మనసంతా నువ్వే సినిమా గురించి మీకు తెలియని విశేషాలు..Manasantha Nuvve
2020-10-20 20:21:49

తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు అలాగే నిలిచిపోతాయి. ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ప్రేక్షకుల మనసులో నిలిచి అగ్రస్థానంలో చోటు సంపాదించుకుంటాయి. అలాంటి ఒక అపురూపమైన సినిమా మనసంతా నువ్వే. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలై 19 ఏళ్లు గడిచిపోయింది. అప్పట్లో ఈ సినిమా కోసం కుర్రాళ్ళు పిచ్చోళ్ళయిపోయారు. అంతగా మనసంతా నువ్వే అందర్నీ మాయ చేసింది. 2001 అక్టోబర్ 19 న విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే దాదాపు 16 కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు నష్టాల్లో ఉన్న నిర్మాత ఎమ్మెస్ రాజు పూర్తిగా లాభాల్లోకి తీసుకొచ్చి ఆయన కెరీర్ కు పూలబాట వేసింది మనసంతా నువ్వే. అలాంటి సినిమాకు చాలా విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా దేవి పుత్రుడు సినిమాతో దాదాపు 14 కోట్లు నష్టపోయిన ఎమ్మెస్ రాజు.. ఆ తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తెలియక తర్జనభర్జన పడుతున్న సమయంలో ఒక పాత సినిమా చూస్తున్నాడు.

అందులో ఒకప్పటి ప్రేమికులు కలుసుకోవడానికి పడుతున్న యాతన అతనికి కనిపించింది. అలా ఆయన మనసులో పుట్టుకొచ్చిన ఒక ఐడియా మనసంతా నువ్వే. వెంటనే దాన్ని పరుచూరి బ్రదర్స్ తో పంచుకున్నాడు. వాళ్లు కూడా బాగుంది అని చెప్పి డెవలప్ చేయడం మొదలుపెట్టారు. దర్శకుడిగా ఎవరిని అనుకుంటున్నారు అదే సమయంలో వి.యన్.ఆదిత్య వచ్చాడు. తేజ రిఫరెన్స్ తో ఉదయ్ కిరణ్ హీరోగా ఎంపికయ్యాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా తీసుకోవాలనుకున్నారు ఎమ్మెస్ రాజు. కానీ కుదరలేదు.. దాంతో ఆర్.పి.పట్నాయక్ సినిమాలోకి వచ్చాడు. ఆయన ఇచ్చిన సంగీతం ఇప్పటికీ అలాగే నిలిచిపోయింది. ముంబై వెళ్లి రీమాసేన్ కు అడ్వాన్సు ఇచ్చి వచ్చాడు. అలా వెంట వెంటనే అన్నీ జరిగిపోయాయి. మే 1న ఈ సినిమా ముహూర్తం జరుపుకొని అక్టోబర్ 19 న విడుదలైంది. కేవలం కోటి 30 లక్షలతో ఈ సినిమాను నిర్మించాడు రాజు. సొంతంగా విడుదల చేసుకున్నాడు. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మనసంతానువ్వే సంచలన వసూళ్లు సాధించింది. ఒకటి రెండూ కాదు 16 కోట్లు వసూలు చేసి రికార్డ్ బ్రేక్ చేసింది. అందుకే ఈ సినిమా తనకు ఇప్పటికీ ఎప్పటికీ ఇష్టమైన సినిమా అంటున్నాడు ఎం ఎస్ రాజు. 

More Related Stories