దిల్ రాజు చేతికి కెజియఫ్ 2 రైట్స్.. అదిరిపోయే రేట్‌కు..dilraju
2020-05-22 14:58:29

కెజియఫ్ 2.. ఇప్పుడు ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు వేచి చూస్తున్నారు. బాహుబలి తర్వాత ఓ దక్షిణాది సినిమా సీక్వెల్ కోసం అంతగా వేచి చూడటం ఇదే తొలిసారి. బాలీవుడ్ సినిమాలకు కూడా సాధ్యం కాని క్రేజ్ కెజియఫ్ 2 సంపాదించుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రెండో భాగానికి డిమాండ్ భారీగానే పెరిగిపోయింది. తొలి భాగం బిజినెస్ అంతా కలిపి 80 కోట్ల వరకు మాత్రమే జరిగింది. కానీ ఇప్పుడు డిజిటల్ రైట్స్ రూపంలోనే నిర్మాతలకు 100 కోట్లకు పైగా వచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా అన్ని భాషలకు సంబంధించిన శాటిలైట్ హక్కులు 120 కోట్లకు అమ్ముడయ్యాయనే ప్రచారం జరుగుతుంది.

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకొన్నట్టు తెలుస్తుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా హక్కులను ఫ్యాన్సీ రేటు చెల్లించి దిల్ రాజు సొంతం చేసుకొన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అది ఎన్ని కోట్లు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. తొలిభాగం అప్పట్లో వారాహి చలనచిత్రం 5 కోట్ల వరకు చెల్లించారు. కానీ అప్పుడు కెజియఫ్ అంటే ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు మాత్రం పార్ట్ 2పై ఉన్న అంచనాల ప్రకారం చూస్తుంటే దాదాపు 40 కోట్ల వరకు దిల్ రాజు చెల్లించి ఉంటాడని తెలుస్తుంది. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ లాంటి నటులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 23 తేదీన విడుదల చేయాలనుకుంటున్నారు నిర్మాతలు.. కానీ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడేలా కనిపిస్తుంది.

More Related Stories