గ్యాంగ్ లీడర్ రివ్యూGang Leader Review
2019-09-13 13:56:58

విక్రమ్ కే కుమార్, నాని.. ఈ కాంబినేషన్ చాలు సినిమాపై అంచనాలు పెంచడానికి.. అంతే భారీ అంచనాలతో గ్యాంగ్ లీడర్ వచ్చేసాడు.. మరి అతనెలా ఉన్నాడో చూద్దాం..

కథ:

పెన్సిల్ పార్థసారథి (నాని) ఫేమస్ రివేంజ్ రైటర్. హాలీవుడ్ సినిమాలు చూసి కాపీ కొడుతుంటాడు. అలాంటి రైటర్ దగ్గరికి తమ పగను పంచుకోడానికి ఐదుగురు లేడీస్ వస్తారు. వాళ్లందర్నీ ఒకే దగ్గరికి చేర్చి గ్యాంగ్ లీడర్ అవుతాడు పెన్సిల్. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. అసలు పెన్సిల్ వాళ్లకు ఎందుకు సాయం చేస్తాడు.. ఎలా చేస్తాడు.. ఆ ఐదుగురు ఆడవాళ్లు వెతుకుతున్న ఆరోవాడు దేవ్ (కార్తికేయ) ఎవరు..? దేవ్ వీళ్లకేం అన్యాయం చేసాడు అనేది గ్యాంగ్ లీడర్ కథ..

కథనం:

ఇష్క్, మనం, 24, హలో.. ఇలాంటి సినిమాల తర్వాత విక్రమ్ కే కుమార్ నుంచి వస్తున్న సినిమా అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. హిట్ అయినా ఫ్లాప్ అయినా విక్రమ్ సినిమాల్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. గ్యాంగ్ లీడర్ లో కూడా కచ్చితంగా ఆ మ్యాజిక్ ఉంటుందని అభిమానులు నమ్మారు. నాని కూడా కథ నమ్మడంతో కచ్చితంగా మాయ జరుగుతుందనే నమ్మారు ప్రేక్షకులు కూడా. కానీ కెరీర్ లో ఫస్ట్ టైమ్ తన స్టైల్ కాకుండా జోనర్ మార్చేసాడు విక్రమ్. రొటీన్ కథ నమ్ముకుని తప్పులో కాలేసాడేమో అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత. ఈ చిత్ర కథ ముందే చెప్పాడు దర్శకుడు. అలాంటప్పుడు కచ్చితంగా స్క్రీన్ ప్లే టైట్ గా ఉండాలి.. గ్రిప్పింగ్ గా రాసుకోవాలి.. విక్రమ్ కు అది వెన్నెతో పెట్టిన విద్య కదా కచ్చితంగా రాసుకునే ఉంటాడులే అనుకుంటారు అంతా. కానీ అది జరగలేదు. గ్యాంగ్ లీడర్ ను రొటీన్ స్క్రీన్ ప్లే ముంచేసింది. కథలో ఎక్కడా స్పీడ్ పెంచుకుండా.. కథనంలో నెమ్మదించడం కథ సాగుతున్న తీరు అసహనం తెప్పిస్తుంది. రొటీన్ స్క్రీన్ ప్లేతో సాగే సన్నివేశాలు విసుగు పుట్టిస్తాయి. ఫస్టాఫ్ అంతా రివేంజర్స్ ఒకే చోటికి చేరడం.. తాము చంపాలనుకున్న ఆరోవాడిని కనిపెట్టడంతో అయిపోతుంది. కానీ సెకండాఫ్ అంతా అతన్ని చంపడానికి బలమైన సన్నివేశాలు మాత్రం లేవు.. పైగా ఫ్లాష్ బ్యాక్ కూడా ఆసక్తికరంగా అనిపించదు. పైగా 300 కోట్లు కొట్టేసి ఏడాదిన్నరగా పోలీసులకు దొరకని దొంగ.. హీరో అండ్ గ్యాంగ్‌కు కేవలం రెండు మూడు రోజుల్లోనే దొరికిపోవడం లాజిక్ లేకుండా అనిపిస్తుంది. క్లైమాక్స్ వరకు కథనం ఆసక్తికరంగా లేకపోవడంతో గ్యాంగ్ లీడర్‌ అంచనాలు అందుకోలేదు. సెకండాఫ్ పూర్తిగా వన్ సైడెడ్ గా కథ నడవడం.. హీరో ఏం చెప్తే అదే జరగడం.. విలన్ ను పూర్తిగా బఫూన్ లా మార్చేయడం అంతగా ఆకట్టుకోలేదు. క్లైమాక్స్ కూడా వీక్ గానే అనిపిస్తుంది.

నటీనటులు:

నాని తనదైన నటనతో మరోసారి మెప్పించాడు. పెన్సిల్ పాత్రలో ఒదిగిపోయాడు. అక్కడక్కడా కామెడీ టైమింగ్‌తో బాగానే నవ్వించాడు కూడా. కార్తికేయ విలన్ గా అదిరిపోయాడు. కానీ ఈయన చెప్పినంత స్థాయిలో ఆ పాత్ర లేదు. ప్రియాంక మోహన్ కొత్తమ్మాయే అయినా కూడా బాగా చేసింది. స్క్రీన్ పై చాలా అందంగా ఉంది. లక్ష్మి, శరణ్య, ప్రాణ్య గ్యాంగ్ కూడా బాగానే ఉన్నారు. వెన్నెల కిషోర్ రెండు సీన్స్‌లో బాగానే నవ్వించాడు.

టెక్నికల్ టీం:

క్యూబా సినిమాటోగ్రఫీ బాగుంది. మన భాష, దేశం కాకపోయినా సినిమాకు బౌండరీస్ లేవని నిరూపించాడు. అనిరుధ్ సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నిను చూసే, హొయనా సాంగ్స్ అదిరిపోయాయి. ఆర్ఆర్ కూడా బాగుంది. ఇక ఎడిటింగ్ మాత్రం వీక్. కొన్ని సన్నివేశాలు కథకు అడ్డు పడినట్లు అనిపించాయి. దర్శకుడిగా విక్రమ్ కే కుమార్ తొలిసారి ఫెయిల్ అయ్యాడేమో అనిపిస్తుంది. ఇంత రొటీన్ కథను ఆయనెప్పుడూ రాసుకోలేదు. 1,2,3 అంటూ లెక్కలేసుకుని రాసుకున్న స్క్రీన్ ప్లేలా అనిపించింది. ప్రతీ సీన్ ముందే ఊహకు వచ్చేస్తుంది. ఓవరాల్‌గా గ్యాంగ్ లీడర్ ఆయన నుంచి ఊహించే సినిమా మాత్రం కాదు..

చివరగా ఒక్కమాట: గ్యాంగ్ లీడర్.. పగ ఉన్నా కథనం లేదు..

రేటింగ్ : 2.5 / 5.

More Related Stories