పోకిరికి 14 ఏళ్లు.. తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా..Pokiri
2020-04-27 17:34:02

పోకిరి.. తెలుగు సినిమా రికార్డుల్ని తిర‌గ‌రాసిన సినిమా. మ‌న తెలుగు సినిమా స‌త్తాను బాలీవుడ్ ముంగిట నిలిపిన సినిమా. టాలీవుడ్ మార్కెట్ రేంజ్ ఏంటో సౌత్ సినిమాకు చూపించిన సినిమా. అప్ప‌టి వ‌ర‌కు 30 కోట్లు దాటితేనే అబ్బో అనుకున్న తెలుగు సినిమా స్థాయిని అమాంతం తీసుకెళ్లి 40 కోట్ల మెట్టుపైకి చేర్చింది పోకిరి. మ‌హేశ్ హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ ఎప్రిల్ 28, 2006న విడుద‌లైంది. లో బ‌డ్జెట్.. త‌క్కువ అంచ‌నాల‌తో విడుద‌లైన పోకిరి.. ప్ర‌తీ సెంట‌ర్ లోనూ ప్ర‌భంజ‌నం సృష్టించింది. మ‌హేశ్ కొత్త హెయిర్ స్టైల్.. స‌రికొత్త మేన‌రిజ‌మ్స్ తో పోకిరి థియేట‌ర్స్ అన్నీ మార్మోగిపోయాయి. ఈ చిత్రం వ‌చ్చి అప్పుడే 14 ఏళ్లు గ‌డిచిపోయాయి. కానీ ఇప్ప‌టికీ ఆ పోకిరి మాత్రం కొత్త‌గానే ఉంటాడు. 

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో కొత్త ట్రెండ్ కు తెర‌తీసింది పోకిరి. స్క్రీన్ ప్లే అనేది సినిమాకు ఎంత ముఖ్య‌మో తేల్చిచెప్పిన సినిమా ఇది. మొద‌ట్నుంచీ చివ‌రి వ‌ర‌కు హీరోను పోకిరిగా చూపించి.. ఒక్క‌సారిగా పోకిరి కాదు పోలీస్ ఆఫీస‌ర్ అంటూ క్లైమాక్స్ లో పూరీ రివీల్ చేసిన తీరే సినిమాను హిట్ సూప‌ర్ హిట్ నుంచి ఇండ‌స్ట్రీ హిట్ వైపు తీసుకెళ్లింది. కామెడీ యాక్ష‌న్ మ్యూజిక్ ఇలా ప్ర‌తీ డిపార్ట్ మెంట్ లో పోకిరికి తిరుగులేదు. డైలాగ్స్ అయితే ఇప్ప‌టికీ ఫేమ‌స్సే. ఎవ‌డు కొడితే దిమ్మ‌తిరిగి.. నేనెంత ఎద‌వ‌నో నాకే తెలియ‌దు.. ఎప్పుడొచ్చామ‌న్న‌ది కాద‌న్న‌యా.. లాంటి డైలాగ్స్ అన్నీ ఇప్ప‌టికీ ఎవ‌రో ఒక‌రి నోట్లో వినిపిస్తూనే ఉంటాయి.
 
పోకిరి సినిమాను మొద‌ట్లో మ‌హేశ్ బాబుతో తీయాల‌నుకోలేదు పూరీ. ఈ సినిమాకు ఉత్త‌మ్ సింగ్ స‌న్నాఫ్ సూర్య‌నారాయ‌ణ అనే టైటిల్ తో క‌థ రాసుకున్నాడు పూరీ. ర‌వితేజ‌తో సినిమా చేయాల‌ని ఫిక్స‌య్యాడు. కానీ అనుకోని కార‌ణాల‌తో లేట్ అయింది. ఆ త‌ర్వాత సోనూసూద్ ను పెట్టి సినిమా తీసేద్దామ‌నుకున్నాడు. అయితే మార్కెట్ లెక్క‌లు ఓకే అవ్వ‌క వ‌దిలేసాడు. చివ‌రికి మ‌హేశ్ సీన్ లోకి వ‌చ్చాడు. మ‌హేశ్ వ‌చ్చిన త‌ర్వాత ఉత్త‌మ్ సింగ్ కాస్తా పండుగాడుగా మారిపోయాడు. సిక్కు క‌థ అయితే క‌నెక్టివిటీ మిస్ అవుద్ద‌నీ.. ఇక్క‌డి లోక‌ల్ క‌థ‌గా మార్చ‌మ‌న్నాడు మ‌హేశ్. అలాగే చేసాడు పూరీ. అలా వ‌చ్చింది పోకిరి. 

400 థియేట‌ర్స్ లో విడుద‌లైన పోకిరి.. 222 సెంట‌ర్ల‌లో డైరెక్ట్ గా 50 రోజులు ఆడి కొత్త రికార్డులు సృష్టించింది. ఇక 200 సెంట‌ర్ల‌లో వంద రోజులు ఆడి తెలుగు సినిమాలో మ‌రో కొత్త చ‌రిత్ర‌కు నాందీ ప‌లికాడు మ‌హేశ్. అప్ప‌ట్లోనే 40 కోట్ల షేర్ రాబ‌ట్టి పోకిరి 75 ఏళ్ళ తెలుగు సినిమా చ‌రిత్ర‌ను తిర‌గ రాసాడు. తెలుగు సినిమాకు 40 కోట్ల రేంజ్ ఉంది అని తెలియ‌జేసిన సినిమా పోకిరి. అద్భుతం జ‌రిగేట‌ప్పుడు ఎవ‌రూ గుర్తించ‌రు.. జ‌రిగిన త‌ర్వాత గుర్తించాల్సిన అవ‌స‌రం లేదు అని ఖ‌లేజాలో త్రివిక్ర‌మ్ చెప్పిన‌ట్లు.. పోకిరి తెర‌కెక్కించేట‌ప్పుడు పూరీకి కూడా తెలియ‌దేమో తాను చేస్తున్న‌ది ఓ అద్భుత‌మ‌ని. తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, బెంగాలీ, హిందీ భాష‌ల్లో రీమేకై అక్క‌డ రికార్డులు తిర‌గరాసాడు పోకిరి. 

More Related Stories