అనిల్ రావిపూడిని అవమానించిన ఆ నటులు ఎవరు..Anil Ravipudi
2020-03-17 16:05:31

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి, కొరటాల శివ తర్వాత అపజయాలు లేకుండా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఈయన కోసం స్టార్ హీరోలు కూడా క్యూ కట్టారు. నిర్మాతలు అయితే అడ్వాన్సులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఇదంతా ప్రస్తుతం. గతంలో ఈయన దర్శకుడు కాక ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేటప్పుడు ఇద్దరు నటులు ఈయనను దారుణంగా అవమానించారు. అది తాను ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోను అంటున్నాడు అనిల్ రావిపూడి. 

ఒక మనిషిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదని.. ఎవరు రేపు ఏం అవుతారో తెలియదు అని చెప్పుకొచ్చాడు అనిల్. కెరీర్ కొత్తలో తాను గోపీచంద్ నటించిన శౌర్యం సినిమాకు రచయితగా పని చేసినా కూడా సీనియర్ రైటర్ రత్నం పేరు పడిందని చెప్పాడు అనిల్ రావిపూడి. ఆ తర్వాత మళ్లీ గోపీచంద్ హీరోగా వచ్చిన శంఖం సినిమాకి పని చేశాడు ఈయన. అయితే ఇది ప్లాప్ అయింది.. కానీ దానికి అనిల్ రావిపూడి పేరు పడింది. ఇదిలా ఉంటే శంఖం సినిమా సమయంలో ఇద్దరు నటులకు సీన్ వివరించడానికి వెళ్ళినప్పుడు తన గురించి చాలా చులకనగా మాట్లాడాలని గుర్తుచేసుకున్నాడు అనిల్ రావిపూడి. 

సినిమాలో నటించిన ఇద్దరు ఒక టెంట్ కింద కూర్చొని తన గురించి హేళన చేశారని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అనిల్. వాళ్ళిద్దరూ తన గురించి అడగగా నేను ఈ సినిమాకు రైటర్ గా పని చేస్తున్నానని వాళ్లకు చెబితే ''అదండీ.. ప్రతి వాడూ చేతిలో పెన్ను పేపర్ పట్టుకుని రైటర్ అని చెప్పి వచ్చేస్తారు. డైలాగులేమో ఇలా ఉంటాయి. మనం ఇంప్రొవైజ్ చేసి చెప్పాలి. ఇంకా ఏమవుదామనుకుంటున్నావు' అని వాళ్లిద్దరూ తను సెంటర్ చేసి ఒక అరగంట ఆడుకున్నారని గుర్తు చేసుకున్నాడు.

తాను డైరెక్టర్ కావాలనుకుంటున్నట్లు చెప్పగా.. 'వీడు డైరెక్టర్ కూడా అవుతాడట' అంటూ తనతో ఎగతాళిగా మాట్లాడుతూ కామెడీ చేసినట్లు అనిల్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ రోజే వాళ్ళు ఎప్పటికైనా సినిమాలో చేయకపోతారా అని అనుకున్నానని.. కానీ వాళ్లు ఇప్పటి వరకు తన సినిమాలో నటించే అవకాశం రాలేదని చెప్పాడు అనిల్ రావిపూడి. అయితే ఆ ఇద్దరు నటులు ఎవరనేది మాత్రం ఈయన చెప్పలేదు. 

More Related Stories