అల వైకుంఠపురములో రివ్యూ Ala Vaikunthapurramuloo Review
2020-01-12 21:04:17

అల వైకుంఠపురములో సంక్రాంతికి వస్తుంది అనగానే అంతా బాబోయ్ అనుకున్నారు. కానీ కథపై నమ్మకంతో బన్నీ ముందడుగు వేసాడు. పైగా త్రివిక్రమ్ మరోసారి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉన్న సినిమాను తీసుకొచ్చాడు. మరి ఆ ఎమోషన్స్ అన్నీ సరిగ్గా మిక్స్ అయ్యాయా లేదా అనేది చూద్దాం.. 

కథ: 

వాల్మీకి (మురళి శర్మ) మిడిల్ క్లాస్ వ్యక్తి. రామచంద్రయ్య (జయరాం) కంపెనీలో పని చేస్తుంటాడు. తనతో పాటే పనిచేసిన రామచంద్రయ్య ఉన్నఫలంగా కోటీశ్వరుడు కావడం వాల్మీకికి నచ్చదు. అందుకే హాస్పిటల్లో అనుకోని పరిస్థితుల్లో తనకు పుట్టిన కొడుకును రామచంద్రయ్య కొడుకు స్థానంలో మార్చేస్తాడు. అలా పాతికేళ్లు గడిచిపోతాయి. ఆ పొరపాటుతో రాజాగా పెరగాల్సిన బంటు(అల్లు అర్జున్) కాస్త వాల్మీకి కొడుకుగా ఒక సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయిగా పెరుగుతాడు. పైగా ప్రతిరోజూ బంటుపై తన శాడిజం చూపిస్తుంటాడు వాల్మికి. ఈ క్రమంలోనే తను పనిచేసే ఆఫీస్ బాస్ అమూల్య (పూజా హెగ్డే) తో ప్రేమలో పడతాడు. అలా జరుగుతున్న సమయంలోనే తన జన్మరహస్యం తెలుసుకుంటాడు బంటు. ఆ తర్వాత వైకుంఠపురంలోకి వెళ్తాడు. అక్కడ తన నిజమైన అమ్మానాన్నల మధ్య సఖ్యత లేదని తెలుసుకుని.. ఆ కుటుంబ బాధ్యత తీసుకుంటాడు. అక్కడ్నుంచి ఏం జరిగింది అనేది కథ.. 

కథనం:

ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్.. తప్పు లేదు బ్రదర్ ఇవ్వచ్చు.. అల వైకుంఠపురంలో సినిమా చూసిన తర్వాత అదే అనిపిస్తుంది. ఈ మధ్య వరసగా సీరియస్ సినిమాలు చేసిన తనకు.. సరదా సినిమా చేయాలనిపించింది అన్నాడు బన్నీ. అన్నట్లుగానే పూర్తి సరదా సినిమాతో వచ్చాడు అల్లు అర్జున్.. అజ్ఞాతవాసి, అరవింద సమేత లాంటి ఎమోషనల్ సినిమాల తర్వాత త్రివిక్రమ్ కూడా తన జోనర్ లోకి వచ్చేశాడు. 

మరోసారి తనకు పట్టున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేశాడు.. తెలిసిన కథనే ఎమోషనల్ గా మలిచే ప్రయత్నం చేశాడు మాటల మాంత్రికుడు.. ముఖ్యంగా సినిమాలో కొన్ని క్యారెక్టరైజేషన్స్ ఆకట్టుకుంటాయి.. మురళి శర్మ, అల్లు అర్జున్ కొత్తగా కనిపించారు. అక్కడక్కడ అత్తారింటికి దారేది సన్నివేశాలు రిపీట్ అయినట్టు అనిపించింది.. అయినా కూడా స్క్రీన్ ప్లేతో మాయ చేశాడు త్రివిక్రమ్.. మాటల గారడీతో చాలా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. బన్నీ, మురళీశర్మ.. బన్నీ, పూజా హెగ్డే మధ్య వచ్చే సీక్వెన్స్ లు బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంటుంది.. 

సెకండాఫ్ చాలా వరకు ఎమోషనల్ గా సాగింది.. కొడుకులను మార్చే క్రమంలో మురళీశర్మ యాక్షన్.. సినిమా అంతా ఆయన పడే టెన్షన్ చిత్రంగా అనిపించింది.. వైకుంఠపురం వారసుడు తానే అని తెలుసుకున్న తర్వాత బన్నీ క్యారెక్టర్ చేంజోవర్ కథను ఆసక్తికరంగా మార్చేసింది.. అన్నీ ఎక్కడో చూసినట్లు అనిపించినా మాటలతో మాయ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. కష్టాల్లో ఉన్న తన ఫ్యామిలీని హీరో వచ్చి కాపాడటం చాలా సింపుల్ లైన్.. దానికి కావాల్సిన అన్ని మసాలాలు.. ఫ్యామిలీ ఎమోషన్స్ ఫిక్స్ చేశాడు త్రివిక్రమ్.. సంక్రాంతి సీజన్ కావడంతో ఫ్యామిలీస్ కి ఈ సినిమా ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.. చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ ఒక సరదా క్యారెక్టర్ చేశాడు.. పూజా హెగ్డే అందంగా ఉంది.. ఆకట్టుకుంది..సుశాంత్ చాలా సైలెంట్ గా తన పని చేసుకున్నాడు.. ఓవరాల్గా అల వైకుంఠపురంలో త్రివిక్రమ్ మార్క్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్..

నటీనటులు:

అల్లు అర్జున్ ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది కాస్త కొత్తగా అనిపించింది. పైగా నటుడిగా కూడా మరో మెట్టెక్కాడు బన్నీ. పూర్తిగా డిఫెరెంట్ మాడ్యులేషన్స్‌లో డైలాగులు చెప్పాడు. ఎమోషన్స్ అన్నీ బాగా పండించాడు. పూజా హెగ్డే అందంగా ఆకట్టుకుంది. టబు సగటు తల్లి పాత్రలో మెప్పించింది. జయరాం పర్లేదు.. సముద్రఖనిని అంతగా వాడుకోలేదు. సుశాంత్ పర్లేదు.. తన పాత్ర వరకు మెప్పించాడు. సునీల్, వెన్నెల కిషోర్, నివేదా పేతురాజ్, సచిన్ లాంటి వాళ్లు పర్లేదు. మురళి శర్మకు మంచి పాత్ర దక్కింది. స్వార్థం నిండిన పాత్రలో అదరగొట్టాడు ఈయన.

టెక్నికల్ టీం:

తమన్ సంగీతం సినిమాకు ప్రాణం. పాటలు కూడా బాగున్నాయి. అయితే సామజవరగమనా విజువల్‌గా పెద్దగా అనిపించలేదు. బుట్టబొమ్మ, రాములో రాములా అదిరిపోయాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఎడిటింగ్ పర్లేదు.. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. దర్శకుడిగా ఈ సారి త్రివిక్రమ్ ఎక్కువ మార్కులు అందుకున్నాడు. రచయితగా మాత్రం గుర్తుండిపోయే మాటలు తక్కువగానే రాసాడు కానీ సందర్భానుసారంగా వచ్చే మాటలు ఆకట్టుకున్నాయి. పైన ఎంత బరువు పెడితే అంత పైకి ఎదుగుతాడు లాంటి మాటలు బాగున్నాయి. ఓవరాల్‌‌గా తన సేఫ్ జోన్‌లోకి ఫ్యామిలీ సినిమా చేసాడు మాటల మాంత్రికుడు.

చివరగా:

అల వైకుంఠపురములో.. సంక్రాంతి పండక్కి పర్ఫెక్ట్ సినిమా.. 

రేటింగ్: 3.5/5.

More Related Stories