డిస్కోరాజా రివ్యూDisco Raja Movie Review
2020-01-24 20:16:12

రవితేజ సినిమాలకు ఒకప్పుడు టాక్ అడిగేవాళ్ళు కాదు.. కచ్చితంగా సినిమా బాగుంటుందనే నమ్మకం ఉండేది. కానీ కొన్నేళ్లుగా ఆ నమ్మకం పోగొట్టుకున్నాడు మాస్ రాజా. గత కొన్ని సినిమాలు అంచనాలు అందుకోలేదు. ఇలాంటి సమయంలో డిస్కో రాజాతో వచ్చాడు రవితేజ. మరి విఐ ఆనంద్ లాంటి భిన్నమైన సినిమాలు చేసే దర్శకుడితో మాస్ రాజా మాయ చేసాడా..?

కథ :

వాసు (రవితేజ) ఢిల్లీలో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అలాంటి వాన్ని కొందరు గుర్తు తెలియని లధాక్‌లో అతి దారుణంగా చంపేస్తారు. అక్కడే మంచులో వదిలేసి వెళ్లిపోతారు. దాంతో మంచులో కూరుకుపోయి దారుణంగా వాసు డెడ్ బాడీ అలాగే ఉండిపోతుంది. అదే సమయంలో వాసు గాళ్ ఫ్రెండ్ నభా (నభా నటేష్) కూడా అతడి కోసం ఢిల్లీ అంతా చూస్తుంటుంది. ఇక వాసు డెడ్ బాడీని డాక్టర్ పరిణీతి (తాన్యా హోప్) బృందం ల్యాబ్‌కు తెప్పించుకుంటారు. చచ్చిపోయిన మనిషిని బతికించే ప్రయోగం చేస్తుంటాడు అక్కడి ఛీఫ్ డాక్టర్. అలాంటి ప్రయోగంతోనే వాసును మళ్లీ బతికిస్తాడు. కానీ అప్పుడే తెలుస్తుంది చనిపోయిన వాసు.. డిస్కో రాజా పోలికలతో ఉంటాడని. అసలు ఈ డిస్కో రాజా ఎవరు.. వాసు, డిస్కో రాజాకు ఏంటి సంబంధం.. వాసును ఎందుకు చంపేస్తారు.. డిస్కో రాజా ఎలా చచ్చిపోతాడు అనేది అసలు కథ..

కథనం:

చనిపోయిన మనిషి మళ్లీ కొన్నేళ్ళ తర్వాత బతికే ఛాన్స్ ఉందా..? వినడానికే చిత్రంగా ఉంది కదా.. ఆ చిత్రాన్నే కథగా రాసుకున్నాడు విఐ ఆనంద్..  డిస్కో రాజా కథను మొదలవ్వడమే అలా మొదలైంది.. దాంతో ఆసక్తి కూడా ఆటోమేటిక్‌గా అలా వచ్చేసిందంతే.. ఫస్టాఫ్ కొన్నిచోట్ల వింటేజ్ రవితేజ కనిపించాడు.. డిస్కో ఆర్ఆర్ అయితే పీక్స్ అంతే.. ఆ బ్యాగ్రౌండ్ స్కోర్ వస్తున్నప్పుడల్లా తెలియకుండానే తల, కాళ్లు కదిలేస్తాయి.. 

చనిపోయిన మనిషిని సైన్స్‌తో బతికించడం.. తనను చంపిన వాళ్ల కోసం హీరో వెతకడం.. ఆ క్రమంలోనే గతం తెలుసుకోవడం.. డిస్కో రాజా ఎంట్రీ.. అన్నీ ఫస్టాఫ్‌లోనే చకాచకా చూపించేసాడు దర్శకుడు విఐ ఆనంద్.. అప్పటి వరకు స్క్రిప్ట్ కూడా చాలా పకడ్బందీగానే సాగింది.. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుండటంతో సెకండాఫ్‌పై మరింత ఆసక్తి పెరిగిపోయింది. ఫస్టాఫ్ ఇచ్చిన బిల్డప్‌తో డిస్కో రాజా ఫ్లాష్ బ్యాక్ అంచనాలు పెంచేసింది.. 

కానీ సెకండాఫ్ మాత్రం అలా సాగలేదు.. అక్కడక్కడా కాస్త సా...గింది.. ముఖ్యంగా పాయల్ రాజ్‌పుత్ ఎపిసోడ్ ఆసక్తికరంగా అనిపించలేదు..  కథకు స్పీడ్ బ్రేకర్‌గా మారిపోయింది.. రవితేజ రెట్రో స్టైల్స్ మాత్రం అదుర్స్. ఫస్టాఫ్ స్పీడ్ సెకండాఫ్ తట్టుకోలేక తగ్గిపోయింది..  80స్ కథ కావడంతో దాన్ని సెకండాఫ్‌లో బాగానే ఎలివేట్ చేసాడు దర్శకుడు ఆనంద్.. ప్రయోగమే కానీ రవితేజ స్టైల్లో చెప్పడంతో అక్కడక్కడా కథ రొటీన్ అయిపోయింది. 

సెకండాఫ్ లో కొన్ని సీన్స్ కేజియఫ్ సినిమాను తలపించాయి. హీరో బిల్డప్ షాట్స్ అన్నీ అలా అనిపించాయంతే. ఇక డిస్కో రాజా ఫ్లాష్ బ్యాక్ కూడా మొత్తంగా రొటీన్ గ్యాంగ్ స్టర్ డ్రామా చేసాడు ఆనంద్. చివరికి అది రివేంజ్ డ్రామా అయిపోయింది.. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది.. రవితేజ తర్వాత బాబీ సింహా కారెక్టర్ అదిరిపోయింది.. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే ఏదో మ్యాజిక్ ఉంటుంది.. సునీల్ కూడా సర్ ప్రైజింగ్ రోల్‌తో అదరగొట్టాడు.. క్లైమాక్స్ సునీల్ సొంతం. తమన్ సంగీతం అదిరిపోయింది.. ముఖ్యంగా ఆర్ఆర్ నెక్ట్స్ లెవల్లో ఉంది..  హీరోయిన్స్ పాయల్, నభా నటేష్, తాన్యా హోప్ జస్ట్ ఉన్నారంతే.. మెయిన్ ప్లాట్ బాగుంది.. రవితేజ డిఫెరెంట్ డైమెన్షన్స్ ఆకట్టుకుంటాయి..  ఓవరాల్‌గా రవితేజ నుంచి వచ్చిన డిఫెరెంట్ సైఫై డ్రామా డిస్కో రాజా..

నటీనటులు:

రవితేజ బాగా చేసాడు. అతడు ఎంత మంచి నటుడో మరోసారి నిరూపించుకున్నాడు. ముఖ్యంగా డిస్కో రాజా పాత్రలో చంపేసాడంతే. చాలా కోణాలు చూపించాడు ఈయన. బాబీ సింహా కూడా అదరగొట్టాడు. తమిళ యాస ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. ఆయన ఫేస్‌లోనే ఏదో మ్యాజిక్ ఉంది. స్క్రీన్ పై తెలియని మ్యాజిక్ చేస్తాడు సింహా. ఇక సునీల్ ఈ చిత్రంలో సర్‌ప్రైజ్ ప్యాకేజ్. క్లైమాక్స్ చంపేసాడు. నభా నటేష్, తాన్యా హోప్, పాయల్ రాజ్‌పుత్ పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ అయితే లేదు. వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నికల్ టీం:

తమన్ సంగీతం బాగుంది. ముఖ్యంగా ఆర్ఆర్ అయితే అదరగొట్టాడు. సినిమా రేంజ్ పెంచేసింది ఈ బ్యాగ్రౌండ్ స్కోర్. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ పర్లేదు కానీ సెకండాఫ్ ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. కొన్ని సన్నివేశాలు కథ వేగానికి అడ్డుపడినట్లు అనిపించాయి. దర్శకుడిగా విఐ ఆనంద్ మరోసారి భిన్నమైన కథను తీసుకున్నాడు కానీ మధ్యలో రొటీన్ అయిపోయాడు. ముఖ్యంగా డిస్కో రాజా ఫ్లాష్ బ్యాక్ గురించి చాలా ఊహించుకుంటాం కానీ అంత బలమైన సన్నివేశాలు అక్కడ లేకపోవడం మైనస్ అనిపించింది. అయితే కథ పరంగా కొత్తగా ఉండటం.. రవితేజ నటనను బాగా వాడుకున్నాడు ఈయన. ఓవరాల్‌గా దర్శకుడిగా పూర్తి సత్తా మాత్రం చూపించలేదు. కొత్త పాయింట్ తీసుకున్నా డీల్ చేయడంలో తేడా కొట్టింది.

చివరగా ఒక్కమాట:

డిస్కో రాజా.. రవితేజ డిఫెరెంట్ సైఫై డ్రామా.

రేటింగ్: 2.5/5.

More Related Stories