90ఎంఎల్ మూవీ రివ్యూ90 ML Movie Review
2019-12-06 23:22:10

ఆర్ఎక్స్ 100 లాంటి సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత గుణ 369 సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తికేయ. ఇప్పుడు 90ఎంఎల్ సినిమాతో వచ్చాడు. ఇప్పుడు ఆల్కహాల్ తాగకపోతే చచ్చిపోయే అరుదైన జబ్బు ఉన్న యువకుడిగా 90 ఎమ్ఎల్ సినిమాతో వచ్చాడు కార్తికేయ.

కథ:

దేవదాసు(కార్తికేయ) ఆథరైడ్జ్ డ్రింకర్. ఒక్కపూట తాగకపోయినా కూడా చచ్చిపోతాడు. అలాంటి అరుదైన జబ్బు ఉంటుంది. దాంతో తల్లిదండ్రులే ఈయనకు మందు అలవాటు చేస్తారు. అలాంటి అరుదైన జబ్బున్న దేవదాస్ అసలు మందు వాసన కూడా పడని సువాసన (నేహా సోలంకి) ని ప్రేమిస్తాడు. ఆమెను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె కూడా దేవదాసును ఇష్టపడుతుంది. కానీ దేవదాసు జబ్బు విషయం తెలియక సువాసన అతన్ని ప్రేమిస్తుంది. కానీ ఒక్కరోజు కూడా తాగకుండా ఉండని దేవదాసును చూసి ఆమె ద్వేషించడం మొదలుపెడుతుంది. అలాంటి సమయంలోనే జాన్ విక్ (రవికిషన్) అనే వ్యాపారవేత్త కూడా సువాసనను ప్రేమిస్తున్నానని వస్తాడు. అలాంటి సమయంలో దేవదాస్ ఏం చేసాడు.. అసలేంటి కథ అనేది మిగిలిన కథ..

కథనం:

హీరోను విలన్ చిన్న దెబ్బ కొడితేనే మన ఆడియన్స్ తట్టుకోలేరు.. మరి అలాంటిది హీరోకు డిసీజ్ పెట్టి హిట్ కొట్టడం అంటే చిన్న విషయం కాదు.. సినీ రంగస్థలంపై పక్కా కథ రాసుకుంటే కానీ దర్శకులను రాజా ది గ్రేట్ అంటారు ప్రేక్షకులు.. అంతేకానీ హీరోకు వ్యాధి పెట్టేస్తే కొత్త కథ అయిపోదు కదా. ఇప్పుడు 90ఎమ్ఎల్ సినిమా చూస్తుంటే ఇదే అనిపించింది నాకు.. హీరో ఒక్కపూట మందు తాగకపోతే చచ్చిపోతాడు.. పాయింట్ కొత్తగానే ఉంది.. కానీ కథనంలోనే చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు దర్శకుడు శేఖర్ రెడ్డి యెర్రా. పాయింట్ కొత్తదే తీసుకున్నా కూడా తీసిన విధానం మాత్రం అస్సలు ఆకట్టుకోలేదు.. రొటీన్ స్క్రీన్ ప్లేతో ఎక్కడికక్కడ బోర్ కొట్టించి బోరుమనిపించాడు దర్శకుడు. ఆర్ఎక్స్ 100, గుణ 369 సినిమాల్లో కనీసం కథ బాగుంది..  కానీ ఈ సారి దానిపై కూడా ఫోకస్ చేయలేదు కార్తికేయ. కేవలం దర్శకుడు చెప్పిన పాయింట్‌కు పడిపోయినట్లున్నాడు.. కానీ కథనం మర్చిపోయాడు.. దర్శకుడు అయితే తొలి సన్నివేశం నుంచి హీరో చేతిలో 90 ఎమ్ఎల్ పెట్టి కథను ముందుకు నడిపించాడు.. తాగితే ఉంటాడు.. లేకపోతే కష్టం అన్నట్లు సీన్స్ అల్లుకున్నాడు.. కానీ అందులో అయినా ఆకట్టుకునే సన్నివేశాలు ఉన్నాయా అంటే అదీ లేదు.. ఇక రవికిషన్ కారెక్టర్ దర్శకుడు ఏమనుకుని డిజైన్ చేసి ఏం చేసాడో అస్సలు అర్థం కాలేదు.. అజయ్ అయితే కేవలం హీరోతో తన్నులు తినడానికే మూడు సీన్స్‌లో కనిపించాడు.. హీరో కార్తికేయ ఆథరైజ్డ్ డ్రింకర్‌గా బాగా నటించాడు.. కానీ కథే సహకరించలేదు.. ఓవరాల్‌గా 90 ఎమ్ఎల్ కిక్ ఎక్కకపోగా.. ఎక్స్ ట్రా తలనొప్పి తెప్పించాడు. సినిమాలో కొన్ని అవనసరమైన సన్నివేశాలు పెట్టాడు దర్శకుడు. దేవదాసుతో మందు మాన్పించే సన్నివేశం అయితే మరీ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో ఒక్క సీన్‌తో అయిపోయే కథను క్లైమాక్స్ వరకు లాగేసాడు దర్శకుడు. ఏం చెప్తున్నాడో తెలియక తికమక పడ్డాడు దర్శకుడు.

నటీనటులు:

దేవదాసు పాత్రలో కార్తికేయ బాగా నటించాడు. సరదా సన్నివేశాలను ఎంత బాగా చేసాడో.. ఎమోషనల్ సీన్లలో అంతే బాగున్నాడు. అయితే కథ బాగోకపోవడంతో మనోడు ఎంత చేసినా కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. హీరోయిన్ నేహా సోలంకి అందాల ఆరబోతకు పనికొచ్చిందే కానీ కథలో పెద్దగా ఇమడలేకపోయింది. చాలా సన్నివేశాల్లో ముచ్చటగా అనిపించింది కానీ నటన రాలేదు. మందు తాగితే ఒకరకంగా, మామూలుగా ఉన్నప్పుడు మరోరకంగా వ్యవహరించే జాన్ విక్ క్యారెక్టర్ లాంటివి రవికిషన్‌కు అలవాటైన వ్యవహారం. ఓవర్‌గా బిహేవ్ చేసే క్యారెక్టర్‌లో రాణించాడు. క్షుణ్ణాకర్ రావుగా రావు రమేశ్ పాత్రకు వంక పెడతామా? చివర అర గంటలో ఆయన క్యారెక్టర్‌ను పాడు చెయ్యకుండా ఉన్నట్లయితే, ఆయన మరింతగా నచ్చి ఉండేవాడు. అజయ్, కారుమంచి రఘు, ప్రగతి, సత్యప్రకాశ్ పరిధుల మేరకు నటించారు. హీరో ఫ్రెండుగా రోల్ రిడా రాణించాడు. కామెడీ విలన్‌గా ప్రభాకర్ కొత్తగా కనిపించి మెప్పించాడు. పోసాని, అలీ, ప్రవీణ్ అతిథి పాత్రల్లో కనిపిస్తారు.

టెక్నికల్ టీం:

అనూప్ రూబెన్స్ సంగీతం పర్లేదు. సింగిల్ సింగిల్ పాట బాగుంది. మిగిలిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ చాలా వీక్. సెకండాఫ్ సాగతీత తప్ప మరోటి లేదు. సినిమాటోగ్రఫీ పర్లేదు. మంచి విజువల్స్ ఉన్నాయి. దర్శకుడు కథ కొత్తది రాసుకున్నా కూడా కథనం మాత్రం చాలా పాతది. మొత్తానికి దర్శకుడు కొత్త పాయింట్‌ను ఔట్ డేటెడ్ స్క్రీన్ ప్లేతో బోర్ కొట్టించాడు.

చివరగా:  90 ఎమ్ఎల్.. కిక్ ఎక్కకపోగా తిక్క ఎక్కింది..

రేటింగ్: 2 /5.

More Related Stories