అయ్యో రామ.. రెండు సినిమాలకు ఓటీటీ పనికి రాలేదుగా.. Orey Bujjiga and Nishabdam
2020-10-03 21:47:47

థియేటర్లో విడుదల కావాల్సిన సినిమాలు నేరుగా ఇంటికే వచ్చేస్తుంటే ప్రేక్షకులు సంతోషిస్తున్నారు. అయితే వాళ్ల సంతోషానికి తగ్గట్లుగా ఆ సినిమాలు ఉండటం లేదు. ఆ మధ్య భారీ అంచనాలతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన నాని వి సినిమా అత్యంత దారుణంగా నిరాశ పరిచింది. ఈ సినిమాతో అమెజాన్ కూడా భారీగానే నష్టపోయిందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో రెండు సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదలయ్యాయి. ఎలాగూ థియేటర్లు ఇప్పట్లో తెరిచేలా కనిపించడం లేదు కాబట్టి నిర్మాతలు కూడా ధైర్యం చేసి తమ సినిమాలను నేరుగా విడుదల చేస్తున్నారు. అయితే అలా విడుదలైన సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో దారుణంగా విఫలం అవుతున్నాయి. 

తాజాగా రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ఒరేయ్ బుజ్జిగా సినిమా ఆహాలో విడుదలైంది. గుండెజారి గల్లంతయ్యిందే ఫేం విజయ్ కుమార్ కొండా దీనికి దర్శకుడు. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో హెబ్బా పటేల్ ప్రత్యేక పాత్రలో కనిపించింది. వరస ఫ్లాపుల్లో ఉన్న రాజ్ తరుణ్ కు ఒరేయ్ బుజ్జిగా బ్రేక్ ఇస్తుందా అనే అనుమానం చాలామందిలో ఉండేది. ఇప్పుడు అదే అనుమానం నిజమైంది. ఆహాలో విడుదలైన ఈ సినిమాకు రెస్పాన్స్ అయితే పెద్దగా రావడం లేదు. అక్కడక్కడ కామెడీ సీన్లు వర్కౌట్ అవ్వడమే తప్ప సినిమా అంతా చూసుకుంటే రాజ్ తరుణ్ మరోసారి నిరాశ పరిచినట్లే అనిపిస్తుంది. 

మరోవైపు భారీ అంచనాలతో విడుదలైన అనుష్క నిశ్శబ్దం సినిమాకు కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా విఫలమైంది. ఎన్నో సినిమాల్లో చూసిన సస్పెన్స్ కథను ఇందులోనూ తీసుకున్నాడు హేమంత్. స్క్రీన్ ప్లే తేలిపోవడంతో సినిమా కూడా నిరాశ పరుస్తుంది. అమెజాన్ ఈ సినిమాపై దాదాపు 23 కోట్లు వెచ్చించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే భారీ నష్టాలు తప్పేలా లేవు. ఏదేమైనా తెలుగు సినిమాలకు డిజిటల్ ప్లాట్ ఫామ్ అంతగా కలిసి రావడం లేదు. 

More Related Stories