గురు రివ్యు రేటింగ్2017-04-03 15:06:21

బాలీవుడ్ లో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న సినిమా సాలా ఖుద్దూస్. ఈ క‌థ న‌చ్చి వెంక‌టేశ్ తెలుగులో రీమేక్ చేసాడు. ఇక్క‌డ కూడా సుధ కొంగ‌రే ద‌ర్శ‌కురాలు. మ‌రి ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల్ని ఎంత‌వ‌ర‌కు మెప్పించిందో చూద్దాం.. 

కథ :

బాక్సింగే ప్ర‌పంచంగా బ్ర‌తికే మ‌నిషి ఆదిత్య (వెంక‌టేశ్). కాక‌పోతే జీవితంలో ఫెయిల్యూర్.. బాక్సింగ్ లో ఉండే రాజ‌కీయాల‌కు బ‌లైపోయిన ప్లేయ‌ర్ ఇత‌డు. దాంతో కోపం ఎక్కువ‌గా ఉంటుంది. దేన్నీ శాంతంగా చెప్ప‌డం చేత‌కానీ వ్య‌క్తిత్వం ఆదిత్య‌ది. అత‌డి ఆటిట్యూడ్ న‌చ్చ‌క డిల్లీ నుంచి విశాఖ‌ప‌ట్నంకు ట్రాన్ ఫ‌ర్ చేస్తుంది హెడ్ ఆఫీస్. వైజాగ్ కు వ‌చ్చి ఇక్క‌డ అల్ల‌రి చిల్ల‌రిగా తిరిగే రాముడు(రితికా సింగ్)ను చూసి ఆమెకు ట్రైనింగ్ ఇవ్వ‌డం మొద‌లుపెడ‌తాడు ఆది. ఆమెలోని టాలెంట్ ను గుర్తించి ఎలాగైనా ఆమెను ఛాంపియ‌న్ ను చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంటాడు ఆది. కానీ రాముడు మాత్రం అతని నిజాయితీని, తపనను గుర్తించదు. అలాగే ఫెడరేషన్ లో ఉన్నశత్రువులు అతని ప్రయత్నాలను అడ్డుపడుతుంటారు. ఇన్ని అడ్డంకుల మధ్య ఆదిత్య రామున్ని ఎలా మారుస్తాడు ? ఎలా ఆమెను చాంపియ‌న్ గా మారుస్తాడ‌నేది మిగిలిన క‌థ‌. 

క‌థ‌నం: 

స్పోర్ట్స్ బేస్డ్ క‌థ‌లో క‌థ‌నం చాలా ముఖ్యం. ఈ విష‌యంలో సుధ కొంగ‌ర‌ను మెచ్చుకోవాలి. ఎక్క‌డా చిక్కుముళ్లు లేకుండా.. పెద్ద‌గా ట్విస్టులేమీ లేకుండానే సింపుల్ గా స్క్రీన్ ప్లే రాసుకుంది సుధ‌. బాక్సింగ్ కోచ్ గా వెంకీని ప‌రిచ‌యం చేయ‌డం కంటే ముందు అతడి ఆటిట్యూడ్ ప‌రిచ‌యం చేయ‌డం.. ఆ త‌ర్వాత హీరోయిన్ ఎంట్రీ.. ఆమెతో వెంకీ ఫైట్లు.. ట్రైనింగ్ ఇవ్వ‌డానికి ప‌డే తంటాల‌తోనే ఫ‌స్టాఫ్ గ‌డిచిపోతుంది. ఇక సెకండాఫ్ లో కూడా పెద్ద‌గా ఊహించ‌ని మార్పులేమీ ఉండ‌వు. హీరోయిన్ మారి మ‌ళ్లీ త‌న గురువు ద‌గ్గ‌రికి రావ‌డం.. అత‌డు చెప్పింది చేసి ఛాంపియ‌న్ గా నిల‌వ‌డం.. ఇలాగే సాగిపోతుంది గురూ క‌థ‌నం. కాకపోతే సాలా ఖ‌డూస్ లో క‌నిపించిన సీరియ‌స్ నెస్ ఎందుకో గురూలో క‌నిపించ‌లేదు. అలాగ‌నీ ఇది చెడ‌గొట్టార‌ని చెప్ప‌డం స‌రికాదు. కొన్ని స‌న్నివేశాల్లో ఒరిజిన‌ల్ కంటే ఇదే బాగుంది. ముఖ్యంగా కామెడీ స‌న్నివేశాలు ఇక్క‌డ బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయి. క్లైమాక్స్ కాస్త వీక్ గా ఉండ‌టం.. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ నుంచి సినిమా స్లో అవ్వ‌డం గురుకు కాస్త మైన‌స్. 

న‌టీన‌టులు:

సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది వెంక‌టేశ్ గురించి. ఈ క‌థ‌ను వెంకీ ఎంత‌గా ఇష్ట‌ప‌డ్డాడో చెప్ప‌డానికి సినిమా చూస్తే చాలు. వ‌య‌సు 60కి చేరువ‌లో ఉన్నా ఫిట్ నెస్ విష‌యంలో వెంకీ ఇప్ప‌టికీ సూప‌ర్. కుర్ర హీరోలు కూడా ఈయ‌న్ని చూసి కుళ్లు కోవాల్సిందే. ఇక న‌ట‌న‌లోనూ కొత్త వెంక‌టేశ్ ను మ‌నం చూడొచ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు కెరీర్ లో ఎన్న‌డూ లేని విధంగా ఓ బాక్సింగ్ కోచ్ గా అల‌రించాడు వెంకీ. అన్ని ఎమోష‌న్స్ ను స‌రిగ్గా పండించాడు. ఒరిజిన‌ల్ లో మాధ‌వ‌న్ ను చూసిన వాళ్ల‌ను కూడా వెంకీ త‌న న‌ట‌న‌తో మెప్పిస్తాడు.

హీరోయిన్ రితికా సింగ్ గురించి ఏం చెప్పాలి. ఆమె త‌న తొలి సినిమాతోనే నేష‌న‌ల్ జ్యూరి అందుకుంది అంటేనే తెలుస్తుంది న‌ట‌న స్థాయేంటో..?  రీమేక్ లో కూడా ప్రాణం పోసింది ఈ ముద్దుగుమ్మ‌. బాక్స‌ర్ గా త‌న స‌త్తా చూపిస్తూనే.. ఊర మాస్ కూర‌గాయ‌ల‌మ్మే అమ్మాయిగా ర‌ప్ఫాడించింది. కామెడీ కూడా బాగానే చేసింది ఈ అమ్మాయి. మిగిలిన పాత్ర‌ల్లో నాజర్ బాగా న‌టించాడు. పంచ్ పాండ్స్ గా అక్క‌డ‌క్కడా తన పంచ్ ల‌తో న‌వ్వించాడు. మిగిలిన వాళ్ళంతా ఓకే.

టెక్నిక‌ల్ టీం:

ఈ సినిమాకు సంగీతం ప్రాణం. బ్యాగ్రౌండ్ స్కోర్ తో మంచి స్కోర్ సాధించాడు సంతోష్ నారాయ‌ణ‌న్. క‌బాలితో ఈయ‌న తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించాడు. కెమెరా వ‌ర్క్ కూడా బాగుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. హాస్యం బాగా పండట‌మే కాదు.. ఎమోష‌నల్ సీన్స్ లో అద్భుత‌మైన డైలాగులు రాసారు ర‌చ‌యిత‌లు. సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం కూడా ప‌ర్లేదు. ఈ సినిమా చూస్తుంటే అశ్వినీ సినిమా గుర్తొస్తుంది. అయినా గానీ త‌న స్క్రీన్ ప్లేతో క‌థ‌ను ర‌క్తి క‌ట్టించింది సుధ‌. 

చివ‌ర‌గా:

ఓవ‌రాల్ గా కొత్త వెంక‌టేశ్ ను చూడాల‌నుకునే వాళ్ల‌కు.. కొత్త క‌థ‌లు చూడాల‌నుకునే వాళ్ల‌కు.. గురు ఈ వారం బెస్ట్ ఆప్ష‌న్.

More Related Stories