అమ్మరాజ్యంలో కడపబిడ్డలు రివ్యూAmma Rajyam Lo Kadapa Biddalu Movie Review
2019-12-13 01:13:14

వర్మ సినిమా అంటే చాలు ఏదో తెలియని ఆసక్తి అయితే ఉంటుంది. ఆయన వరసగా ఫ్లాప్ సినిమాలు చేస్తున్నా కూడా ఆసక్తి మాత్రం తగ్గదు. ఇప్పుడు కూడా అమ్మరాజ్యంలో అంటూ మళ్లీ వచ్చాడు ఈయన. ఈ సారి ఏకంగా పొలిటికల్ సెటైర్ వేసాడు. మరి వర్మ ప్లాన్ వర్కవుట్ అయిందా లేదా అనేది చూద్దాం..

కథ:

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావిడితో కథ మొదలవుతుంది. ఓ వైపు ఆర్‌సిపి.. మరోవైపు వెలుగుదేశం.. ఇంకోవైపు మనసేన ఎన్నికల్లో గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాయి. అలాంటి సమయంలో విఎస్ జగన్నాథ రెడ్డి పార్టీ అధికారంలోకి వస్తుంది. కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 151 సీట్లు గెలుస్తుంది. అదే సమయంలో ముఖ్యమంత్రి కావాలనుకున్న బాబు గారి కొడుకు చినబాబు కల కలగానే మిగిలిపోతుంది. ఇక మనసేన అధ్యక్షుడు ఓడిన తర్వాత కూడా తనదైన శైలిలో ప్రెస్ మీట్స్ పెడుతూ ఉంటాడు. మధ్యలో అప్పుడప్పుడూ అమెరికా నుంచి పిపి జాన్ వచ్చి ప్రపంచ శాంతి అంటాడు. అలాంటి సమయంలో ఆంధ్ర పరిస్థితి గజిబిజిగా ఉన్న సమయంలో వెలుగుదేశం నేత దయనేని రమను దారుణంగా హత్య చేస్తారు కొందరు దుండగులు. అక్కడ్నుంచి కథ మొదలవుతుంది. ఆయన హత్యకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తాడు విఎస్ జగన్నాథ్ రెడ్డి. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ..

కథనం:

మీ వస్త్రాలంకరణ పై పెట్టిన శ్రద్ధ లో కాస్తయినా నీ స్వరాలంకరణపై పెట్టుంటే.. కింగ్ సినిమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది.. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సారీ సారీ.. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు చూసిన తర్వాత అనిపిస్తుంది ఎవరికైనా. అక్కడ క్యారెక్టర్లపై పెట్టిన శ్రద్ధ కథపై వర్మ అసలు పెట్టలేదని.. ఎంతలా అంటే ఎలా పడితే అలా తీసేంతలా. పేరుమోసిన రాజకీయ నాయకుల రూపాలు వాడుకుంటూ తన ఇష్టం వచ్చినట్లు సినిమా తీశాడు వర్మ. పైగా ఇది పొలిటికల్ సెటైర్ అంటూ కవరింగ్ ఇచ్చాడు.. ఎప్పటికప్పుడు ఇంతకంటే చెత్త సినిమా ఇక వర్మ తీయడు అని అనుకుంటున్న ప్రతిసారి..

అంతకంటే చెత్త సినిమా తీసి చూపించడం వర్మకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు కూడా ఇదే చేశాడు ఈ దర్శకుడు.. కేవలం కమ్మ కాపు కులాల పేరుతో సొమ్ము చేసుకోవాలని ఒక పిచ్చి సినిమా తీసినట్లు అనిపించింది. ఫిక్షన్ పేరుతో బతికున్న రాజకీయ నాయకుల చంపేయడం ఏంటో.. ఆ కాలజ్ఞానం ఏంటో వర్మకే తెలియాలి మరి.. ఎంత ఫిక్షన్ డ్రామా అయినా పొలిటికల్ సెటైర్ అయినా కథ బాగుంటే అన్నీ బాగుంటాయి. కానీ కంటెంట్ లేకుండా ఇష్టం వచ్చినట్లు తీసేస్తే దాన్ని ఏమంటారో వర్మ గారికే తెలియాలి. ఐకానిక్ కారెక్టర్స్‌ను వెర్రోళ్లను చేసి.. వాళ్లతో కామెడీ చేయించడం వెకిలిగా అనిపించింది..  ఫస్టాఫ్ అంతా ఎన్నికల ముందు ప్రచారం.. గెలిచిన తర్వాత జగన్ రాజకీయం గురించి ఎక్కువగా చూపించాడు. మరోవైపు చంద్రబాబు నాయుడుని పూర్తిగా నెగిటివ్ కోణంలో ఆవిష్కరించేసాడు వర్మ.. నారా లోకేష్ పాత్రను పూర్తిగా కమెడియన్‌ చేసేసాడు. పవన్ కళ్యాణ్‌ను ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆటలో అరటిపండు పాత్రలా మార్చేశాడు.. కే ఏ పాల్ క్యారెక్టర్ కూడా అంతే.. ఈయన ఒక కమెడియన్‌లా కనిపించాడు..

ధన్‌రాజ్, బ్రహ్మానందం పాత్రలు ఎందుకున్నాయో.. ఎందుకెళ్లాయో అర్థం కాదు.. కత్తి మహేష్, స్వప్నల పాత్రలను కూడా ఏదో కామెడీకి చూపించేసాడు..  ఫస్టాఫ్ వరకు ఎలాగోలా నెట్టుకొచ్చిన వర్మ సెకండాఫ్ లో మాత్రం ఇష్టమొచ్చినట్లు సినిమా తీశాడు.. ఓవరాల్‌గా కేవలం కాంట్రవర్సీతోనే తన అమ్మ రాజ్యానికి కలెక్షన్లు తెచ్చుకోవాలని వర్మ చేసిన ప్రయత్నమే ఈ సినిమా. అసలు వెలుగుదేశం అంటూ చంద్రబాబుతో పాటు లోకేష్ పాత్రలను దారుణంగా చూపించాడు వర్మ. ఇక పవన్ కల్యాణ్ అయితే పూర్తిగా కమెడియన్ అయిపోయాడు. పాల్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అలా ఏది పడితే అది తీసాడు ఈ దర్శకుడు.

నటీనటులు:

రంగం సినిమాలో విలన్ గా అలరించిన అజ్మల్ అమీర్ ఈ సినిమాలో జగన్ పాత్రలో కనిపించాడు. అచ్చు గుద్దినట్లు ఆయన్ని దించేసాడు. ముఖ్యంగా హావభావాల్లో కూడా అదరగొట్టాడు అజ్మల్ అమీర్. ఇక చంద్రబాబు పాత్రలో ధనుంజయ్ రుక్మకాంత్ ప్రభు బాగున్నాడు. కానీ జగన్, బాబు పాత్రలకు లిప్ సింక్ లేదు. మిగిలిన పాత్రలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. కాకపోతే అందర్నీ అచ్చు గుద్దినట్లు తీసుకొచ్చాడు వర్మ. బ్రహ్మానందం (బాబు కారు డ్రైవర్) ఏడెనిమిది సీన్లలో కనిపించి చివరలో ఒక్క డైలాగ్ మాత్రమే చెప్పారు. అలీ (స్పీకర్), ధీరజ్ కేవీ (చినబాబు అలియాస్ ఆకాశ్), నిధి కుశలప్ప (బాబు కోడలు రమణి), శ్రీసాయిదుర్గ (ఆర్సీపీ ఎమ్మెల్యే పూజ), శ్రీకాంత్ అయ్యంగార్ (దయలేని రమ), అరవింద్ రావ్ (మనసేనాని), జబర్దస్త్ రాము (పీపీ చాల్), ధన్‌రాజ్ (గంగవీటి భవాని), సిట్ ఆఫీసర్ (స్వప్న), సీబీఐ ఆఫీసర్ (కత్తి మహేశ్) సినిమాలో అలా కనిపిస్తారంతే.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు సంగీతం పేరుకు మాత్రమే. ఏం పాటలో అవి వర్మకే తెలియాలి మరి. ఇక ఎడిటింగ్ కు చాలా పని పడింది. కొన్ని డైలాగులు మ్యూట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ పర్లేదు. ఇక కథ విషయానికి వస్తే అసలు కథంటూ ఉంటే కదా మాట్లాడుకోడానికి. స్పూఫ్ పేరుతో ఏది పడితే అది తీసి చూపించాడు వర్మ. స్క్రీన్ ప్లే అసలు లేనే లేదేమో మరి..? అది రాయడం కూడా వర్మ పూర్తిగా మర్చిపోయినట్లున్నాడు. అంత దారుణంగా రాసాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం ఓ నేతను చంపడమేంటి.. అంటే భవిష్యత్తులో హత్య జరుగుతుందని ముందే వర్మ చెబుతున్నాడా..? క్లైమాక్స్ వరకు ట్విస్ట్ దాచడం.. అలా ఏది పడితే అది తీసాడు వర్మ. దర్శకుడిగా సిద్ధార్థ్ తాతోలు పేరు వేసినా నడిపించింది మాత్రం వర్మే అని అర్థమైపోతుంది.

చివరగా: స్పూఫ్ పేరుతో వర్మ చేసిన వల్గర్ కామెడీ..

రేటింగ్: 0.5 /5.

More Related Stories