డిసెంబర్ 20న నాలుగు సినిమాలు.. ఎవరి బలమెంత..balakrishna
2019-12-19 19:35:53

ఈ శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్ధమే జరగబోతుంది. పెద్ద సినిమాలు.. చిన్న సినిమాలు కలిసి బాక్సాఫీస్ పై యుద్దం చేయడానికి వస్తున్నాయి. ముఖ్యంగా దర్శక నిర్మాతలకు కూడా టెన్షన్ తగ్గడం లేదు. హీరోలైతే నిద్ర కూడా పోవడం లేదేమో..? ఎందుకంటే ఒకేరోజు నాలుగు సినిమాలు రావడం చిన్న విషయం కాదు. కానీ మరో డేట్ కూడా లేకపోవడంతో అంతా ఇయర్ ఎండింగ్ పై పడ్డారు. క్రిస్మస్ హాలీడేస్ టార్గెట్ చేస్తూ వరసగా సినిమాలు వస్తున్నాయి. 

1. రూలర్.. 

2019 మొదట్లో సంక్రాంతికి కథానాయకుడు.. నెల రోజుల తర్వాత మహానాయకుడు సినిమాలతో వచ్చి దారుణంగా డిజాస్టర్స్ ఇచ్చాడు బాలయ్య. తండ్రి బయోపిక్ తో వచ్చినా కూడా ప్రేక్షకులు మాత్రం అస్సలు పట్టించుకోలేదు. ఆ తర్వాత 10 నెలలు గ్యాప్ తీసుకుని ఇప్పుడు రూలర్ సినిమాతో వస్తున్నాడు బాలయ్య. ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. బాలయ్య హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేయస్ రవికుమార్ తెరకెక్కించాడు. సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గానే వచ్చింది. యూపీలో సాగే ఏపీ పోలీస్ ఆఫీసర్ కథ ఇది. అయితే రొటీన్ యాక్షన్ డ్రామా కావడం రూలర్ కు మైనస్ అవుతుంది. 

2. ప్రతిరోజూ పండగే..

ఈ ఏడాది చిత్రలహరి సినిమాతో ఆరు ప్లాపుల తర్వాత విజయం అందుకున్నాడు ఈ హీరో. అదే ఊపులో ఇప్పుడు మారుతి సినిమాతో పక్కా హిట్ కొడతానంటున్నాడు. ప్రతిరోజూ పండగే సినిమాపై మంచి ఆసక్తి ఉంది అందర్లోనూ. ప్రతీసారి కామెడీతో వచ్చే మారుతి ఈ సారి కాస్త ఎమోషన్ ను మిక్స్ చేసుకుని వస్తున్నాడు. భలేభలే మగాడివోయ్ తర్వాత అదే నిర్మాణ సంస్థలతో కలిసి మారుతి సినిమా చేస్తున్న సినిమా ఇది. కచ్చితంగా ఈ చిత్రం అలరిస్తుందని ధీమాగా చెబుతున్నాడు సాయి తేజ్. దాదాపు 800 స్క్రీన్స్ లో విడుదలవుతుంది ప్రతిరోజూ పండగే. 

3. దొంగ..

బాలయ్య, సాయి తేజ్ లతో పాటు కార్తి దొంగగా వస్తున్నాడు. ఖైదీ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అదే ఊపులో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు కార్తి. పైగా దృశ్యం లాంటి సంచలన సినిమా తెరకెక్కించిన జీతూ జోసెఫ్ దీనికి దర్శకుడు. జ్యోతిక ఇందులో కార్తి అక్కగా నటించింది. సైలెంట్ గా వస్తున్నా కూడా ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 

4. దబంగ్ 3..

ఎప్పుడూ హిందీలో వచ్చే సల్మాన్ ఖాన్ ఇప్పుడు తెలుగు మార్కెట్ పై కన్నేసాడు. మన మూడు సినిమాలు ఇలా ఉంటే దబంగ్ 3 అంటూ సల్మాన్ ఖాన్ దండయాత్ర చేస్తున్నాడు. ప్రభుదేవా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంపై అంచనాలు సంగతి పక్కనబెడితే మాస్ ప్రేక్షకులకు మాత్రం దబంగ్ 3 కచ్చితంగా పండగే. మొత్తానికి ఈ శుక్రవారం 4 సినిమాలు సందడి చేయబోతున్నాయి. మరి వీటిలో ఏది ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. 

More Related Stories