జార్జ్ రెడ్డి రివ్యూGeorge Reddy
2019-11-22 10:32:32

జార్జ్ రెడ్డి.. ఇఫ్పుడు తెలుగు ఇండస్ట్రీలో ట్రెండింగ్ టాపిక్. చనిపోయిన 45 ఏళ్ళ తర్వాత ఆయన జీవితంపై బయోపిక్ వచ్చింది.. దానికితోడు వివాదాలతో కూడా ఎక్కువగా పాపులర్ అయింది ఈ చిత్రం. మరి ఈ జార్జ్ రెడ్డి జనాన్ని ఎంతవరకు ఆకట్టుకున్నాడు అనేది చూద్దాం.. 

కథ:

చిన్నపుడే తండ్రి చనిపోయినా కూడా అమ్మ పాలనలో అన్నీ నేర్చుకుంటాడు జార్జ్ రెడ్డి (సందీప్ మాధవ్). చిన్నతనం నుంచే అన్యాయాన్ని ఎదురించడం అనేది నేర్చుకుంటాడు. కేరళలో పుట్టి పెరిగిన జార్జి రెడ్డి (సందీప్ మాధవ్) ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వస్తాడు. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెడతాడు. ఆయన వచ్చేసరికి యూనివర్సిటీ అట్టుడుకుతూ ఉంటుంది. ప్రతీ విషయానికి అక్కడ గొడవలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అగ్రకులాల ఆధిపత్యం నడుస్తుంటుంది.. అది చూసి అస్సలు తట్టుకోలేకపోతాడు జార్జ్ రెడ్డి. ప్రతీ విషయాన్ని గల్లాపట్టి మరీ ప్రశ్నిస్తాడు. అగ్రకులాల ధోరణి చూసి వాళ్లపై తిరగబడతాడు. విద్యార్థులకు అన్యాయం చేయాలనుకున్న వాళ్లను పరిగెత్తించి మరీ కొడతాడు. ఏ చిన్న తప్పు జరిగినా కూడా వచ్చి గల్లా పట్టుకుని మరీ నిలదీస్తుంటాడు. అది ఇతర స్టూడెంట్ యూనియన్లకు అస్సలు నచ్చదు. దాంతో పాటు అన్ని విషయాలపై కూడా ఉద్యమం లేవదీస్తాడు జార్జ్. అదే సమయంలో కాలేజీలో జరిగే స్టూడెంట్ పాలిటిక్స్‌లో కూడా వచ్చి తన సత్తా చూపించి నాయకుడిగా ఎదుగుతాడు. అలాంటి సమయంలో జార్జి రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు వ్యక్తులు ఆయనను చంపేయాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ..

కథనం:

జార్జ్ రెడ్డి.. ఈ మధ్యకాలంలో బాగా వినిపించిన పేరు ఇది.. నిజానికి ఈ సినిమా పోస్టర్ విడుదల అయ్యేంతవరకు.. చాలా మందికి ఈ తరంలో అసలు జార్జ్ రెడ్డి అనే ఒక స్టూడెంట్ లీడర్ ఉన్నాడన్న సంగతి తెలియకపోవచ్చు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై ఎందుకో తెలియని ఆసక్తి కలిగింది.. అక్కడినుంచే అసలు ఎవరు ఈ జార్జ్ రెడ్డి అనే వాదన మొదలైంది. పాతికేళ్లు కూడా నిండకుండానే అంత పేరు ఎలా సంపాదించాడు.. 60 కత్తి పోట్లు పొడిచి చంపారంటే.. అతడు అంతగా ఏం చేశాడు అనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది.. ఈయన గురించి ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పారు.. కొందరికి హీరో.. కొందరికి విలన్.. దాంతో సినిమా ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ తెలియకుండానే పెరుగుతూ వచ్చింది.. దర్శకుడు జీవన్ రెడ్డి సినిమాను మొదలు పెట్టిన విధానం బాగుంది. ఆయన నిజం చూపించాడో అబద్ధం చూపించాడో తెలియదు కానీ.. జార్జ్ రెడ్డి పాత్రను తీర్చిదిద్దిన విధానం మాత్రం ఆకట్టుకుంటుంది.. కానీ ఎందుకో తెలియదు హీరో క్యారెక్టరైజేషన్ లో కనిపించిన ఆవేశం కథలో కనిపించలేదు. అతడిలో ఉన్న ఆవేశాన్ని ఆవిష్కరించే సన్నివేశాలు సినిమాలో ఎక్కడా పెద్దగా కనిపించలేదు. చాలా చోట్ల కేవలం జార్జ్ రెడ్డిని హైలైట్ చేసే ప్రయత్నం చేసాడు దర్శకుడు జీవన్ రెడ్డి.. ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు కూడా. ఎంతసేపు కథ మొత్తం ఉస్మానియా క్యాంపస్ చుట్టూనే తిరగడం.. మాట్లాడితే హీరో వెళ్లి తిరగబడటం లేదంటే కొట్టడం వీటితోనే సినిమా అంతా గడిచిపోయినట్టు అనిపించింది. జార్జ్ రెడ్డి చేస్తున్న ఉద్యమం తాలూకు బలమైన సన్నివేశాలు ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. దానికి తోడు కొన్ని క్యారెక్టర్లు అసంపూర్తిగా వదిలేశాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే ఇంకాస్త పకడ్బందీగా ఉండుంటే జార్జ్ రెడ్డి రేంజ్ మరోలా ఉండేది.. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండాఫ్ బాగుంది. సినిమా అంతటికీ క్లైమాక్స్ హైలైట్.. ఎమోషనల్ టచ్ ఇచ్చి అదరగొట్టాడు దర్శకుడు.. స్టూడెంట్స్ కు కనెక్ట్ అయ్యే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి.. ఓవరాల్ గా జార్జ్ రెడ్డిలో ఆవేశం అదిరింది.. ఆవేశం మాత్రమే. బరువెక్కిన హృదయంతో థియేటర్ నుంచి బయటకు రావడం ఖాయం. స్టూడెంట్స్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు సినిమాలో ఉన్నాయి.

నటీనటులు:

ఇక ఈ తరానికి జార్జి రెడ్డి ఎలా ఉంటాడో తెలియదు.. కానీ ఉంటే ఇలాగే ఉంటాడేమో అనేలా ఈ పాత్రలో జీవించాడు సందీప్ మాధవ్. ఆ పాత్రను పూర్తిగా ఓన్ చేసుకున్న విధానం అద్భుతంగా ఉంది. సత్యదేవ్, చైతన్యకృష్ణ, మనోజ్, నందం చిన్న చిన్న పాత్రల్లో పర్వాలేదనిపించారు. హీరోయిన్ ముస్కాన్ కూడా చిన్న పాత్రలో కనిపించింది. మిగిలిన వాళ్లంతా కొత్త వాళ్లే.

టెక్నికల్ టీం:

జార్జి రెడ్డి సినిమాకు సంగీతం ప్రాణం. సురేష్ బొబ్బిలి అద్భుతమైన ఆర్ఆర్ అందించాడు. చాలా సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని నిలబెట్టింది. ప్రతాప్ కుమార్ ఎడిటింగ్ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది అనిపించింది. సుధాకర్ రెడ్డి ఎక్కండి సినిమాటోగ్రఫీ బాగుంది. ఉస్మానియా క్యాంపస్‌ను చాలా అద్భుతంగా చూపించాడు. ఇక దర్శకుడు జీవన్ రెడ్డి తాను అనుకున్నది అనుకున్నట్లుగా స్క్రీన్ పై చూపించే ప్రయత్నం చేశాడు. కానీ ఈ క్రమంలో జార్జి రెడ్డి గురించి.. ఆయన ఆవేశం గురించి తెలుసుకున్నాడు కానీ దాన్ని స్క్రీన్ పై మరింత పదునుగా ప్రజెంట్ చేయడంలో మాత్రం కాస్త విఫలమైనట్లు కనిపించింది. ఏదేమైనా కూడా చరిత్ర మరచిపోయిన ఒక నాయకుడిని స్క్రీన్ పై బాగానే ఆవిష్కరించాడు ఈ దర్శకుడు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. 

చివరగా: జార్జ్ రెడ్డి.. ఆవేశం బాగుంది.. కథనం ఉండుంటే అదిరేది.. 

రేటింగ్: 2.75 /5.

 

More Related Stories