జల్సా @12 ఇయర్స్.. పవన్ కళ్యాణ్ రికార్డుల జాతర..jalsa
2020-04-03 03:13:26

ఖుషీ సినిమా తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేక చాలా రోజులుగా వేచి చూస్తున్నాడు పవన్. మధ్యలో భారీ అంచనాలతో వచ్చిన జానీ, గుడుంబా శంకర్‌, బాలు, బంగారం, అన్నవరం అంచనాలు అందుకోలేదు. దాంతో వచ్చిన సినిమా వచ్చినట్లే వెళ్తుంటే ఒక్కటైనా హిట్ సినిమా ఇవ్వు సామీ అంటూ పవన్ అభిమానులు కూడా అడుగుతున్నారు. అలాంటి సమయంలో వచ్చింది ఓ సినిమా. దాని పేరు జల్సా.. అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డుల్లో చాలా వరకు ఇది మార్చేసింది. ఒకటి రెండు కాదు.. 282 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోవడమే కాదు.. నైజాంలో ఈ 50 రోజుల్లోనే 11.3 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 34 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి అప్పటి వరకు పవన్ రికార్డులను బద్ధలు కొట్టింది జల్సా. తొలిరోజే జల్సాకు యావరేజ్ టాక్ వచ్చింది.. సినిమాలో పెద్దగా విషయం లేదు.. కామెడీ తప్ప ఇంకేం లేదని తేల్చేసారు. కానీ ఖుషీ తర్వాత ఏడేళ్ల పాటు ఒక్క విజయం అంటూ వేచి చూసిన పవన్ అభిమానులకు మాత్రం జల్సా ఓ విందు భోజనం అయిపోయింది. పవన్ ఆకలిని తీర్చిన బ్లాక్ బస్టర్ సినిమా అయితే కాదు కానీ ఆ సమయానికి కావాల్సిన భోజనం మాత్రం పెట్టింది జల్సా. ఈ సినిమాలో కామెడీ హైలైట్. ముఖ్యంగా కొడుతున్నారమ్మా అంటూ బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఫేమస్. పది రూపాయలు ఇచ్చి 1000 అని చెప్పడం..

పవన్, ఇలియానా సీన్స్.. పవన్‌, బ్రహ్మానందం ఎపిసోడ్స్ ఇలా అన్నీ అదిరిపోయాయి. మరోవైపు ప్రకాష్‌ రాజ్‌ కామెడీ సీన్స్‌ కూడా సినిమాకు ప్రాణం. మహేష్ బాబు వాయిస్ ఓవర్ మరో బలం. సినిమాలో పవన్ నక్సలిజం ఫ్లాష్‌ బ్యాక్‌ కూడా అదనపు ఆకర్షణ. అయితే దీన్ని కూడా కామెడీ చేసాడని త్రివిక్రమ్‌పై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అయితే సినిమా ఎలా ఉన్నా కూడా ప్రతీ సీన్‌లోనూ త్రివిక్రమ్‌ తన మ్యాజిక్‌ చూపించాడు. మాటలతో మాయ చేసాడు. కామెడీతో పాటు ఆలోచింపజేసే మాటలు, డైలాగ్‌లకు జల్సా కేరాఫ్‌ అడ్రస్‌. విలన్‌ను రక్తపు చుక్క రాకుండా.. ఒక్కసారి కూడా ఆయన్ని కొట్టకుండా చంపే క్లైమాక్స్ కూడా అద్భుతమే. యుద్ధంలో గెలవడం అంటే శత్రువును ఓడించడమే కానీ చంపడం కాదంటూ త్రివిక్రమ్ చెప్పిన ఫిలాసఫీ కూడా బాగానే వర్కవుట్ అయింది. మొత్తంగా దేవీ పాటలు దుమ్ము దులిపేసాయి. అన్నీ కలిపి అప్పటి వరకు తెలుగు సినిమాలో ఉన్న కమర్షియల్ రికార్డుల్లో చాలా వరకు జల్సా తన పేర రాసుకుంది. పవన్ కోరుకున్న విజయాన్ని అందించింది ఈ చిత్రం. 2008, ఎప్రిల్ 2న విడుదలైన ఈ చిత్రం ఈ రోజుతో పుష్కరం పూర్తి చేసుకుంది.

 

More Related Stories