దుల్కర్ సల్మాన్‌తో తెలుగు క్లాస్ డైరెక్టర్..Dulquer Salmaan
2020-05-09 00:05:05

దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమాలపై కూడా ఫోకస్ చేసాడు. ఈయన సౌత్ ఇండస్ట్రీ మొత్తం మార్కెట్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే తెలుగులో ఓకే బంగారం, మహానటి లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మధ్య విడుదలైన కనులు కనులు దోచాయంటే కూడా పర్లేదనిపించింది. ఇలాంటి సమయంలో ఈయన నేరుగా తెలుగు సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. దీనికి హను రాఘవపూడి దర్శకుడు. అందాల రాక్షసి సినిమాతో పరిచయమైన ఈయన.. నాని కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాతో పర్లేదనిపించాడు. అయితే ఆ తర్వాత నితిన్ తో చేసిన లై.. శర్వానంద్ పడిపడి లేచే మనసు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో హను వైపు చూడ్డానికి మన హీరోలు సాహసించడం లేదు.

 ఆ మధ్య అసురన్ రీమేక్ అవకాశం హనుకే వచ్చిందనే వార్తలు వినిపించినా కూడా.. చివరికి దాన్ని శ్రీకాంత్ అడ్డాలకు ఇచ్చాడు వెంకటేష్. దాంతో మరోసారి ఖాళీ అయిపోయాడు హను. పైగా చెప్పిన బడ్జెట్ కంటే ఎక్కువ చేస్తాడనే విమర్శలు కూడా ఈయనపై ఉన్నాయి. నితిన్ లై.. శర్వానంద్ పడిపడి లేచే మనసు సినిమాల విషయంలో ఇదే జరిగిందనే వాదన కూడా ఉంది. దాంతో తెలుగు హీరోలెవరూ హనుతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. 

ఇలాంటి సమయంలో దుల్కర్ సల్మాన్ కు కథ చెప్పి ఒప్పించినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాతోనే హీరోగా తెలుగులో దుల్కర్ పరిచయం కాబోతున్నాడని తెలుస్తుంది. వైజయంతీ మూవీస్ ఈ సినిమాను నిర్మించబోతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయ్యాయని తెలుస్తుంది. మహానటి కూడా ఈ బ్యానర్ లోనే వచ్చింది. ఇప్పుడు మరోసారి ఇదే బ్యానర్ లో దుల్కర్ సినిమా చేయబోతున్నాడు. 

More Related Stories