సుబ్రమ‌ణియ‌న్ స్వామి చెప్పిన ఆ నటి రియానేనా.. Subramanian swamy
2020-07-31 19:54:36

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం మిస్ట‌రీగా మారింది. ఆయనది ఆత్మహత్యా ? లేక హత్యా ? అనేది ఇంకా తేలలేదు. తాజాగా సుశాంత్‌ది హ‌త్యే అని బీజేపీ ఎంపీ సుబ్ర‌మ‌ణియ‌న్ స్వామి అన్నారు. హ‌త్యే అని చెప్ప‌డానికి త‌న ద‌గ్గ‌ర ఉన్న ఆధారాల‌ను ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్టు చేసి కలకలం రేపారు. ఇక ఇప్పటికే సుశాంత్ మృతి విష‌యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్‌తో సుబ్ర‌మ‌ణియ‌న్ స్వామి నిన్న మాట్లాడారు. ఈ కేసుని సీబీఐ విచారించే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్వామి తెలిపారు. స్వామి ట్వీట్‌ చేసిన డాక్యుమెంట్‌ ప్రకారం ఆయన పలు వాదనలను ముందుకుతెచ్చారు. సుశాంత్‌ రాజ్‌పుత్‌ మెడపై ఉన్న గుర్తు ఆత్మహత్యతో సరిపోలడం లేదని, ఇది హత్యను సూచిస్తోందని అన్నారు. 

ఈ డాక్యుమెంట్‌ ప్రకారం సుశాంత్‌ శరీరంపై కొట్టిన గుర్తులు ఉన్నాయని, ఎలాంటి సూసైడ్‌ నోట్‌ కూడా దొరక లేదని పేర్కొన్నారు. సుశాంత్‌ కంటే ముందు బలవన్మరణానికి పాల్పడిన మేనేజర్‌ దిశా సలియాన్‌కు కొన్ని అంశాలు తెలిసి ఉంటాయని చెప్పుకొచ్చారు. నిజానికి ఈ వ్యవహారంలో సీబీఐ విచారణ సాధ్యంకాదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిపైన  స్పందిస్తూనే స్వామి వరుస ట్వీట్లు చేశారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ముంబయి మూవీ మాఫియా పనిచేస్తోందని.. ఈ క్రమంలో ఓ నటిని బలి చేసేందుకు రంగం సిద్ధమయిందని ఆయన చెబుతున్నారు. ఇక మరోపక్క సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ సుశాంత్‌ స్నేహితురాలు, నటి రియా చక్రవర్తిపై పట్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసు విచారణ కొనసాగుతోంది.

More Related Stories