అతడే శ్రీమన్నారాయణ మూవీ రివ్యూAthade Srimannarayana Review
2020-01-01 23:38:39

కన్నడ సినిమాలంటే ఒకప్పుడు మిగతా బాషల వారికి చిన్న చూపు ఉండేది. ఎక్కువగా అవుట్ డేటెడ్ కంటెంట్‌ని నమ్ముకుంటారనే భావన అందరిలో ఉండేది. కానీ కె.జి.ఎఫ్ ఎప్పుడయితే పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిందో ఆ భావన కొంత మారింది. కేజీఎఫ్ పుణ్యమా అని ఇప్పుడు మిగతా కన్నడ మేకర్స్ అండ్ యాక్టర్స్ తమ సినిమాలను మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అలా కన్నడలో 'అవనే శ్రీమన్నారాయణ' పేరుతో తెరకెక్కిన రక్షిత్ శెట్టి మూవీ కూడా పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కింది. ఇప్పటికే కన్నడలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అనిపించుకున్న ఈ సినిమా న్యూ ఇయర్ సందర్భంగా తెలుగులో 'అతడే శ్రీమన్నారాయణ' పేరుతో విడుదలయ్యింది. ఈ హీరో తెలుగులో ఎవరికే తెలియకున్నా రాష్మికా మందన్నా మాజీ ప్రియుడిగా మాత్రం తెలుసు. వీరిద్దరికీ బ్రేకప్ అన్నప్పుడు అందరూ అయ్యో పాపం అనుకున్న వాళ్ళే. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.

కథ:

అమరావతి అనే ఒక ఊరిలో నాటకాలు వేసిన ఒక బ్యాచ్ ఒక నిధి గురించిన విషయాలు కనిపెట్టి ఆ నిధి దొంగిలించుకుని పారిపోతుంటుంది. అయితే వాళ్ళను అడ్డుకున్న అభేరి అనే ఒక తెగ నాయకుడు రామ రామ, నిధి కోసం వాళ్ళను చంపుతాడు. అయితే వాళ్ళు చనిపోవడంతో ఆ నిధి ఆచూకీ ఎవరికీ తెలియకుండా పోతుంది. అలా పదిహేనేళ్ళు అయ్యాక రామ రామ కూడా కాలం చేస్తాడు. అయితే అతని పెద్ద కొడుకు అయిన జయరామ ఆ రాజ్యానికి నాయకుడు అవుతాడు. కానీ ఆ నిధి ఎక్కడుందో కనిపెట్టే వరకు సింహాసనం ఎక్కనని ప్రతిజ్ఞ చేస్తాడు. అయితే అదే టైం లో శ్రీమన్నారాయణ అమరావతికి ఎస్.ఐగా వస్తాడు. అతను ఒక సమయంలో జయరామ బారి నుండి ప్రాణాలతో భయపడడానికి ఆ నిధి కనిపెట్టి అతనికి అప్పగిస్తా అని చెబుతాడు. మరి శ్రీమన్నారాయణ చెప్పినట్టుగానే ఆ నిధి కనిపెట్టి అప్పచెప్పాడా ? నిధి దాచిన ఆ నాటకాల బృందంలో అందరూ చనిపోయినా ఆ నిధి రహస్యం ఎలా తెలుస్తుంది ? లాంటి అనేక విషయాలు సినిమా చూసి తెలుసుకోవలసిందే.

విశ్లేషణ :

మనకు పరిచయం లేని ముఖాలతోనే అనుకుంటే ఒక్క క్షణం మిస్ అయినా ఈ కథ ఒక పట్టాన అర్ధం కాదు.ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కూడా ఒక్కో చోట ఒక్కోలా ఉంది. అభేరి అనేది ఒక కోట అన్నట్టు సినిమా మొదట్లో చెబుతారు. ఆ కోట బయట ఉన్న బార్లు కౌ బాయ్ సినిమాని తలపించే విధంగా ఉంటాయి. అమరావతిలో మాత్రం ఒక ఊరు,ఆ ఊరిలో పోలీస్ స్టేషన్ మామూలుగా ఉంటాయి. దీంతో ఈ లాజిక్ అర్ధం చేసుకోవడం కష్టమే. నిధిని కనిపెట్టడం అనే పాత కథను కొత్త సీసాలో వేసి చూపే ప్రయత్నమే ఈ సినిమా. ఈ సినిమాకి ఏడుగురు రచయితలు పనిచేయడం సినిమా నిర్మాతల కొంపే కాదు ప్రేక్షకుల కొంప కూడా ముంచింది. రక్షిత్ శెట్టికి కన్నడలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, అక్కడి వాళ్లకు నేటివిటీ సీన్స్  మీద ద్రుష్టి పెట్టడం వలన ఈ సినిమా కన్నడ వరకే పరిమితం అవుహ్తుంది. అయితే ఈ సినిమాకి 'అతడే శ్రీమన్నారాయణ' అని పేరు ఎందుకు పెట్టారు,ఇక అతని నిధి అన్వేషణ ఎలా సాగింది అనేది కాస్త ఆసక్తికరంగా రాసుకున్నారు. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన సచిన్ రవి ఈ సినిమాకి ఎడిటర్ కావడం ఏమాత్రం ఉపయోగపడలేదు.

నటీనటులు:

రక్షిత్ శెట్టి తెలుగుప్రేక్షకులకు పూర్తిగా తెలియకపోయినా రష్మిక పుణ్యమా అంటూ అతని పేరు తెలుగు వారందరికే పరిచయమే. ఇక రక్షిత్ శెట్టి ఈ సినిమాకి రైటర్ కాబట్టి అతను రాసుకున్న పాత్రని రాసుకున్నటుగానే తెరపైకి తీసుకొచ్చాడు. గతంలో తెలుగులో చాలా సినిమాలు చేసిన శాన్వి ఈ సినిమాలో హీరోయిన్ అయినా ఆమె పాత్రకి పెద్దగా స్కోప్ లేదు. రామ రామ పాత్రలో నటించిన మధుసూధన్ కూడా మొదటి రెండు సీన్స్ కి మాత్రమే పరిమితం అయ్యాడు. అంటే సినిమా మొత్తంలో మనకి అంటే తెలుగు వాళ్ళకి తెలిసిన ముఖాలు కూడా పెద్దగా కనిపించవు.అజనీష్ లోకనాథ్ సంగీతం మాత్రం పర్లేదు అనిపిస్తుంది. అలానే సినిమా అంతా కెమెరామన్ కష్టం కనిపిస్తుంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి నిర్మాత కూడా బాగానే ఖర్చు చేశాడు. ఈ సినిమా కన్నడలో రిలీజ్ అయ్యి హిట్ అయిపోవడం వల్ల సినిమా నిర్మాతలు సేఫ్ అయిపోయారు. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చాలి అని చెప్పలేం.

చివరిగా : ప్రతి కన్నడ ప్యాన్ ఇండియా సినిమా కేజీఎఫ్ కాజాలదు. 

రేటింగ్: 2.5 /5.

More Related Stories