అనిల్ రావిపూడి ప్లాన్ బి.. ఎఫ్ 3 కాకుండా మరో సినిమా..Anil Ravipudi
2020-09-09 11:49:38

రాజమౌళి, కొరటాల శివ తర్వాత వరస విజయాలు అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటి వరకు ఈయన చేసిన ఐదు సినిమాలు కూడా విజయం సాధించాయి. అన్నీ నిర్మాతలకు మంచి లాభాలను తీసుకొచ్చాయి. ఈ ఏడాది మొదట్లో మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో టాప్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చేసాడు అనిల్. ఈ సినిమా తర్వాత వరసగా కథలు సిద్ధం చేస్తూనే ఉన్నాడు ఈ కుర్ర దర్శకుడు. ఈ క్రమంలోనే ఎఫ్ 3 కథ కూడా సిద్ధం చేసాడు. ఈ కరోనా వైరస్ కథ లేకపోయుంటే ఈ పాటికే ఎఫ్ 3 పట్టాలెక్కుండేది. కానీ ఏం చేస్తాం లాక్ డౌన్ కారణంగా ఎఫ్ 3 ఇంకా అలాగే ఉండిపోయింది. మరోవైపు ఈ చిత్రంలో నటించే వరుణ్ తేజ్, వెంకటేష్ కూడా ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు. వెంకటేష్ నటిస్తున్న నారప్ప ఏడాది చివరి వరకు షూటింగ్ జరగనుంది. మరోవైపు వరుణ్ తేజ్ కూడా బాక్సర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు అయ్యే వరకు కూడా అనిల్ కు వాళ్ల కోసం వేచి చూడటం తప్ప మరో ఆప్షన్ కూడా లేదు. 

అందుకే ఇప్పుడు మరో సినిమా చేయాలని ఈ దర్శకుడు భావిస్తున్నాడు. ఎప్పటినుంచో అనుకుంటున్న కాంబినేషన్ ఇప్పుడు పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు అనిల్ రావిపూడి. నందమూరి బాలకృష్ణతో ఈయన తర్వాత సినిమా ఉండబోతోందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. నిజానికి బాలయ్య 100వ సినిమా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయాలి. కాని అప్పుడు కుదర్లేదు. ఇప్పుడు మరోసారి బాలయ్య కోసం అని ఒక కథ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు. 

More Related Stories