభం ఉంటుంది.. ఆ సినిమాకు ఏమైనా ఎక్స్ ట్రా బిజినెస్ జరుగుతుందా.. ఒక్క సినిమాకు 30 కోట్లు ఇవ్వడం అనేది ఎంత వరకు సమంజసం అంటున్నారు అభిమానులు. ప్రభాస్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటుందనే వార్తను కూడా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంత ఇచ్చి బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాల్సిన అవసరం ఏంటి.. ప్రభాస్ ఇప్పుడు ఎలాగూ నేషనల్ వైడ్ స్టార్ అయిపోయాడు.. అలాంటప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ తో పనేంటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు కూడా. సాహో సినిమాలో శ్రద్ధా కపూర్ ఉండటం వల్ల ఏమైనా ఒరిగిందా.. ఆమె ఉన్నందుకే బాలీవుడ్ లో 150 కోట్లు వచ్చాయా అంటున్నారు. అసలు బాలీవుడ్ హీరోయిన్స్ అంటే మనోళ్లకు ఎందుకు అంత మోజు అని ముందు నుంచి కూడా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి.

మన దగ్గర ఉన్న హీరోయిన్స్ కు కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా ఆలోచించే నిర్మాతలు.. ముంబై నుంచి వస్తున్న వాళ్లకు మాత్రం ఎందుకు కోట్లకు కోట్లు ఇస్తున్నారంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. ఉదాహరణకు 16 ఏళ్ల కింద మల్లీశ్వరి సినిమా గురించి తీసుకుందాం.. అప్పట్లో టాలీవుడ్ లో ఓ హీరోయిన్ కు మహా అయితే 20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఇచ్చేవాళ్లు. అలాంటి సమయంలోనే కత్రినా కైఫ్ కు ఏకంగా 60 లక్షలకు పైగానే ఇచ్చి టాలీవుడ్ కు తీసుకొచ్చాడు సురేష్ బాబు. కత్రినా కైఫ్ బికినీ అందాలు సినిమాకు కూడా బాగానే హెల్ప్ అయ్యాయి. ఇక దానికంటే ముందు సుష్మిత సేన్, ప్రీతి జింటా, శిల్పా శెట్టి, ఐశ్వర్యా రాయ్ లాంటి హీరోయిన్స్ ను అప్పుడప్పుడూ తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. కానీ వాళ్లెవ్వరూ కూడా ఇక్కడ మన హీరోల కంటే కూడా పాపులర్ కాదు. కానీ వచ్చిన ప్రతీసారి వాళ్లకు మాత్రం ఆస్తులు రాసిచ్చారు మన నిర్మాతలు.

20 ఏళ్ల కిందే ఐశ్వర్యారాయ్ కు ఒక్క పాట కోసం రావోయి చందమామలో 15 లక్షల వరకు ఇచ్చారని సమాచారం. ఇక శిల్పా శెట్టి, ప్రీతి జింటా లాంటి వాళ్లు కూడా ఒక్కో సినిమాకు బాగానే వసూలు చేసారు. మన హీరోయిన్స్ కంటే కూడా గొప్పగా నటించరు.. కానీ కోట్లు మాత్రం దండుకుంటారు. వాళ్ల సొంత ఇండస్ట్రీలోనే అంతగా పట్టించుకోని వాళ్లను తీసుకొచ్చి మన నిర్మాతలు ఇక్కడెందుకు వాళ్లకు రాచ మర్యాదలు చేస్తున్నారని విశ్లేషకులు అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు దీపిక పదుకొనే విషయానికి వద్దాం.. నిజాలు మాట్లాడుకుంటే పెళ్లి తర్వాత దీపిక రేంజ్ పడిపోయింది. అప్పట్లో వచ్చినట్లు అవకాశాలు కూడా రావడం లేదు. స్టార్ హీరోలు కూడా ఈమెతో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇలాంటి సమయంలో ప్రభాస్ సినిమాలో ఈమె నటించడానికి 30 కోట్ల వరకు ఇస్తున్నారనే మాటే సంచలనంగా మారుతుంది.

ఎందుకంటే బాలీవుడ్ లో ఈమె సినిమాకు తీసుకునే పారితోషికం 10 కోట్లు మాత్రమే. తెలుగులో నటించడానికి తన రేంజ్ 20 రెట్లు పెంచుకుందన్నమాట. దానికి మన నిర్మాతలు కూడా ఓకే అనేసారు. 7 ఏళ్ల కింద ప్రియాంక చోప్రా కూడా రామ్ చరణ్ తో జంజీర్ సినిమాలో నటించడానికి ఏకంగా అప్పట్లోనే 9 కోట్లు తీసుకుంది. అప్పుడు చరణ్ కంటే కూడా ఎక్కువ తీసుకుందన్నమాట. బాలీవుడ్ లో సినిమాకు 5 కోట్లు తీసుకునే ప్రియాంక.. చరణ్ తో అనేసరికి మరో 5 పెంచేసింది. అంతదూరం ఎందుకు.. మొన్నటికి మొన్న సాహోలో నటించడానికి శ్రద్ధా కపూర్ కూడా భారీగానే తీసుకుంది. బాలీవుడ్ లో ఇచ్చేదానికంటే కూడా రెండింతలు ఇచ్చి తెలుగు ఇండస్ట్రీకి స్వాగతం పలికారు నిర్మాతలు. ట్రిపుల్ ఆర్ లో నటించడానికి అలియా భట్ కూడా 10 రోజులకు 5 కోట్లు వసూలు చేస్తుంది. ఇక్కడ మన హీరోయిన్స్ కు ఇవ్వడానికి ఆలోచించే నిర్మాతలు.. బాలీవుడ్ అనేసరికి మాత్రం ఓకే అనేస్తున్నారు. ఇదే కొందరికి నచ్చట్లేదు కూడా.

ఇక్కడ కూడా టాలెంటెడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కాజల్, తమన్నాతో సహా ఇంకా చాలా మంది హీరోయిన్స్ పేరు ఉత్తరాది వాళ్లే అయినా కూడా సౌత్ లోనే స్థిరపడిపోయారు. వాళ్లకు ఇప్పటికీ 2 కోట్ల రేంజ్ దాటలేదు. కానీ మధ్యలో ఒక్కసారి ఇలా మెరిసే వాళ్లకు మాత్రం కోట్లకు కోట్లు ఇస్తున్నారు. వాళ్లుండటం వల్లే సినిమాలు ఆడుతున్నాయా అంటే రజినీకాంత్ తో దీపిక నటించిన కొచ్చాడయాన్.. సోనాక్షి నటించిన లింగా డిజాస్టర్స్ అయ్యాయి. వాళ్ల వల్ల సినిమాలకు పెద్దగా ఉపయోగం ఉందడేమో కానీ తమ సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్స్ ఉన్నారు అని చెప్పుకోడానికి మాత్రం బాగానే పనికొస్తుంది. ఆ ఇమేజ్ కోసమే నిర్మాతలు కూడా కోట్లు పెట్టడానికి ముందుకొస్తున్నారు. ప్రభాస్ సినిమా పరిస్థితి కూడా అంతే అవుతుందేమో..? సౌత్ లో ఎలాగూ ప్రభాస్ కు తిరుగులేదు.. బాలీవుడ్ లో కూడా మనోడికి మంచి ఇమేజ్ వచ్చేసింది. సినిమా బాగుంటే దీపిక కంటే ముందు ప్రభాస్ ను చూసి టికెట్స్ అక్కడ తెగుతాయి. 

More Related Stories