ఇక్కడ పులి ఎవరు.. మేక ఎవరు బన్నీ గారూ..alluarjun
2020-01-07 12:29:48

నా పేరు సూర్య తర్వాత ఏడాదిన్నరకు పైగా గ్యాప్ తీసుకుని అల్లు అర్జున్ చేసిన సినిమా అల వైకుంఠపురములో. ఈ చిత్ర ట్రైలర్ విడుదలైందిప్పుడు. బన్నీ హీరోగా వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు కావడంతో బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతుంది. పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా జనవరి 12న విడుదల కానుంది అల వైకుంఠపురములో. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా కచ్చితంగా రికార్డులు తిరగరాస్తుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. మరోవైపు ఈ చిత్ర డైలాగులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో మూడు డైలాగులు అయితే బాగానే హైలైట్ అయ్యాయి. నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది నాన్న.. చెప్పకపోతే ఎప్పుడు భయమేస్తుంది అనేది మరోసారి గురూజి కలంలోంచి జాలువారింది. ఇక ఈ భూమ్మీద దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంటుంది.. ఒకటి నేలకి రెండు వాళ్లకి.. అలాంటి వాళ్లతో గొడవలు ఎందుకు సర్ సరెండర్ అయిపోవాలి అంటూ మరో డైలాగ్ కూడా ఆడవాళ్ల గురించి గొప్పగా చెప్పాడు త్రివిక్రమ్. ఇక గొప్ప యుద్దాలన్నీ నా అనుకునే వాళ్ళతోనే అంటూ తనదైన శైలిలో మాయ చేసాడు త్రివిక్రమ్. ఇవన్నీ ఇలా ఉంటే మరో డైలాగ్ కూడా రచ్చ చేస్తుంది. పులి వచ్చింది..

మేక సచ్చింది అంటూ మాస్ డైలాగ్ ఒకటి రాసాడు మాటల మాంత్రికుడు. ఇక్కడ పులి ఎవరు.. మేక ఎవరు అంటూ ట్రోల్ నడుస్తుంది. సరిలేరు నీకెవ్వరు కూడా పండక్కే వస్తుండటంతో ఆ సినిమాను దృష్టిలో పెట్టుకునే బన్నీ పంచ్ వేసాడంటూ పంచులు పేలుతున్నాయి. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. తమన్ సంగీతం ఇప్పటికే హైలైట్ అయింది. టబు, జయరాం, మురళి శర్మ, సునీల్, హర్ష వర్ధన్ ముఖ్య పాత్రల్లో నటించారు. గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. దాదాపు 85 కోట్ల బిజినెస్ చేసింది ఈ చిత్రం. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. కచ్చితంగా ఈ చిత్రంతో హ్యాట్రిక్ పూర్తి చేస్తామని ధీమాగా చెబుతున్నారు ఈ ఇద్దరూ.

More Related Stories