భీష్మ రివ్యూBheeshma Movie Review
2020-02-21 20:27:47

మూడేళ్లుగా హిట్ లేదు.. ఏడాదిన్నరగా ఒక్క సినిమా కూడా చేయలేదు. శ్రీనివాస కళ్యాణం ఫ్లాప్ తర్వాత నితిన్ పూర్తిగా సినిమాలకు దూరమైపోయాడు. ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు భీష్మ అంటూ వచ్చాడు. పైగా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటూ వచ్చాడు. మరి ఈ చిత్రంతో నితిన్ ఎంతవరకు ఆకట్టుకున్నాడు..?

కథ :

భీష్మ (నితిన్) డిగ్రీ ఫెయిల్ అయి ఒక్క అమ్మాయి అయినా పడకపోతుందా అని వేచి చూస్తుంటాడు. మరోవైపు అదే పేరుతో ఉన్న పెద్దాయన భీష్మ (ఆనంత్ నాగ్) రైతుల కోసం.. సారవంతమైన భూమి కోసం భీష్మ ఆర్గానిక్స్ మొదలుపెడతాడు. అందులో సేంద్రీయ వ్యవసాయం గొప్పతనం చెబుతుంటాడు. వయసు మీద పడటంతో ఆయన తర్వాత 8 వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి నెక్ట్స్ సీఈఓ ఎవరు అనే ప్రశ్న వచ్చినపుడు ఎవరూ ఊహించని విధంగా డిగ్రీ ఫెయిలైన భీష్మ పేరు ప్రకటిస్తాడు పెద్దాయన. అదే సమయంలో ఛైత్ర (రష్మిక మందన్న)ను పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా తిరుగుతుంటాడు భీష్మ. ఉన్నట్లుండి సీఈఓ కావడంతో ఆ తర్వాత భీష్మ ఏం చేస్తాడు.. భీష్మ ఆర్గానిక్స్ కంపెనీని నాశనం చేయడానికి కార్పోరేట్ విలన్ రాఘవన్ (జిష్షు) తో ఎలా తడపడతాడు అనేది అసలు కథ..

కథనం:

సందేశం ఇస్తుంటే తీసుకునే రోజులు కావు ఇవి. అందుకే దర్శకులు కూడా ఈ మధ్య మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలంటే అమ్మో అనుకుంటున్నారు. కొరటాల లాంటి ఒకరిద్దరు దర్శకులకే ఇది బాగా వర్కవుట్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో వెంకీ కుడుముల కూడా ఇలాంటి సందేశాత్మక కథతోనే వచ్చాడు. ఛలో లాంటి వినోదాత్మక సినిమా చేసిన ఈయన.. రెండో సినిమాకు పూర్తిగా ట్రాక్ మార్చేసాడు. 

సేంద్రీయ వ్యవసాయం గొప్పతనం చెబుతూ దాని చుట్టూ కథ అల్లుకున్నాడు. దాన్ని ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో రాసుకున్నాడు. కథ బాగుండటం.. మంచి కథనం కూడా ఉండటంతో భీష్మ మెప్పిస్తుంది. ముఖ్యంగా తాను చెప్పాలనుకున్న కథను తొలి ఐదు నిమిషాల్లోనే చెప్పి ఆ తర్వాత కామెడీలోకి వెళ్లాడు దర్శకుడు. అక్కడ్నుంచి నాన్ స్టాప్‌గా నవ్విస్తూనే మరోవైపు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ లవ్ ట్రాక్.. మధ్యలో వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ ఆకట్టుకుంది.. 

ముఖ్యంగా వెన్నెల కిషోర్ వచ్చిన ప్రతిసారి నవ్వులు బాగా వచ్చాయి.. నితిన్ కూడా కెరీర్లో తొలిసారి ఇంత ఎంటర్టైనింగ్ రోల్ చేశాడు.. ఓ వైపు నవ్విస్తూనే.. మరోవైపు ఎమోషన్ కూడా బాగా పండించాడు.. హీరో క్యారెక్టరైజేషన్ దర్శకుడు వెంకీ కుడుముల చాలా బాగా రాసుకున్నాడు.. ఇంటర్వెల్ కు చిన్న సర్ప్రైజ్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ కామెడీ బాట పట్టాడు వెంకీ కుడుముల.. అయితే ఎంత నవ్వించినా కూడా.. తాను చెప్పాలనుకున్న ఆర్గానిక్ ఫార్మింగ్ విషయం మాత్రం పక్కదారి పట్టించలేదు.. సందేశం ఇస్తే ఇంత సరదాగా ఉంటుందా అన్నట్లుగా ఈ సినిమా తీశాడు.. 

తెలిసిన కథే అయినా కూడా.. తెలివైన స్క్రీన్ ప్లేతో నడిపించాడు వెంకీ.. ముఖ్యంగా ఆయన గురువు త్రివిక్రమ్ మార్క్ ఈ సినిమాలో కనిపించింది.. మాటలు కూడా బాగానే రాసుకున్నాడు.. సెకండాఫ్ లో రెండు మూడు కామెడీ సీన్స్ బాగా పేలాయి.. రష్మిక మందన మరోసారి గీతగోవిందం తరహాలో హీరో ను డామినేట్ చేసింది.. ఛలో సినిమాలో కేవలం కామెడీపై ఫోకస్ చేసిన వెంకీ.. ఈ సారి మాత్రం కామెడీతో పాటు కథను తీసుకొచ్చాడు.. 

సెకండాఫ్‌లో పొలం దగ్గర వచ్చే ఫైట్ సీన్.. హీరో విలన్ మీట్ అయ్యే సీన్.. ఇవన్నీ చాలా స్టైలిష్‌గా డిజైన్ చేసాడు దర్శకుడు. అందులో త్రివిక్రమ్ మార్క్ కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక దాంతో పాటే వెన్నెల కిషోర్, రఘు బాబు ట్రాక్ కూడా బాగుంది. ఓవరాల్‌గా చెప్పాల్సిన కథను చెప్తూనే ఎక్కడా ట్రాక్ తప్పకుండా కామెడీతో బాగా హ్యాండిల్ చేసాడు దర్శకుడు.

నటీనటులు:

నితిన్ లో పెళ్లి కళ కనిపిస్తుంది. చాలా అందంగా ఉన్నాడు సినిమాలో. దానికితోడు మంచి ఈజ్‌తో నటించాడు కూడా. కామెడీతో కడుపులు చెక్కలు చేసాడు. ఆయన కెరీర్‌లో బెస్ట్ కామెడీ సీక్వెన్సులు ఈ చిత్రంలో ఉన్నాయి. వెన్నెల కిషోర్‌తో ట్రాక్ అదిరిపోయింది. ఇక రష్మిక మందన్న మరోసారి ఆకట్టుకుంది. గీత గోవిందం తరహాలో హీరోను డామినేట్ చేసే పాత్ర ఇది. వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోయింది. మరోసారి తన మార్క్ కామెడీతో కడుపులు చెక్కలు చేసాడు. రఘు బాబు, బ్రహ్మాజీ, నరేష్ కూడా బాగానే నవ్వించారు. అశ్వథ్థామ విలన్ జిస్సు సేన్ గుప్తా ఈ చిత్రంలో కార్పోరేట్ విలన్‌గా అదిరిపోయాడు. మంచి నటన కనబర్చాడు.

టెక్నికల్ టీం:

మహతి స్వర సాగర్ సంగీతం పర్లేదు. పాటలు పెద్దగా ఎక్కలేదు కానీ ఆర్ఆర్ మాత్రం బాగుంది. ముఖ్యంగా పొలం ఫైట్ అప్పుడు వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు బలం. చాలా సన్నివేశాలు అతడి కెమెరా వర్క్‌తో హైలైట్ అయింది. ఎడిటింగ్ కూడా బాగుంది. కథకుడిగా వెంకీ కుడుముల మంచి కథనే రాసుకున్నాడు. ఇక స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా రాసుకున్నాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా కామెడీతో కోటింగ్ ఇచ్చాడు. ఓవరాల్‌గా సందేశాన్నిస్తూనే బోర్ కొట్టించకుండా కథనంతో కట్టిపాడేసాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:

భీష్మ.. మంచి వ్యవసాయం లాంటి సినిమా..

రేటింగ్: 3/5.

More Related Stories