స్నేహం కోసం కదిలొస్తున్న మెగాస్టార్ చిరంజీవి..Chiranjeevi
2021-03-12 14:19:57

దాసరి నారాయణరావు తర్వాత ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఆ స్థానం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ కుర్చీపై మెగాస్టార్ కు ఆసక్తి ఉందో లేదో తెలియదు కానీ.. ఇండస్ట్రీలో చాలా మంది మాత్రం చిరుని ఆ చైర్ లో కూర్చోబెట్టాలని చూస్తున్నారు. అందుకే ఇండస్ట్రీలో ఏ వేడుక జరిగినా కూడా దానికి చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారు. మరోవైపు చిరంజీవి కూడా చిన్న పెద్ద, తన పర భేదం లేకుండా అందరికీ తన వంతు సహాయం చేస్తున్నాడు. ఈ మధ్య శర్వానంద్ శ్రీకారం ఈవెంట్ కు వచ్చాడు. దానికి ముందు మంచు విష్ణు నటిస్తున్న మోసగాళ్లు ట్రైలర్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైంది. ఇక తాజాగా నాగార్జునకు కూడా చిరంజీవి అవసరం పడింది. 

తన సినిమా కోసం స్నేహాన్ని యూజ్ చేసుకుంటున్నాడు గ్రీకు వీరుడు. ప్రస్తుతం కొత్త దర్శకుడు సోలొమన్ తెరకెక్కిస్తున్న వైల్డ్ డాగ్ సినిమాతో బిజీగా ఉన్నాడు నాగార్జున. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమాపై అంచనాలు కానీ, ఆసక్తి గాని పెద్దగా కనిపించడం లేదు. దాంతో ట్రైలర్ విడుదల చేస్తే అయినా సినిమాపై అంచనాలు పెరుగుతాయి అని నాగార్జున భావిస్తున్నాడు. దాని కోసం చిరంజీవి సాయం తీసుకుంటున్నాడు. ఆయన చేతుల మీదుగా మార్చ్ 12 సాయంత్రం 4.05కి వైల్డ్ డాగ్ ట్రైలర్ విడుదల కానుంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు నాగార్జున. మరి ట్రైలర్ విడుదల అయిన తర్వాత అయినా ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతుందేమో చూడాలి.
 

More Related Stories