మీటూ దెబ్బ: ప్రముఖ దర్శకుడికి 23ఏళ్ల జైలు !meeto
2020-03-13 06:56:23

లైంగిక వేధింపులు అత్యాచార ఆరోపణలుతో సాగిన మీటూ ఉద్యమంతో తొలి సారిగా ఒకరికి శిక్ష పడింది. తన పలుకుబడిని ఉపయోగించుకుని మహిళలను లోబర్చుకున్నారని  హాలీవుడ్‌ డైరెక్టర్‌ హార్వే వైన్‌స్టీన్‌పై దాదాపు 80 మంది మహిళలు ఆరోపణలు చేశారు. విచారణలో 67 సంవత్సరాల హార్వే వైన్‌స్టీన్‌ దోషిగా తేలడంతో... అతనికి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యూ యార్క్‌ కోర్టు. తాము హాలీవుడ్‌లో ప్రవేశించిన మొదటి రోజుల్లో హార్వే వైన్‌స్టీన్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్నది నటీమణులు ఏంజెలినా జోలీ, గ్వెనెత్ పాల్ట్రో, ఉమా ట్రూమన్‌, సల్మా హయెక్‌ల ఆరోపణ. వీరే కాదు దాదాపు 80 మంది మహిళలు ఇదే తరహా ఆరోపణలు చేశారు.  ఈ ఆరోపణలే అప్పట్లో మీటూ ఉద్యమానికి ఊపిరిపోశాయి. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరెంతోమంది మహిళలు తమపై జరిగిన అనుచిత, అసభ్య ప్రవర్తనల వివరాలను ధైర్యంగా బయటపెట్టారు.

హార్వే వైన్‌స్టీన్‌పై అత్యాచార ఆరోపణలు అక్టోబర్ 2017లో వెలుగుచూశాయి. దశాబ్దాల క్రితం జరిగిన ఆ ఘటనల గురించి న్యూయార్క్ టైమ్స్ తొలిసారిగా ప్రచురించింది. దీంతో, తాను ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమాపణ కోరుతున్నానంటూ ఓ ప్రకటన విడుదల చేశారు హార్వే వైన్‌స్టీన్‌. కానీ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారాయన. ఆ తర్వాత మరింత మంది మహిళలు ఆయనపై ఆరోపణలు చేశారు. దీంతో ఆయనను కంపెనీ బోర్డు నుంచి తొలగించారు. హార్వే వైన్‌స్టీన్‌ లైంగిక వేధింపులపై 2017లో విచారణ ప్రారంభం కాగా, 2018 అభియోగాలు నమోదయ్యాయి. తనపై వచ్చిన అన్ని ఆరోపణలనూ తోసిపుచ్చుతూ వచ్చారు వైన్‌స్టీన్‌. తన మాజీ ప్రొడక్షన్ అసిస్టెంట్ మిమి హలేయీపై 2006లో వేధింపులు, మాజీ నటి జెస్సికా మాన్‌పై 2013లో అత్యాచారం కేసుల్లో అతన్ని దోషిగా తేల్చింది జ్యూరీ. ఆయనను వెంటనే జైలుకు తరలించాలని జడ్జి ఆదేశించారు. కానీ, మరో రెండు కేసుల్లో మాత్రం ఆయనను నిర్దోషిగా తేల్చారు. ఈ నేరాలు కూడా రుజువై ఉంటే జీవిత ఖైదు పడేది.  

వైన్‌స్టీన్ కోర్టుకు వీల్ చైర్‌లో హాజరయ్యారు. ఆయన తరపు లాయర్లు తక్కువ శిక్ష విధించాలని కోర్టుకు విన్నవించారు. కనీస శిక్ష 5 ఏళ్లు విధించినా అది ఆయనకు జీవితఖైదు లాంటిదేనని వారు వాదించారు. ఆరోపణలు చేస్తున్న వాళ్ల అంగీకారంతోనే సెక్స్‌ జరిగిందని డిఫెన్స్ లాయర్ వాదించారు. ఈ సంబంధాన్ని వారు తమ కెరీర్లో ఎదగడానికి వాడుకున్నారని తెలిపారు. ఇప్పుడు పశ్చాత్తాప పడుతూ దాన్ని రేప్‌గా చిత్రీకరిస్తున్నారని కోర్టుకు వివరించారు డిఫెన్స్‌ లాయర్‌. తనపై వైన్‌స్టీన్ అత్యాచారానికి పాల్పడ్డారని చెబుతున్న తేదీల తర్వాత కూడా ఆ మహిళలు ఆయనతో సంబంధాలు కొనసాగించారనే విషయాన్ని ప్రస్తావించారు.  మరోవైపు తన పలుకుబడిని ఉపయోగించుకుని వైన్‌స్టీన్ ఎంతోమంది మహిళలను లోబర్చుకున్నారని ప్రాసిక్యూషన్ వాదించింది. దీంతో ఏడుగురు పురుషులు, ఐదుగురు మహిళలు సభ్యులుగా ఉన్న జ్యూరీ ఐదు రోజుల చర్చల తర్వాత హార్వే వైన్‌స్టీన్‌కు 23 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. తీర్పు అనంతరం వైన్‌స్టీన్ ఎలాంటి ఉద్వేగానికి లోనుకాలేదు. తన లాయర్ డోనా రోటునోతో మాట్లాడుతూ కనిపించారు. మరోవైపు తమ పోరాటం ఇంకా పూర్తి కాలేదని వైన్‌స్టీన్‌ లాయర్ రోటునో. ఈ తీర్పుపై తాము అపీల్ చేస్తామని ఆమె తెలిపారు.

 

More Related Stories