ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికరమైన విషయం చెప్పిన సునీల్..sunil
2020-03-09 07:44:05

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలుగు ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ ఒక సూపర్ స్టార్. పేరుమోసిన వారసులు కూడా ఆయన స్థాయిలో ఎంట్రీ ఇవ్వలేదు. వరసగా 3 బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీ లోనే కాదు మొత్తం సౌత్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాడు ఉదయ్ కిరణ్. మిలీనియం మొదట్లో ఈయన సినిమాలు సృష్టించిన సంచలనాలు చెప్పడానికి మాటలు సరిపోవు. ఈయన ఎదుగుదల చూసి స్వయానా మెగాస్టార్ చిరంజీవి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు.. కానీ అనుకోకుండా ఆ పెళ్లి ఆగిపోవడంతో అప్పటి నుంచి ఉదయ్ కిరణ్ జీవితం తలకిందులు అయిపోయింది. 2004 నుంచి పదేళ్ల పాటు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న ఉదయ్ 2014లో ఆత్మహత్య చేసుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఒక సంచలనం. ఆయన చనిపోయి ఆరేళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో కమెడియన్ సునీల్ తన స్నేహితుడు ఉదయ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు చెప్పాడు. ఈ ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. సునీల్ కెరీర్ మొదట్లో ఉదయ్ కిరణ్ నటించిన ప్రతి సినిమాలోనూ కనిపించాడు. అందులో నువ్వు నేను, మనసంతా నువ్వే, శ్రీరామ్, హోలీ లాంటి సినిమాల్లో ఈ ఇద్దరి కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది.

ఆ తర్వాత ఉదయ్ కిరణ్ సూసైడ్ విషయం తెలుసుకొని సునీల్ చాలా బాధపడ్డాడు. ఇదిలా ఉంటే నువ్వు నేను షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకున్నాడు సునీల్. ఆ సినిమాలో ఒక రన్నింగ్ రేస్ సమయంలో నిజమైన రన్నర్ లను తీసుకొచ్చాడు దర్శకుడు తేజ. వాళ్లతో కలిసి ఉదయ్ కిరణ్ ను పరిగెత్తాలని కోరాడు. ప్రతి సీన్ లో పర్ఫెక్షన్ కోసం తేజ ఎంత దూరమైన వెళ్తాడని అందరికీ తెలుసు. సునీల్ కూడా ఇదే చెప్పాడు. అయితే ఆరోజు కూడా రన్నింగ్ రేస్ సీన్ లో నిజంగానే రన్నర్ లకు పోటీగా ఉదయ్ కిరణ్ పరిగెత్తి తొలి స్థానం సంపాదించాడు. అప్పుడు సునీల్ వెళ్లి అంత స్పీడ్ గా ఎలా పరిగెత్తావని ఉదయ్ ని అడిగితే.. చిన్నప్పుడు బస్సుల వెంట పరుగెత్త అలవాటు అయిపోయిందని సరదా సమాధానం చెప్పాడు. షూటింగ్ సెట్లో అంత సరదాగా ఉండే ఉదయ్ కిరణ్ ఆ తర్వాత అలా ఆత్మహత్య చేసుకోవడం జీర్ణించుకోలేకపోయానని చెప్పాడు సునీల్.

More Related Stories