కరోనాతో సంగీత దర్శకుడు మృతి

కరోనా ఎవరినీ వదలడం లేదు. రాజు, పేద తేడా లేకుండా ఈ వైరస్ అందరినీ పీడిస్తోంది. తాజాగా కరోనా కాటుకు ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ కన్నుమూశారు. ముందు నుండీ కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయనకి కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో చెంబూరులోని సురన హాస్పిటల్ లో చేరారు. అయితే ఈ రోజు తెల్లవారు జామున ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆయన కన్నుమూశారు. వాజిద్ మృతి పట్ల బాలీవుడ్ పరిశ్రమ సంతాపం తెలియజేసింది. సల్మాన్ ఖాన్ హీరోగా 1998లో వచ్చిన ప్యార్ కియా తో డర్నా క్యా అనే సినిమాతో సాజిద్ వాజిద్ ద్వయ బాలీవుడ్ ఆరంగేట్రం చేశారు. గర్వ్, తేరేనామ్, తుమ్కో నా బూల్ పాయేంగే, పార్ట్నర్, దబాంగ్ ఫ్రాంచైజీలో వచ్చిన చిత్రాలన్నింటికీ ఈ ద్వయం సంగీతం అందించారు. ఇటీవల లాక్ డౌన్ లో ఈద్ సందర్భంగా కూడా సల్మాన్ ఖాన్ మీద ‘‘భాయ్ భాయ్’’అంటూ ఓ పాటను రిలీజ్ చేశారు సాజిద్- వాజిద్ లు. వాజిద్ ఖాన్ మృతి తీరని లోటని వాజిద్ ఖాన్ నవ్వును మేమెప్పుడూ మర్చిపోలేమని ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాజిద్ భాయ్ మృతి పట్ల వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నామని ప్రియాంకచోప్రా ట్వీట్ చేశారు.